- వనపర్తి భలో మంత్రి నిరంజన్‌రెడ్డి
- అభివృద్ధి చేసిన.. అండగా నిలవండి
- అచ్చంపేట సభలో గువ్వల బాల్‌రాజ్
నాగర్‌కర్నూల్/ వనపర్తి/అచ్చంపేట : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వనపర్తి నియోజకవర్గంలోని వందేండ్ల కరువును దూరం చేశామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి, అచ్చంపేటలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. తాను ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నిలబెట్టుకున్నానన్నారు. వనపర్తికి పశువైద్య కళాశాలతో పాటు వేరుశనగ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించాలని సీఎం కేసీఆర్ ను కోరారు.
గత ఎన్నికల ముందు పెద్దమందడి, ఘనపూర్ బ్రాంచ్ కెనాల్ డి 8 ద్వారా 70 వేల ఎకరాలకు సాగునీరు అందిన తర్వాతే నామినేషన్ వేశానని, ఈసారి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల ముందు ఉంచి మళ్లీ గెలిపించాలని కోరుతున్నానని చెప్పారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అచ్చంపేటలో ప్రభుత్వ విప్ గువ్వల బాల్ రాజు మాట్లాడుతూ పదేండ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని, దీన్ని చూసి ఓర్వలేని ప్రతి పక్ష పార్టీల నాయకులు తనపై అభాండాలు మోపుతూ దుష్ప్రచారం చేస్తున్నారని,
ఈ ప్రాంత ప్రజలు తనకు అండగా నిల్చి కాపాడుకోవాలని వేడుకున్నారు. నల్లమల ప్రాంత ప్రజలకు విద్యను మరింత చేరువ చేసేందుకు ఈప్రాంతంలో నర్సింగ్ కాలేజ్ తో పాటు గవర్నమెంట్ మోడల్ పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేయాలని సీఎంను కోరారు. అచ్చంపేటలో ఏపూరి సోమన్న, వనపర్తిలో మధుప్రియ తమ ఆట పాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు.
మరో రిజర్వాయర్ మంజూరు చేస్తాం
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వనపర్తి నియోజకవర్గంలో సాగునీరు అందించి వనపర్తిని వడ్లు పండే ప్రాంతంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మర్చారని సీఎం కేసీఆర్ అన్నారు. ఏదుల రిజర్వాయర్ నుంచి వనపర్తికి పుష్కలంగా సాగునీరు అందించేందుకు మరో రిజర్వాయర్ ను నిర్మించాలని నిరంజన్ రెడ్డి ప్రతిపాదించారని, దానిని మంజూరు చేస్తామని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం హామీ ఇచ్చారు.
వనపర్తి పట్టణానికి ఉత్తరం వైపు మిగిలిపోయిన బైపాస్ రోడ్డు ను పూర్తి చేస్తామని చెప్పారు. ఇక్కడ పశువైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిరంజన్ రెడ్డి కోరారని, దానిని కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈసారి నిరంజన్‌రెడ్డిని గెలిపిస్తే ఆయన పెద్ద పదవీలో ఉంటారని సీఎం చెప్పారు.
ALSO READ : సెకండ్ లిస్ట్ కోసం లీడర్ల వెయిటింగ్
గైర్హాజరైన ఎంపీ రాములు
అచ్చంపేట లో గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు గైర్హాజరవ్వడంపై ప్రజలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ఆయన తన అనుచరులతో కలిసి పార్టీని వీడడం ఖాయమనే చర్చే ప్రధానంగా నడుస్తోంది.