- అభిప్రాయ సేకరణకు 10 టీముల ఏర్పాటు
- నెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తి
- రూ.24. 24 కోట్లతో 336 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
యాదాద్రి, వెలుగు: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి పునర్నిర్మాణ ప్రక్రియ హామీ ఇచ్చిన మూడేళ్లకు కొలిక్కి వచ్చింది. అనుకున్నట్టుగా జరిగితే ఈ నెలాఖరునాటికి టెండర్లు పూర్తి చేసి ఇండ్ల కూల్చివేత పనులు ప్రారంభిస్తారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని 2020 నవంబర్‌లో దత్తత తీసుకున్న సీఎం బంగారు వాసాలమర్రిగా మారుస్తానని 2021 ఆగస్టులో హామీ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఊళ్లో ఇండ్ల నిర్మాణాలకు కూడా పర్మిషన్లు ఇవ్వలేదు.
ఈ ఏడాది జనవరి 24న గ్రామసభ నిర్వహించి ప్రస్తుతం ఉంటున్న ఇండ్ల స్థలాలను గ్రామ అభివృద్ధి కమిటీకి అప్పగించాలని, కొత్త ఇంటి కోసం అగ్రిమెంట్చేసుకోవాలని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకూ ఎవరూ అగ్రిమెంట్ ఇవ్వలేదు. ఈ గ్రామ పునర్నిర్మాణం కోసం ఈ ఏడాది ఏప్రిల్ 18న స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ. 58.57 కోట్లు మంజూరు చేస్తూ జీవో నెంబర్159ని ప్రభుత్వం రిలీజ్చేసింది.
ఇక్కడే ఉంటరా..? పిల్లల వద్దకు వెళ్తరా..?
పునర్నిర్మాణ పనులు ప్రారంభమైతే గ్రామస్థులు ఇండ్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. గ్రామంలో మొత్తం ఇండ్లను తిరిగి నిర్మించడానికి గతంలోనే ఆఫీసర్లు లే అవుట్ తయారు చేశారు. ఇందులో 103 పక్కా ఇండ్లు ఉన్నాయి. ఇవి కాక మిగిలిన 336 పెంకుటిండ్లను తొలగించి, వాటి స్థానంలో రూ. 24.24 కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాల్సి ఉంటుంది. ఇండ్లు కూలిస్తే ఈ కుటుంబాలు ఎక్కడ ఉంటాయన్నది తేలాల్సిఉంది. ఇండ్లు కూలగొట్టిన తర్వాత ఇక్కడే ఉంటారా..? పిల్లల వద్దకు వెళ్తరా..?' అని గ్రామస్తులను అడిగి తెలుసుకోవాలని ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పది టీములను ఏర్పాటు చేసి మూడు రోజుల్లో 336 కుటుంబాల అభిప్రాయం తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.
తాత్కాలిక నివాస ఏర్పాట్లు
ఇండ్లు కూలగొట్టిన తర్వాత కూడా ఇక్కడే ఉండాలనుకునే వారి కోసం తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాతే 189 సర్వే నెంబర్లోని 11 ఎకరాల్లో గానీ, కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్లో గ్రామానికి ఇచ్చే 10 శాతం ల్యాండ్లోగానీ ఈ నివాసాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అనంతరం గ్రామంలో 4 ప్రధాన రోడ్లు, 30 లింక్ రోడ్లతో పాటు 336 ఇండ్లు, పార్కులు, ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తారు. పాత ఇండ్లు కూల్చి వాటి స్థానంలో ఒక్కొక్కరికి 200 గజాల స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తారు. వచ్చే ఎన్నికల్లో వాసలమర్రి అంశం ప్రతిపక్షాలకు అస్త్రం కాకూడదనే ఇండ్ల నిర్మాణంతో పాటు గ్రామఅభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని ప్రభుత్వం అనుకుంటుంది.
పునర్నిర్మాణంపై కలెక్టర్ రివ్యూ
వాసాలమర్రి పునర్నిర్మాణంపై యాదాద్రి కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి శనివారం రివ్యూ నిర్వహించారు. దీనికి సంబంధించిన లే అవుట్‌ను పరిశీలించారు. అనంతరం ఆఫీసర్లతో మాట్లాడారు. నెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తై ఇండ్ల కూల్చివేత పనులు ప్రారంభమవుతాయి కాబట్టి.. గ్రామస్థులు తాము ఎక్కడ నివాసం ఉంటారో మూడు రోజుల్లో అభిప్రాయం సేకరించాలని ఆదేశించారు.
అనంతరం కొత్తగా నిర్మిస్తున్న జడ్పీ హైస్కూల్, అంగన్వాడీ సెంటర్లు, పీహెచ్సీ భవనాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ జీ వీరారెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ జినుకల శ్యాంసుందర్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్ కుమార్, పలు డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు ఉన్నారు.