- ఆ తర్వాత అనౌన్స్ చేసిన బీసీ, మైనార్టీ బంధు అమల్లోకి..
- ఇప్పటికే గిరిజనులకు పథకాలు, సబ్సిడీలు బంద్
- తమకూ సాయం చేయాలంటున్న గిరిజన సంఘాలు
కరీంనగర్, వెలుగు : దళిత బంధు మాదిరిగానే గిరిజనబంధును అమలు చేసి తీరుతామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించి ఏడాదైనా ఆ స్కీమ్ జాడ లేకుండా పోయింది. మూడు నెలల క్రితం ప్రకటించిన బీసీ బంధు, మైనార్టీ బంధులాంటి స్కీమ్ లు ఇప్పటికే పట్టాలెక్కగా..గిరిజన బంధుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి గైడ్ లైన్స్ రూపొందించలేదు. సరిగ్గా ఏడాది క్రితం మునుగోడు ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 17న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో గిరిజన బంధుపై సీఎం కేసీఆర్ తొలిసారి ప్రకటన చేశారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో దళితబంధు స్కీమ్ ను ప్రకటించినట్లే..మునుగోడు ఎన్నికల కోసమే గిరిజన బంధు స్కీమ్ ను ప్రకటించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. భూమిలేని గిరిజన బిడ్డలకు త్వరలో గిరిజన బంధు ప్రారంభిస్తామని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలులేని గిరిజన కుటుంబాలను ఆదుకుంటామని ఈ ఏడాది ఫిబ్రవరి10న అసెంబ్లీ సాక్షిగా మరోసారి సీఎం హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ స్కీమ్ కోసం రూపాయి కూడా కేటాయించలేదు. ఏడాదైనా ఈ స్కీమ్ అమలుపై ఇప్పటికీ ఎలాంటి గైడ్ లైన్స్ విడుదల చేయలేదు.
ALSO READ: జిట్టా ఆశలు నెరవేరేనా..? 2009 నుంచి ఇండిపెండెట్గానే..
పోడు పట్టాల పంపిణీ ముగిసినా.. స్కీమ్ స్టార్ట్ చేయలే
పోడు పట్టాల పంపిణీ తర్వాత ఇంకా ఎవరైనా గిరిజనులు భూమి లేకుండా, ఏ రకమైన ఉపాధి లేక పేదరికంలో ఉంటే, వారిని గుర్తించి రాబోయే రోజుల్లో గిరిజన బంధు ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫిబ్రవరి 13న అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 4,06,369 ఎకరాలకు సంబంధించి 1,51,146 మందికి జూలై నెలలో రాష్ట్ర ప్రభుత్వం పోడు పట్టాలు పంపిణీ చేసింది. ఇప్పటికే పట్టా భూములు కలిగి రైతు బంధు పొందుతున్న గిరిజన రైతులు 8.24 లక్షల మంది ఉన్నట్లు సర్కార్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. పట్టాదారు పాస్ బుక్స్ కలిగిన రైతులు, పాతవి, కొత్తగా జారీ చేయబోయే పోడు హక్కు పత్రాలు కలిగిన పోడు రైతుల సంఖ్య కలిపితే మొత్తం గిరిజన రైతుల సంఖ్య 9.75 లక్షలకు చేరింది. అయినా భూమి లేని గిరిజన కుటుంబాలు మరో 3 లక్షల వరకు ఉంటాయని అంచనా. జూలై నెలలో పోడు పట్టాల పంపిణీ ముగిసినా, భూమి లేనోళ్ల విషయంలో క్లారిటీ వచ్చినా గిరిజన బంధు స్కీమ్ పై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
గిరిజనులకు స్కీముల్లేవ్
రాష్ట్రంలో గిరిజన కార్పొరేషన్ లో సబ్సిడీ లోన్లు చాలా కాలంగా బందయ్యాయి. గిరిజన నిరుద్యోగ యువత కోసం తీసుకొచ్చిన డ్రైవర్ ఎంపవర్ మెంట్ స్కీంను ప్రభుత్వం మూడేండ్లుగా అమలు చేయడం లేదు. ఈ పథకానికి నిధులు ఇవ్వడం లేదు. ఈ స్కీం కోసం సుమారు లక్ష మంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు. తొమ్మిదేండ్లలో 34,873 మందికి మాత్రమే ఈ పథకంలో ఆర్థిక సాయం అందింది. మరోవైపు ఎకానమిక్ సపోర్ట్ స్కీం(ఈఎస్ఎస్)ను కూడా అమలు చేయడం లేదు. ఈ తొమ్మిది సంవత్సరాల్లో 1,120 మందికి మాత్రమే ఈ స్కీం కింద లబ్ధి చేకూరింది. గిరిజన బంధు స్కీమ్ తోనైనా పెండింగ్ అప్లికేషన్లకు మోక్షం లభిస్తుందని ఎదురు చూస్తున్న గిరిజన యువతకు నిరాశే మిగిలింది. గిరిజన బంధు ద్వారా సాయం చేయాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.