హైదరాబాద్ : ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీఎం కేసీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. బడ్జెట్ లో అంచనాలు, వాస్తవాలకు పొంతన లేదన్నారు భట్టి. కేటాయింపులు భారీగా ఉన్నా ఖర్చు చేయలేదన్నారు. అయితే భట్టి కాకి లెక్కలు చెబుతున్నారంటూ సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. కేంద్ర సర్కార్ నివేదిక ప్రకారమే ఆదాయ వృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. అధికార పార్టీ ప్రతిపక్షం గొంతు నొక్కుతోందని భట్టీ ఆరోపించగా.. అవాస్తవాలు చెబితే ఊరుకునేది లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ చెప్పే లెక్కలు సభకే అర్థం కావడం లేదు. ప్రజలకేం అర్థమవుతుంది.. సభను, ప్రజలను తప్పుదోవ పట్టియ్యొద్దు అని సీఎం సూచించారు. కాంగ్రెస్ చెప్పేది 100 శాతం తప్పు. ప్రభుత్వం అన్న తర్వాత చెల్లింపులు కచ్చితంగా ఉంటాయి. వృద్ధిరేటు చెప్పకుండా కాకి లెక్కలు చెబుతున్నారు. గాల్లో చెప్పకుండా.. బాధ్యతతో చెప్పాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ మీద కాంగ్రెస్‌కు అవగాహన లేదు. బడ్జెట్‌లో సవరణలు ఉంటాయి. వాటిని తప్పుగా చిత్రీకరించడం సరికాదు. దేశంలోని 29 రాష్ర్టాల్లో కూడా బడ్జెట్ అంచనాల్లో సవరణలు ఉంటాయని తెలిపారు సీఎం కేసీఆర్.