- అంచనా వ్యయం రూ. 1,340 కోట్లు
- మూడేండ్ల క్రితమే డీపీఆర్ రెడీ
- ఇప్పటికీ నయా పైసా ఇయ్యని రాష్ట్ర సర్కారు
వరంగల్ అంటే నాకు ఎనలేని ప్రేమ. అందుకే హైదరాబాద్ తర్వాత వరంగల్ ట్రై సిటీలోనూ మెట్రో రైల్ నడుపుతం. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వం. త్వరలోనే దీనికి సంబంధించి డీపీఆర్ కంప్లీట్ చేసి పనులను పట్టాలెక్కిస్తం. – ఐదేండ్లుగా సీఎం కేసీఆర్ చెబుతున్న మాట.
వరంగల్ పబ్లిక్ ఊహించిన దానికంటే వేగంగా సిటీలో ఐటీ రంగాన్ని విస్తరిస్తం. రాబోయే రోజుల్లో వరంగల్ ప్రాంతాన్ని ముంబై, పుణెలా మారుస్తాం. మామునూర్ ఎయిర్పోర్ట్ను పునరుద్ధరిస్తం. ఈజీ జర్నీ కోసం ట్రై సిటీలో మోనో లేదంటే మెట్రో రైళ్లలో ఏదో ఒకటి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. – 2020 జనవరి 7న టెక్ మహీంద్రా ప్రారంభోత్సవంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.
వరంగల్, వెలుగు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి వరంగల్ మెట్రో నియో రైల్ ప్రాజెక్ట్ గురించి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ.. పనులు మాత్రం పట్టాలెక్కడం లేదు. ఐదేండ్ల క్రితమే సీఎం కేసీఆర్ హైదరాబాద్ తరహాలో వరంగల్ మెట్రో ట్రెయిన్ ప్రాజెక్ట్ విషయమై ఓరుగల్లు జనాలకు మాటిచ్చారు. మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చినపుడల్లా వరంగల్ నియో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంటారు. 2018లో రెండోదఫా ఎమ్మెల్యే ఎన్నికలు, 2019 ఎంపీ ఎలక్షన్స్, 2020 ఐటీ కంపెనీల ప్రారంభం, 2021 ఏప్రిల్‍లో గ్రేటర్ కార్పొరేషన్ ఎలక్షన్ల ప్రచారపుడు అదిగో మెట్రో.. ఇదిగో నియో అంటూ కేటీఆర్ హంగామా చేశారు. హైదరాబాద్‍లో ఒక్కో రూట్‍లో మెట్రో పనులు పూర్తవుతుండగా.. వరంగల్లో మాత్రం కనీసం పనులు మొదలుపెట్టేలా ప్రభుత్వ పెద్దలు, లోకల్ అధికార పార్టీ లీడర్లు చొరవ తీసుకోవడం లేదు.
17 కిలోమీటర్లు ఫుల్ ట్రాఫిక్
గ్రేటర్ వరంగల్ జనాభా 11 లక్షల వరకు ఉంది. ఇటీవలి కాలంలో కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. వేలాది ఆటోలతో సిటీలో ట్రాఫిక్ పెరుగుతోంది. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి హనుమకొండ మీదుగా కాజీపేట రైల్వే స్టేషన్ వరకు దాదాపు 15 నుంచి 17 కిలోమీటర్ల దూరం 24 గంటలూ రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. పండుగలు, లీడర్ల మీటింగులు, ఇతర కార్యక్రమాలపుడు రోడ్లపై నడవలేని పరిస్థితి ఉంటోంది. దీనిని గమనించిన ప్రభుత్వం ఐదేండ్ల క్రితం గ్రేటర్ వరంగల్లో మెట్రో లేదంటే నియో రైల్ తీసుకొస్తామని చెప్పింది. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఫాతిమానగర్, సుబేదారి, అంబేద్కర్ జంక్షన్, హనుమకొండ చౌరస్తా, ములుగు రోడ్, ఎంజీఎం, పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ, వెంకట్రామ టాకీస్ మీదుగా వరంగల్ రైల్వే స్టేషన్ వరకు దాదాపు 21 స్టేషన్లతో రూట్ మ్యాప్ ఉంటుందని వెల్లడించారు.
2020లో డీపీఆర్ ఇచ్చిన్రు
వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041కు అనుగుణంగా మెట్రో నియో పనులను వేగవంతం చేస్తున్నట్లు అప్పటి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. పనుల సాధ్యాసాధ్యాల పరిశీలనను మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‍కు అప్పజెప్పారు. జిల్లా కలెక్టర్, గ్రేటర్ కార్పొరేషన్ ఆఫీసర్లు దీనికి సంబంధించి సర్వే చేయించారు. లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. అధికారులతో 30 నుంచి 40 సార్లు రివ్యూలు నిర్వహించారు. పనులకు ఓసారి రూ.1,100 కోట్లు, మరోసారి రూ.1,340 కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున నిధులు సమకూర్చుకోవాల్సి ఉంది. అర్బన్ మాస్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (యూఎంటీఎస్) మహా మెట్రో, నాగపూర్, హైదరాబాద్, పుణె టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో ‘కుడా’ 2020 జనవరిలో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. కానీ నేటికీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు.
కేటీఆర్ లేఖలో.. వరంగల్ మెట్రో ఊసే తీయలే
వరంగల్ మెట్రో విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏండ్ల తరబడి హామీలు ఇస్తున్నారు తప్పితే ఫండ్స్ విషయంలో కనీస శ్రద్ధ చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్ కేటాయింపులో వరంగల్ ఊసే తీయడం లేదు. 2021 రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి రూ.1000 కోట్లు కేటాయించగా.. వరంగల్ మెట్రోకు మాత్రం నయా పైసా ఇవ్వలేదు. మంత్రి కేటీఆర్ సోమవారం హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ కోసం రూ.8,453 కోట్లు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లెటర్రాశారు. అదే సమయంలో వరంగల్ మెట్రో నియో ఊసే ఎత్తలేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ఇస్తున్న హామీలను హైదరాబాద్ వెళ్లాక లైట్ తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.