కడెం నీళ్లతో కాళేశ్వరం జాతర

కాళేశ్వరం (మేడిగడ్డ) నుంచి మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు, వరద కాలువ పొడవునా కోరుట్ల, మెట్‌పల్లి, రాజేశ్వర్‌రావుపల్లె; జగిత్యాల, నిజమాబాద్‌ జిల్లాల్లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరకు కాళేశ్వరం జల జాతరను  ఆడంబరంగా జరిపారు. తెలంగాణ భగీరథుడు కేసీఆర్‌కు ఊరూరా పాలాభిషేకాలు నిర్వహించారు. అసెంబ్లీలో శనివారం కూడా ఈ ఎల్లంపల్లి నీళ్ల మీదే గొడవ జరిగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ జరుపుతున్న ఈ కాళేశ్వరం జల జాతరకు, కాళేశ్వరం నీళ్లకు అసలు సంబంధం ఉందా?. జల జాతర పేరిట వందలాది మేకలు కోసి; మాంసం, మందు, బిర్యానీలతో చేస్తున్న జాతరలు, కాళేశ్వరం నీళ్ల సంబరాలు, పండగలు అసలు ఏ నీళ్లకు జరుపుకుంటున్నారు?

గోదావరిలో వరదలు మొదలైన తర్వాత మేడిగడ్డ నుంచి అన్నారానికి 6.7 టీఎంసీల నీళ్లు, అన్నారం నుంచి సుందిళ్లకు 1.7 టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారు. సుందిళ్ల నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి చుక్క నీరు కూడా ఎత్తిపోయలె.  కేసీఆర్‌ కలల ప్రాజెక్టు (రూ.90 వేల కోట్ల కాళేశ్వరం) నుంచి ఎల్లంపల్లికే చుక్కనీరు కూడా రాకపోతే జల జాతర  జరుపుతున్న నందిమేడారం, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు, వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్‌ వరద కాలువ గేట్లలోకి ఎత్తిపోసిన 14 టీఎంసీల నీళ్లు ఎక్కడివి?. కాళేశ్వరం నుంచి మిడ్‌ మానేరు వరకు, ఇటు వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్‌ వరకు నీరు ఎత్తిపోసే ప్రతిచోటా అధికార పార్టీ పెద్దలు అసలు ఏ నీళ్లకు పూలు చల్లుతూ పండగలు చేస్తున్నారు?. జల జాతర పేరిట టీఆర్‌ఎస్‌ సర్కారు పండగలు చేస్తున్న నీళ్లు ఎక్కడివంటే కేసీఆర్‌ అనేక సార్లు వాగ్దానాలు చేసి మరిచిన నీళ్లు. ‘కడెం ఎత్తుతోపాటు కడెం ఎగువన కుప్టి బహుళార్థ సాధక గ్రావిటీ జల విద్యుత్తు ప్రాజెక్టు’ వాగ్దాన భంగపు నీళ్లు.

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఉన్న ‘కడెం ప్రాజెక్టు’ నీళ్లు ప్రధాన ఆధారం. కుంటాల జలపాతం, ఇంద్రవెల్లి, కుప్టి, ఊట్నూర్‌, గుడిహత్నూర్‌, బజార్‌హత్నూర్‌, నేరెడిగొండ, అల్లంపెల్లి వాగులు, పొచ్చెర గాయత్రి జలపాతం.. ఈ నీళ్లన్నీ (కొన్నింటిని వాగులు అనటానికి బదులు ఉప నదులు అనొచ్చు) కడెంకే వస్తాయి. కడెం నీళ్లు  పొంగి పొర్లి వరద గేట్ల ద్వారా అనేక హిమానీ నదుల సంగమమైన గంగానది జలపాతం వలె ఎల్లంపల్లిలో దూకుతాయి. కడెం నీళ్లకు తెలంగాణలోనే ఈ అతివేగం ఎందుకు?. కుప్టి నది బెడ్‌ లెవెల్‌ సముద్ర మట్టానికి  1,420 అడుగుల ఎత్తు, కడెం ఎఫ్‌.ఆర్‌.ఎల్‌. 700 ఫీట్లు అంటే అదనంగా 720 ఫీట్ల ఎత్తు నుంచి కడెం నీళ్లు జల పాతాలై కిందకు దూకుతాయి. ఆ నీళ్లకు అందుకే ఈ వేగం. కడెం ఎగువన కుంటాల జలపాతం, దీనిపైన కేసీఆర్‌  సర్కారు ఊరించి, డీపీఆర్‌ తయారు చేసి, నేటికీ ప్రజల ముందుంచక మరిచిన ‘కుప్టి బహుళార్థ జల విద్యుత్తు ప్రాజెక్టు’ నీళ్లే ఇందులో ఎక్కువ.

ఈ వర్షాకాలానికి ముందు ఎల్లంపల్లిలో నిల్వ ఉన్న నీళ్లు 4.7 టీఎంసీలు. ఈ వర్షాకాలంలో ఇప్పటికే ఎగువన  ఉన్న  కడెం ప్రాజెక్టు, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని భారీ వాగుల నుంచి ఎల్లంపల్లికి వచ్చిన మొత్తం నీళ్లు 39 టీఎంసీలు. ఎల్లంపల్లి గేట్ల నుంచి వరద పోటెత్తి సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను తన్నుకొని సముద్రంలో కలిసిన నీళ్లు మరో 15 టీఎంసీలు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు, శ్రీరాంసాగర్‌ వరద కాలువ పొడవునా వరద కాలువ గేట్ల వరకు ఎత్తిపోసిన నీళ్లు 14 టీఎంసీలు. హైదరాబాద్‌ తాగునీరు 2.5 టీఎంసీలు, ఇతర అవసరాలు 7.5 టిఎంసీలు(ఎన్‌టీపీసీ, మిషన్‌ భగీరథ మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి ప్రాంతాలకు). అంటే ఈ జల జాతరలన్నీ కాళేశ్వరం నీళ్లకు కాదు. కడెం నీళ్లకే.

‘కాళేశ్వరం అద్భుతం’ అనే హోరులో జల జాతర చేస్తున్నది కడెం నీళ్లకనే నిజం మరుగున పడింది. ఎత్తిపోస్తున్నది కాళేశ్వరం నీళ్లు కాదు కడెం నీళ్లనే అసలు సత్యం అడుగు దాటక ముందే కేసీఆర్‌ అబద్ధపు కాళేశ్వరం నీళ్ల ప్రచారం ప్రపంచమంతా చుట్టివచ్చింది. ఎత్తిపోతలతో మేడిగడ్డ నుంచి సుందిళ్ల వరకు కేసీఆర్​ మళ్లించిన నీళ్లన్నీ కడెం వరదలతో సముద్రానికి చేరాయి. భారీ వరద సముద్రం పాలవుతుంటే ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మోటర్లన్నీ ఎందుకు గాఢ నిద్రపోతున్నాయి?. ఈ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత మేడిగడ్డ నుంచి 1,000 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలో కలిశాయి. ఈ వానా కాలంలో ఇప్పటివరకు మొత్తం 2,600 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలిశాయి. ఇందులో సగానికిపైగా నీళ్లు ప్రాణహితవే. దాదాపు ,1300–1,500 టీఎంసీల ప్రాణహిత నీళ్లు సముద్రంలో కలుస్తున్నప్పుడు ఒక్క టీఎంసీ, చివరకు ఒక్క చుక్క నీరు కూడా కేసీఆర్‌ ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఎత్తిపోయలేదు.

ప్రాణహిత నీళ్లను ఎగువ ఎల్లంపల్లికి ఎత్తిపోసే మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజీ మోటర్లన్నీ సెప్టెంబర్‌ 2 నుంచి గాఢ నిద్రపోతున్నాయి. కానీ.. కాళేశ్వరం మోటర్లన్నీ నిరాటంకంగా నడుస్తున్నాయనీ, ప్రాణహిత నీళ్లను మేడిగడ్డ వద్ద విరామం లేకుండా ఎత్తిపోస్తూనే ఉన్నాయని, ఆ కాళేశ్వరం నీళ్లనే సాగుకు, తాగుకు వాడుతున్నామన్న భ్రమలను ప్రజల మనసుల్లో ‘కేసీఆర్‌ అండ్‌ కో’ బండల్లా నాటడంలో విజయం సాధించారు.

కరెంటు ఖర్చు చుక్కలనంటింది!

కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఎల్లంపల్లి వరకు ఎత్తి పోయక పోయినా ఎత్తిపోతల విద్యుత్‌ ఖర్చు మాత్రం చుక్కలను తాకింది. ఆగస్టు 28న 11,000 మెగా వాట్లు, 29న 11,638 మెగా వాట్లు, 30న 11,703 మెగా వాట్ల విద్యుత్​ వినియోగంతో తెలంగాణ రికార్డు సృష్టించింది. బాహుబలి బిల్లులో తెలంగాణ దేశంలోనే నంబర్–1 ర్యాంక్‌ సాధించింది. అయితే చిత్రంగా కరెంట్‌ వినియోగం ఆగస్టు 31న 9,656 మెగా వాట్లకు, సెప్టెంబర్‌ 1న 7,705 మెగా వాట్లకు పడిపోయింది. కేవలం 5 రోజుల్లోనే విద్యుత్‌ వినియోగం 4 వేల మెగా వాట్లు తగ్గింది.  కాళేశ్వరం 3 బారేజీల్లో పదుల సంఖ్యలో ఉన్న బాహుబలి మోటర్లన్నీ అకస్మాత్తుగా గోదావరిలో నీళ్లు ఎదురు ఎత్తిపోయడం ఎందుకు పూర్తిగా ఆపాయి?. ఎందుకంటే కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్లు సుందిళ్లను చేరే సరికే కడెం వరద ఎల్లంపల్లిని నింపి, 15 టీఎంసీలు ఎక్కువై, అక్కడి నుంచి సుందిళ్లకు పోటెత్తాయి. సుందిళ్లకు కేసీఆర్‌ ఎత్తిపోసిన 1.7 టీఎంసీల నీళ్లను, అన్నారానికి ఎత్తిపోసిన 6.7 టీఎంసీల నీళ్లను, అప్పటికే మేడిగడ్డలో ఉన్న నీళ్లను కూడా కడెం నుంచి పోటెత్తిన వరద తన్నుకొని అంతర్వేది దగ్గర సముద్రంలో కలిసిపోయింది.