హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ తమకే మద్దతివ్వాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. పదేండ్లలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితోనే శాంతియుత మార్గంలో ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలందరూ ఒక్కతాటిపై నిలిచి పోరాడడంతోనే స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని చెప్పారు.
‘‘పదేండ్ల కిందటి తెలంగాణ జీవనచిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దు:ఖం తన్నుకొస్తది. అలాంటి పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్రయజ్ఞంగా నిర్వహించింది. అవిశ్రాంతంగా శ్రమించింది. విధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాసపథం వైపు నడిపించింది. అన్నిరంగాలనూ ప్రక్షాళన చేసింది. తక్కువ కాలంలోనే తిరుగులేని ఫలితాలను సాధించింది. అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టింది. అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కించింది. ‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అనే స్థాయికి ఎదిగేలా చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే, మళ్లీ మాకే అవకాశం ఇవ్వండి” అని కోరారు.
పేదరికంలోనే దేశం..
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని కేసీఆర్ అన్నారు. ఇందుకు కేంద్రంలోని పాలకులు అనుసరిస్తున్న విధానాలే కారణమని విమర్శించారు. దేశంలో పుష్కలంగా వనరులున్నా, వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ‘‘75 ఏండ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే. కానీ ఆశించిన లక్ష్యాలు, చేరాల్సిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదు. ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పని చేసే ప్రజలు ఉన్నప్పటికీ.. పాలకుల అసమర్థత, భావదారిద్ర్యం ఫలితంగా వనరుల సద్వినియోగం జరగడం లేదు. అన్నీ ఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, బలహీనవర్గాలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు” అని అన్నారు.
విపక్షాల కేసులు వీగిపోయినయ్..
కాళేశ్వరం జలధారలతో గోదావరి సతత జీవధారై తెలంగాణ భూములను తడుపుతోందని కేసీఆర్ అన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తొమ్మిదిన్నరేండ్లలో రూ.37 వేల కోట్ల పంట రణాలు మాఫీ చేశామని తెలిపారు. ‘‘రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటిరాగల రాష్ట్రం.. దేశంలో ఇంకొకటి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో వడ్ల దిగుబడిలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ.. ఇప్పుడు పంజాబ్‌నే ఢీకొట్టే స్థాయికి చేరింది. ఇట్ల అభివృద్ధిలో దూసుకుపోతుంటే, కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు సరఫరా చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు.
వాళ్లకు ప్రజలే తగిన సమాధానం చెబుతారు” అని కేసీఆర్ అన్నారు. ‘‘పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్ష నాయకులు గ్రీన్ట్రిబ్యునళ్లలో కేసులు వేసి తమ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు–రంగారెడ్డి జిల్లాల ప్రజల ఉసురు పోసుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ న్యాయం ఎన్నటికైనా గెలుస్తుందన్న నమ్మకంతో మా ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాలు ఫలించాయి. విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయి. ఇటీవలనే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించాయి. వెంటనే సాగునీటి కాల్వల నిర్మాణం చేపడ్తం. త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు, రంగారెడ్డిని పచ్చని పంటల జిల్లాలుగా తీర్చిదిద్దుతాం. తాగునీటి అవసరాల కోసం రాబోయే కొద్దిరోజుల్లోనే రిజర్వాయర్లకు నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తాం” అని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో పేదరికం తగ్గుతున్నది..
జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీని మంగళవారం నుంచే ప్రారంభించామని కేసీఆర్ చెప్పారు. ‘‘గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే రెండు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్మెంట్ఇచ్చాం. చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ఉద్యోగులకు పీఆర్సీ వర్తింప చేశాం. త్వరలోనే కొత్త పీఆర్సీ వేస్తాం. అప్పటి వరకు ఐఆర్ఇస్తాం. సింగరేణి టర్నోవర్రూ.12 వేల కోట్ల నుంచి రూ.33 వేల కోట్లకు పెంచాం. ఈసారి సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి పండుగలకు బోనస్‌గా రూ.వెయ్యి కోట్లు అందజేస్తం.
హైదరాబాద్నలుమూలలకు రానున్న మూడు, నాలుగేండ్లలోనే మెట్రో రైల్సౌకర్యం కల్పిస్తాం” అని సీఎం ప్రకటించారు. ‘‘సంపద పెంచి పేదలకు పంచడంతో తెలంగాణలో పేదరికం తగ్గుతున్నది. 2015 – 16లో 13.18 శాతంగా ఉన్న పేదరికం 2019 –20 నాటికి 5.88 శాతానికి తగ్గింది. అతి పిన్న రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి ఇప్పుడు దేశమంతటా విస్తృతంగా చర్చ జరుగుతుండడం మనందరికీ గర్వకారణం. ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రతిభకు, పటిమకు తిరుగులేని నిదర్శనం” అని కేసీఆర్ పేర్కొ న్నారు. ‘జై తెలంగాణ.. జై భారత్’ అంటూ స్పీచ్ ముగించారు. కాగా, సీఎం అంతకుముందు ప్రగతి భవన్లో జెండా ఎగురవేశారు. అక్కడి నుంచి పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుని అమర జవానుల చిహ్నం వద్ద నివాళులర్పించారు.
వరద బాధితులను ఆదుకుంటం..
వరద బాధితులను ఆదుకుంటామని కేసీఆర్ చెప్పారు. ‘‘గత నెలలో అసాధారణ వర్షాలు కురిశాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. వరద ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలకు రూ.500 కోట్లు విడుదల చేశాం. ఊహించనిరీతిలో కుంభవృష్టి కురిసి, వరదలు సంభవించినా.. ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకొని ప్రాణ, ఆస్తి నష్టాన్ని చాలా వరకు నివారించగలిగింది. వర్షాలు, వరదల వల్ల మృతి చెందినోళ్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకుంటాం. దెబ్బతిన్న ఇండ్లకు గృహలక్ష్మి పథకం కింద సాయం అందిస్తాం” అని ప్రకటించారు.
ఒకప్పుడు చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణ.. ఇప్పుడు 20కి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడితో నేడు దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది.
సీఎం కేసీఆర్