‘‘ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేసిండు.. ప్రొఫెసర్ కోదండరాంను కూడా వాడుకొని.. అధికారంలోకి రాగానే వదిలేశాడు. కేసీఆర్ చేతిలో మోసపోయిన వారిలో నేను ఒక బాధితుణ్ణి..” అని వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శ్రీకృష్ణాఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివేక్ వెంకటస్వామి, కోదండరాం, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ముఖ్య అతిథులుగా హాజరైన మాట్లాడారు. చెన్నూర్‌లో బాల్క సుమన్ ఇసుక దందాతో వేయి కోట్లు దండుకున్నాడని, కేసీఆర్ కాళేశ్వరం రీ డిజైన్ పేరుతో రూ.70 వేల కోట్లను మింగాడని వివేక్ ఆరోపించారు.
చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లిన బాల్క సుమన్ ఒకసారైనా రాలే అనే మాటే వినిపించిందన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజా సేవలోనే ఉంటానని, చెన్నూరు ప్రజలకు అందుబాటులో ఉంటానని వివేక్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసంపూర్తిగా మారిన లెదర్ పార్క్‌ను పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు