మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దివ్యాంగులకు పింఛన్‌ను మరో వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించారు.వికలాంగులకు వచ్చే నెల నుంచి రూ. 4,116 పెన్షన్ ఇస్తామని వెల్లడించారు. మంచిర్యాల గడ్డ, తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ఈ ప్రకటన చేయాలని తాను దీనిని సస్పెన్షన్ లో పెట్టానన్నారు. అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ వెల్లడించారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా కొత్త కలెక్టరేట్, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు సీఎం కేసీఆర్.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే ఒక్క తెలంగాణలోనే 54 లక్షల ఎకరాల్లో వరి పండుతుందన్నారు.
2014 లో అధికారంలోకి వచ్చాక సింగరేణి రాత,నడక మారిందన్నారు కేసీఆర్. కార్మికులకు లాభాల వాటాను పెంచామని చెప్పారు. వచ్చే దసరా కు 700 కోట్ల బోనస్ ను కార్మికులకు ఇస్తామని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి ప్రాంత ప్రజలకు ఇండ్ల పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు.
బీజేపీ ప్రభుత్వం సింగరేణి ని ప్రైవేట్ పరం చేస్తా అంటోందని, ఇదోక దిక్కుమాలిన చర్య అని కేసీఆర్ అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోదని, ధరణిని తీసేసి దళారుల రాజ్యం తేస్తారా అని ఆ పార్టీ నాయకులను కేసీఆర్ ప్రశ్ని్ంచారు.