అబద్ధాల ప్రచారం ఇంకెంత కాలం?

అబద్ధాలు ఆడటంలో కేసీఆర్... తనకు తానే పోటీ పడుతున్నాడు. ఉద్యమ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజల ఆశలు.. ఆకాంక్షల సెంటిమెంట్ తో పైకెదిగిన కేసీఆర్​.. ఇప్పుడు తన బాధ్యతలను వదిలేసి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. ముఖ్యమంత్రిగా కీలకమైన హోదాలో ఉండి అడ్డదిడ్డ దబాయింపులతో ఇప్పటికే జనం విశ్వాసాన్ని కోల్పోయాడు. మూడోసారి అధికారంలోకి రావాలనే ఎజెండాతో.. తన  సొంత రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తోచినన్ని జూటా మాటలతో  గోబెల్స్​ ప్రచారం మొదలుపెట్టాడు. ప్రతి అంశానికి కేంద్రానిదే తప్పు అని వేలెత్తి చూపుతున్న సీఎం.. ఇక్కడి ప్రజలకు తానే మొదటి జవాబుదారీ అనే విషయం  మరిచిపోయినట్లు గాలి పోగేస్తున్నడు. 

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, వడ్ల కొనుగోళ్లు, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లు అన్నింటికీ సెంట్రల్​గవర్నమెంట్​ను వేలెత్తి చూపుతున్న కేసీఆర్.. వాటిపై తానేం చేసిండో చెప్పకుండా జనాన్ని మోసం చేస్తున్నాడు. ఎనిమిదేండ్ల పాలనలో కేసీఆర్​తన అబద్ధాలతో రాష్ట్రాన్ని నిట్ట నిలువునా ముంచిండా.. మేలు చేసిండా.. అనేది ప్రజలకు ఈపాటికి అర్థమైతనే ఉంది. ఉద్యమంలో సకల జనులందరూ నమ్మకంగా కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తితే... ఇప్పుడు అదే కేసీఆర్​ నమ్మించి మోసం చేస్తున్నాడని అందరూ అనుమానించే రోజులు రావటం తెలంగాణ చేసుకున్న దురదృష్టంగా కనిపిస్తోంది. 

భారీగా పెంచింది కేసీఆరే..​ 

‘‘తెలంగాణలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ పెంచనే లేదు.. మేం అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతుండెనో ఇప్పుడు అంతే ఉంది” అని కేసీఆర్ మాయ మాటలు చెప్పుట్ల నెంబర్​వన్. ఈ అబద్ధాలతోనే ప్రజల జేబులు లూటీ చేస్తుండు. టీఆర్ఎస్​అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో  పెట్రోల్,  డీజిల్ ధరలు భారీగా పెరిగాయనేది ముమ్మాటికి నిజం. 2015లో పెట్రోల్, డీజిల్ పై అప్పటికే ఉన్న వ్యాట్​కు అదనంగా.. లీటర్​కు రూ.2 చొప్పున వ్యాట్​పెంచుతూ జీవోలు ఇచ్చింది. ఇరవై రోజులు తిరక్కముందే.. లీటర్​పై దాదాపు రూ.5 చొప్పున పెంచింది. అప్పటిదాకా పెట్రోల్​మీద 31శాతం ట్యాక్స్ ఉంటే..35.2 శాతానికి పెంచుతూ జీవో జారీ చేసింది. డీజిల్​మీద 22.25 శాతం ఉంటే 27 శాతానికి పెంచేసింది. అప్పటి నుంచీ అవే రేట్లు అమలవుతున్నాయి. అప్పటి జీవోలు చూస్తే  కేసీఆర్​ పెట్రోల్,​ డీజిల్​పై బాదిన తీరు అర్థమయితది. 

జనం మేలు కోరిన ఇతర రాష్ట్రాలు

అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరల ఒడిదొడుకులు జనాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.  గత ఏడాది కేంద్రం పెట్రోలు ధరలు తగ్గించిన టైమ్​లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోణంలో ఆలోచించి మరో మంచి నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన వెంటనే రాష్ట్రానికి వచ్చే వ్యాట్ ను కూడా తగ్గించుకున్నాయి. పదహారు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ తమ వ్యాట్ తగ్గించుకొని లీటర్​పై మరో రూ.5 నుంచి రూ.7 వరకు భారం తగ్గించాయి. దీంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ తెలంగాణలో పెట్రోల్, డీజిల్ వ్యాట్​తగ్గించేది లేదని ప్రభుత్వం మొండి పట్టు పట్టింది. ప్రజల కష్టాలు, నష్టాలతో తనకు పట్టింపు లేదని కేసీఆర్​ఉల్టా మాటలతో దాటేశాడు. 

ఏడేండ్లుగా బాదుతున్న రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పుడు దేశంలో అత్యధిక వ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విధిస్తున్న రాష్ట్రం రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(36%) కాగా రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ కూడా వ్యాట్​తగ్గిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు అంతమేరకు తగ్గుతాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ ​పెంచటంతో పెట్రో ధరలు పెరిగి, రాష్ట్రాలకు వాటిపై వస్తున్న వ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ఏడేండ్లుగా అంతమేరకు పెరిగిన లాభాన్ని వ్యాట్​కింద రాబడిగా చూసుకుంటున్న సర్కారు.. జనం మీద పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కొంచెమైనా వ్యాట్ ను తగ్గించే  ప్రయత్నం చేయకపోవటం బాధాకరం. ప్రజలపై  భారం పడుతుందని ఆందోళనలు చేస్తున్న టీఆర్ఎస్​పార్టీ.. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా గుంజుతున్న వ్యాట్ తగ్గించి.. నిజాయితీని చాటుకోవాలి.

వడ్ల కొనుగోళ్లు, ఎస్టీ రిజర్వేషన్లపైనా అదే తీరు..

వరి సాగు, వడ్ల కొనుగోళ్లపైనా కేసీఆర్ ది అదే తీరు. గడిచిన రెండేండ్లలో రకరకాలుగా మాట మారుస్తూ రైతులను మోసం చేశాడు. గత వానాకాలంలో వడ్ల కొనుగోళ్లు లేట్​ జేయడంతో నెలల తరబడి వడ్ల కుప్పల వద్దే ఎండకు ఎండి, వానకు నాని చాలా మంది అన్నదాతలు ప్రాణాలు విడిచారు. వడ్ల కొనుగోళ్లకు పైసలు కేంద్రమే ఇస్తున్నా.. కొనడం చేతగాక రాజకీయ పబ్బం గడుపుతుండు. రైతులు కోటి ఎకరాల్లో వరి వేసినా.. ప్రతి గింజ కొంటామన్న కేసీఆర్.. వరి వేస్తే ఉరేనన్నాడు. సన్న వడ్లు పెట్టుమని ప్రకటించిన సీఎం.. పంట పండినంక నిండా ముంచిండు. ఈ యాసంగిలో వరే వేయొద్దు.. కొనుగోలు సెంటర్లే ఉండవని చెప్పి.. ఇప్పుడు పండిన వడ్లన్నీ కేంద్రమే కొనాలని డిమాండ్ ​చేస్తున్నాడు.  గిరిజన రిజర్వేషన్లపై మాత్రమే తీర్మానం చేసి పంపాలని కేంద్రం కోరితే.. బీసీ-ఈ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపిన కేసీఆర్​సర్కార్.. ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని బద్నాం చేస్తున్నరు.

తెలంగాణలోనే  రేటెక్కువ.. ఎందుకు

పెట్రోలు, డీజిల్​ధరలు పెరిగినందుకు నిరసనగా సొంత పార్టీ శ్రేణులతో ఆందోళనలకు పిలుపునిచ్చిన కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో లేనంత రేటు తెలంగాణలో ఎందుకుందో.. జవాబు చెప్పగలిగే పరిస్థితి లేదు. ఇప్పుడున్న రేట్ల ప్రకారం తెలంగాణలో పెట్రోల్​ధర లీటర్​కు రూ.110 దాటితే పొరుగున ఉన్న తమిళనాడులో 102.91, కర్ణాటకలో రూ.102.26,  ఢిల్లీలో 97.01, యూపీలో 96.87, గుజరాత్​లో 96.70, పంజాబ్​లో 97.19 ఉంది. డీజిల్​ధరలు కూడా అదే తీరుగా ఇతర రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నాయి. ఇక్కడ 96.37 ఉంటే, పంజాబ్​లో 85.94 మాత్రమే. 

:: డా. వివేక్​ వెంకటస్వామి, బీజేపీ నేషనల్ ​ఎగ్జిక్యూటీవ్​ కమిటీ మెంబర్