కేసీఆర్ ఏరియల్ సర్వే షెడ్యూల్

భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితిని సమీక్షించేందుకు వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్.. రేపు ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించనున్నారు. రెండ్రోజుల పాటు ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే కొనసాగనుంది. 

ఆదివారం ఉదయం 7 గంటలకు సీఎం కేసీఆర్ వరంగల్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. ఉదయం 7.45 గంటలకు భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అనంతరం వరద పరిస్థితి, సహాయ, పునరావాస కార్యక్రమాలపై అక్కడి అధికారులతో చర్చించనున్నారు. ఉదయం 9.30గంటలకు భద్రాచలం నుంచి బయలు దేరి 9.45గంటలకు ఏటూరు నాగారం, ములుగు మండలాల్లో పరిస్థితిని సమీక్షించనున్నారు. 11 గంటలకు అక్కడి నుంచి బయలు దేరి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

హైదరాబాద్ చేరుకున్న అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆదివారం హైదరాబాద్ లోనే బస చేసి.. సోమవారం తిరిగి గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితి గురించి ఏరియల్ సర్వే తెలుసుకోనున్నారు.