- ఎన్నికలయ్యాక బస్వాపూర్ రిజర్వాయర్ ప్రారంభం
- స్పెషల్ ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు
- పైళ్ల శేఖర్ రెడ్డిని 50 వేల మెజారిటీతో గెలిపించండి
- ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
యాదగిరిగుట్ట, వెలుగు : భువనగిరిని బంగారు తునక లెక్క అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి నియోజకవర్గం హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్నందున స్పెషల్ ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తానని ఇచ్చారు.
నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్ 98 శాతం కంప్లీట్ అయిందని చెప్పారు. మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రిజర్వాయర్ ను ప్రారంభించి, భువనగిరి ప్రజలతో కలిసి భోజనం చేస్తానన్నారు. దీని ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2014, 2018లో పైళ్ల శేఖర్ రెడ్డిని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన భువనగిరి ప్రజలు.. వచ్చే ఎన్నికల్లోనూ ఆదరించాలని కోరారు. పైళ్లకు 50 వేల ఓట్ల మెజారిటీతో ఇవ్వాలని, రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
బతుకమ్మ నిమజ్జనానికి నీళ్లు లేకుండే : పైళ్ల
2014కు ముందు భువనగిరిలో బతుకమ్మను నిమజ్జనం చేద్దామన్నా నీళ్లు ఉండేవి కావని బీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో కల్వకుంట్ల కవిత బతుకమ్మ సంబరాలకు వచ్చిన సందర్భంలో జేసీబీలతో గుంతలు తవ్వి నీటిని నింపాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కృషితో చెరువులు, కుంటలన్నీ నిండుకుండలా మారాయన్నారు. త్వరలోనే బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా భువనగిరి ప్రాంతం జలకళను సంతరించుకోబోతోందని చెప్పారు. తనకు మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
12 నిమిషాలే ప్రసంగించిన కేసీఆర్
బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కేవలం 12 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. సాయంత్రం 5:28 గంటలకు వేదికపైకి చేరుకున్న ఆయన తన ప్రసంగాన్ని 5:31 గంటలకు ప్రారంభించి 5:43 గంటలకు ముగించారు. స్టేజ్ పైన కూర్చున్న మంత్రి జగదీశ్ రెడ్డి సహా మిగతా ఎవరికీ మాట్లాడే అవకాశం లభించలేదు. భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డికి మాత్రమే రెండు నిమిషాలు మాట్లాడారు. కాగా, సభ నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీ మైదానంతో పాటు ప్రధాన రోడ్లన్నీ ఫ్లెక్సీలు, గులాబీ హోర్డింగులతో నిండిపోయాయి. సభ ప్రారంభానికి ముందు కళాకారులు ఆటపాటలతో అలరించారు.
బస్వాపూర్ నిర్వాసితుల ముందస్తు అరెస్ట్
ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపూర్ భూ నిర్వాసితులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ ను అడ్డుకుంటారని సమాచారం ఉండడంతో అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. సభకు అనంతరం వారిని వదిలిపెట్టారు. అరెస్ట్ అయినవారిలో వల్దాస్, రాజు, కాళభైరవ పలువురు ఉన్నారు.