
జయశంకర్ భూపాలపల్లి, ఏటూరునాగారం, వెలుగు: గోదావరి వరదల వల్ల కలిగే నష్టాన్ని పూర్తిగా నివారిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరలేదు. గతేడాది వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సీఎం గోదావరి కరకట్ట కోసం స్పెషల్ ఫండ్స్ కేటాయిస్తామని చెప్పారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్న గూడెంలో ప్రజల సమక్షంలో ఈ మాటిచ్చారు. ఇది జరిగి పది నెలలవుతున్నా పైసా విడుదల చేయలే. గోదావరి ముంపు ఏరియాలపై రీసెర్చ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగిస్తామని ప్రకటించింది.
ఆ సర్వే ఎందాక వచ్చిందో జిల్లా బాస్‌కే తెలవట్లేదు. ఇరిగేషన్ ఆఫీసర్లను అడిగితే వారిది అదే పరిస్థితి. పాత ఫండ్స్తోనైనా పనులు చేస్తారా అంటే అదీ చేయలే. మంగపేట మండలంలో గోదావరి కరకట్ట నిర్మాణం కోసం నాలుగేండ్ల కింద కేటాయించిన రూ.137 కోట్ల ఫండ్స్‌తో పనులు చేయడానికి టెండర్లు పిలిచారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఏడాదిలోపు వర్క్ పూర్తి చేయాల్సి ఉండే. గడువు ముగిసినా పనులు కాలే. దీంతో మరో ఏడాది గడువు పొడిగిస్తూ ఆఫీసర్లు తాజాగా ఉత్తర్వులిచ్చారు. రాబోయేది వానాకాలం.. గోదావరి పొంగితే ములుగు జిల్లాలో 47 గ్రామాలు నీట మునుగుతుంటాయి. సర్కారు నిర్లక్ష్యం వల్ల ప్రతీ యేటా వేలాది మంది ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు.
రీసెర్చ్ లేదు.. ఏమీ లేదు!
ములుగు జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాలపై రీసెర్చ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతేడాది జూలైలో 17న ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం ముంపు ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. భవిష్యత్ అవసరాల కోసం గోదావరి కరకట్టలను ఎలా నిర్మించాలి? అనే విషయంపై పూర్తి స్టడీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. నీటి పారుదల రంగంలో సర్వే చేసే వ్యాప్ స్కో సంస్థతో పాటు 8 మంది ఐఐటీ ప్రొఫెసర్లకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. గోదావరి వరదల పరిశీలనకు వచ్చిన సీఎం ఆఫీసర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. రిపోర్ట్ వచ్చిన తర్వాతనే పనులు చేపట్టాలని గతంలో మంగపేట మండలంలో గోదావరి కరకట్ట నిర్మాణం కోసం కేటాయించిన రూ.137 కోట్ల పనులకు కూడా ఆఫీసర్లు బ్రేక్ వేశారు. పది నెలలువుతున్నా ఇప్పటిదాకా గోదావరి వరద ముంపుపై సర్వే చేసింది లేదు.. రిపోర్ట్ ఇచ్చింది లేదు. మళ్లీ ఏమైందో ఏమో.. మంగపేట మండలంలో పాత నిధులతో చేపట్టే కరకట్ట నిర్మాణ పనుల టెండర్లు పిలిచి ఓ కాంట్రాక్ట్ సంస్థకు పనులు అప్పగించారు. గడువు ముగిసినా వాళ్లు కూడా ఇంకా పనిచేయలే. దీంతో మరో ఏడాది గడువు పెంచుతూ ఇటీవలే ఆఫీసర్లు మరోసారి ఆర్డర్స్ ఇచ్చారు.
కరకట్టలు లేకపోవడం వల్లే ప్రమాదం
గోదావరిలో కలిసే వాగుల వల్ల కరకట్టలు లేకపోవడంతో బ్యాక్ వాటర్ వచ్చి తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలు ముంపునకు గురవుతుంటాయి. పంట పొలాలు అక్కరకు రాకుండా కొట్టుకుపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. గోదావరిలో ఏటూరునాగారం దగ్గర కలిసే జంపన్నవాగు, రాంనగర్ దగ్గర కలిసే జీడివాగు, మంగపేటలో కలిసే గౌరారం వాగు, కమలాపూర్ దగ్గర కలిసే ఎర్రవాగు, కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం దగ్గర హన్మంత వాగుతో పాటు వాజేడు, వెంకటాపురం మండలాలోని మరో 3 వాగులు గోదావరిలో కలుస్తాయి. వీటి వల్లనే ప్రతీ ఏడాది ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. వేలాది ఎకరాల భూములు కోల్పోయి రైతులు భూ నిర్వాసితులుగా మారుతున్నారు. ఇండ్లు కూలిపోయి రోడ్డున పడుతున్నారు. దీనికి ఈ వాగుల నుంచి వచ్చే బ్యాక్ వాటర్ గోదావరిలో వచ్చే భారీ వరద వల్ల గ్రామాల్లోకి, పంటపొలాల్లోకి వెనక్కి తన్ని ముంపు పెరుగుతుందని చెబుతున్నారు. గోదావరికి కరకట్ట నిర్మిస్తే ముంపు తగ్గిపోయి ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు.
పాత ఫండ్స్‌తో కరకట్ట పనులు చేపట్టాం..
గోదావరి నదిపై పాత ఫండ్స్‌తో కరకట్ట నిర్మాణ పనులు చేపట్టినం. ఇంకా కంప్లీట్ కాలేదు. పోయినేడాది సీఎం కేసీఆర్ ఇస్తామని చెప్పిన స్పెషల్ ఫండ్స్ మంజూరు కాలేదు. గోదావరి ముంపు ప్రాంతాల రక్షణ కోసం ప్రభుత్వం చేస్తామన్న సర్వే ఎందాక వచ్చిందో తెలియదు. సీఎం ఆదేశాల ప్రకారం గోదావరిలో కలిసే 8 వాగులపై స్టడీ చేసి, రిపోర్ట్ వచ్చిన తర్వాతనే కరకట్టల నిర్మాణ పనులకు ఫండ్స్ మంజూరయ్యే చాన్స్ ఉంది. ‒కృష్ణ ఆదిత్య, ములుగు కలెక్టర్
ప్రతీ యేటా వరదలకు బలవుతున్నం..
గోదావరి పొంగినప్పుడల్లా నరకయాతన అనుభవిస్తున్నాం. మంగపేట మండలం పొదుమురు గ్రామ శివారు పుష్కర ఘాట్ ముంపు ప్రాంతంలో కరకట్ట నిర్మించాలి. జనావాసాలు ఉన్న చోట కరకట్టలు కట్టాలి. ప్రభుత్వ అలసత్వం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కరకట్ట నిర్మాణం ఇంతవరకు జరగలేదు. ప్రభుత్వం స్పందించి కరగట్ట పనులు వెంటనే ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలి. ‒కోడెల నరేశ్, జ్వాలా యూత్ ‒ ట్రస్ట్ అధ్యక్షుడు, మంగపేట
సీఎం హామీ నెరవేరలే..
కరకట్టలు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి 10 నెలలవుతున్నా నయాపైసా కేటయించలే. శాశ్వత పరిష్కారం కింద ఏటూరునాగారం నుంచి మంగపేట వరకు గోదావరి కరకట్టను నిర్మించాలి. మరో రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు కరకట్ట పనులు మొదలు పెట్టకపోవడం ప్రభుత్వం, ఆఫీసర్ల నిర్లక్ష్యమే. ‒చిటమట రఘు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, ఏటూరునాగారం