రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దనే రూ.10 వేలు ఇస్తున్నాం : సీఎం కేసీఆర్

రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దనే రూ.10 వేలు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.  కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపూర్ లో సీఎం కేసీఆర్ పర్యటించారు.  అకాల వర్షాలకు దెబ్బతిన్న  పంట పొలాలను ఆయన పరిశీలించారు. మరో రెండు,మూడు  సార్లు వడగండ్ల వాన రావోచ్చునని అప్రమత్తంగా ఉండాలని రైతులకు  కేసీఆర్ సూచించారు.   అకాల వర్షాలతో నష్టపోయిన రాష్ట్ర  రైతులను తామే ఆదుకుంటామన్నారు. ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని,   వెంటనే వీటిని రైతులకు అందజేస్తామని తెలిపారు.

అన్ని జిల్లాలలో  అకాల వర్షాలతో 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లుగా కేసీఆర్ వెల్లడించారు.  1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8,865 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిందని తెలిపారు.  పంట నష్టంపై కేంద్రాన్ని సహయం అడిగే ప్రసక్తి  లేదన్నారు. పంట నష్టంపై నివేదికలు పంపినా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు.  పూర్తిగా  రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.  ప్రస్తుతం 84 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉందని తెలిపారు . యాసంగి సాగులో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారు.  కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటలు బాగా పండుతున్నాయని కేసీఆర్ అన్నారు.