- నియోజకవర్గం మొత్తం ఒకేసారి దళితబంధు: కేసీఆర్
- తెలంగాణను అన్ని రకాలుగా ఏడిపించిన పార్టీ కాంగ్రెస్
- రాష్ట్రాన్ని తెచ్చిన కీర్తి గొప్పది.. నాకు పదవులపై ప్రేమ లేదు
- వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూసైనా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
వరంగల్/ హనుమకొండ/ సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : గజ్వేల్‌లో తనను మరోసారి గెలిపిస్తే.. ఐటీ టవర్తెస్తానని, నియోజకవర్గం మొత్తం ఒకే విడతలో దళితబంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్అన్నారు. కాంగ్రెస్‌పార్టీ అన్ని రకాలుగా తెలంగాణను ఎడిపించిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ తెచ్చిన కీర్తి ఆకాశమంత గొప్పదని, తనకు పదవులపై ప్రేమ లేదని తెలిపారు. మంగళవారం కేసీఆర్వరంగల్, గజ్వేల్‌లో నిర్వహించిన సభల్లో పాల్గొని మాట్లాడారు.
సకల జనులు, ఉద్యోగులు, విద్యార్థులు రోడ్లెక్కి పోరాటం చేయడం వల్లే ఆనాడు ఢిల్లీ పెద్దలు దిగొచ్చారని అన్నారు. మంగళవారం వరంగల్, గజ్వేల్సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.1969లో కాంగ్రెస్ పార్టీ 400 మంది పిల్లల్ని కాల్చిచంపిందని, వేలాది మందిని జైలులో పెట్టినా ఉద్యమం విజయవంతం కాలేదన్నారు. 2001లో మరోసారి ఉద్యమం మొదలు పెడితే, కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని చెప్పి తమతో పొత్తు పెట్టుకొని ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. దీంతో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల మధ్య కూర్చొని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
తన దీక్ష, ఉద్యమం ఉవ్వెత్తున లేవడంతో తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటన చేసి కూడా ఏడాదిన్నర ఏడిపించారని గుర్తు చేశారు. ఉద్యోగులు, విద్యార్థులు లోకమంతా సకల జనుల సమ్మె చేసి, బతుకమ్మ, దసరా పండుగలకు బస్సులు బంద్ పెట్టి.. పెద్ద బీభత్సం చేస్తేనే కాంగ్రెస్ పెద్దలు దిగొచ్చారని కేసీఆర్అన్నారు. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది.. ఉద్యమం వస్తే కాల్చి చంపించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీనే అన్నారు. మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు, తుపాకుల దాడి చేసినోళ్లే ఇప్పుడు పోటీలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెబుతున్నారని, ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ, ఎన్‍కౌంటర్లు, కాల్చివేతలు, కూల్చివేతలే అన్నారు.
ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తే ఆకలి చావులు, ఎన్ కౌంటర్లు, కర్ఫ్యూలు, మతకల్లోలాలతో అల్లకల్లోలం అవుతుందని, విచక్షణతో ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ‘‘తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కీర్తి ఆకాశమంత గొప్పది. పదవులపై నాకు ప్రేమ లేదు. తెచ్చుకున్న రాష్ట్రాన్ని దరికి తెచ్చుకున్నాం. ఇంకా సాధించుకోల్సింది ఉంది. పేదరికాన్ని పారదోలాలి”అని అన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒకటే అని అన్నారు.
నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది
ముంపు గ్రామాల నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, వారి త్యాగం వల్ల12 జిల్లాలకు నీరందించే అవకాశం కలిగిందన్నారు. నిర్వాసితుల అభివృద్ధి కోసం తన మనసులో ఆలోచన ఉందని దాన్ని అమలు చేస్తానని చెప్పారు. గజ్వేల్‌నుంచి తనను మరోసారి గెలిపిస్తే ఐటీ టవర్ తోపాటు కొండ పొచమ్మ, నాచారం ఆలయాల అభివృద్ది, డజను కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటు, మల్లన్న సాగర్టూరిజం స్పాట్చేస్తానని హామీ ఇచ్చారు.
వరంగల్ రైల్వే లైన్‍పై 6 బ్రిడ్జిలు నిర్మిస్తం
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ లో రైల్వే లైన్ పై కనీసం 6 బ్రిడ్జిలు అవసరమని.. ఈ టర్మ్‌లో బ్రిడ్జిలు నిర్మిస్తామన్నారు. బ్రహ్మాండమైన బైపాస్ రోడ్డు వచ్చిందని, మరోపక్కా రింగ్ రోడ్ కంప్లీట్ చేస్తామన్నారు. ‘కుడా’ ఆధ్వర్యంలో వరంగల్ మాస్టర్ ప్లాన్ తయారవుతోందని చెప్పారు. వరంగల్ నగరానికి ఐటీ కంపెనీలు, విద్యుత్ సంస్థలు, యూనివర్సిటీలు, పాడి పరిశ్రమలు వస్తాయన్నారు.
ప్రభుత్వ స్థలంలో ఇండ్లు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆటో రిక్షా కార్మికులకు ఫిట్‍నెస్ సర్టిఫికెట్, పర్మిట్ కోసం ఏడాదికి రూ.1200 భారం పడుతోందని.. ఎన్నికలయ్యాక ఫిట్‍నెస్ సర్టిఫికెట్ అవసరమే లేకుండా దాన్ని మొత్తంగా రద్దు చేయనున్నట్లు చెప్పారు. 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తవుతుందని, ఉత్తర తెలంగాణ జిల్లాల జనాలు అనారోగ్యంతో వస్తే14 రకాల మల్టీస్పెషాలిటీ ట్రీట్‍మెంట్ అందించనున్నట్లు తెలిపారు. దాన్ని చూసైనా వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ అభ్యర్థులు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్ లను గెలిపించాలని కోరారు.