- 2018లో ప్రభాకర్ రెడ్డిని ఓడించినందుకే రోడ్లు రాలే
- ఇప్పుడు గెలిపిస్తే మునుగోడును గుండెల్లో పెట్టుకుంట..
- బీఆర్ఎస్కు ఇక్కడి నుంచే పునాదిరాయి పడాలని వ్యాఖ్య
- రాజకీయం అంటే అమ్ముడుపోవుడు కాదని చాటిన్రు..
- ఇలాంటోళ్లే పాలిటిక్స్‌కు కావాలె
- రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజుపై కేసీఆర్ ప్రశంసలు
మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: కొనుగోళ్ల వ్యవహారంలోని నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయ పర్వతమంత ఎత్తుకు ఎగరేశారని, ఇటువంటి వాళ్లే రాజకీయాలకు కావాలని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఢిల్లీ బ్రోకర్లు వంద కోట్లు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా ఎమ్మెల్యేలు ఇసిరేసి, ఎడమకాలి చెప్పుతో కొట్టి వచ్చారని, జాతి గౌరవాన్ని, దేశగౌరవాన్ని కాపాడారని ప్రశంసించారు. ‘‘రాజకీయం అంటే అమ్ముడు పోవడం కాదని, అంగట్లో సరుకులం కాదని ఈ నలుగురు తెలంగాణ బిడ్డలు చాటిచెప్పిన్రు” అని ఆయన అన్నారు. మునుగోడు బైపోల్ ప్రచారంలో భాగంగా శనివారం చండూరులో నిర్వహించిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తన వెంట హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావును ఆయన సభకు తీసుకువచ్చారు. వేదికపై వారిని పరిచయం చేస్తూ.. తెలంగాణను కాపాడిన ఈ బిడ్డలకు గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పాలంటూ జనాన్ని కేసీఆర్ కోరారు.
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కొనుగోళ్ల వ్యవహారం బయటికి వచ్చినప్పటి నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారు. సీఎంతోపాటు శనివారం సభకు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఓడించి ఓ గొడ్డలిని తెచ్చుకున్నందుకే మునుగోడుకు రోడ్లు రాలేదని అన్నారు. ఉప ఎన్నికలో ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడులో రోడ్లు తలతలా మెరిసేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే బాధ్యత తనదేనని అన్నారు. ప్రజలు వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతున్నారని ప్రభాకర్ రెడ్డిని గెలిపించిన 15 రోజుల్లోనే ఆ కోరిక నెరవేరుస్తానని కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. వామపక్షాలతో కలిసి దేశంలో ప్రజాస్వామ్యం నిలబెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా కలిసే పనిచేస్తామని చెప్పారు. ‘‘ఒళ్లు మర్చిపోయి ఓటు వేస్తే ఇల్లు కాలిపోతది.. ప్రలోభాలకు ఆశ పడితే గోస పడుతం.. మనం ధర్మం వైపు నిలబడకపోతే పెట్టుబడులకు సద్దికట్టినట్టు అయితది’’ అని ఆయన అన్నారు.
వడ్లు కొనరు కానీ.. ఎమ్మెల్యేలను కొంటరా?
నిన్న మొన్న టీవీల్లో ప్రజలు చూసింది తక్కువేనని, ఢిల్లీ పీఠాన్ని కదిలించేంత విషయం తన దగ్గర ఉందని, రాబోయే రోజుల్లో అవన్నీ బయటపడుతాయని కేసీఆర్ చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలు అంగట్లో సరుకుల్లా అమ్ముడుపోకుండా, వంద కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోచతో సమానంగా విసిరి కొట్టారని ఆయన అన్నారు. ‘‘వందల కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి ఎంపీలను, ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనడం దేనికి మంచిది. ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ పాత్ర పోషించే వ్యక్తులు హైదరాబాద్ కు వచ్చి చంచల్ గూడలో జైలులో ఉన్నరు. వాళ్లు ఆఫర్ చేసిన వందల కోట్ల ధనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చిన్రు.. అనే దానిపై ఎంక్వైరీ జరగాలి. దీని వెనక ఎవరున్నారో వారు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘ఎవడో ఒకడు తలమాసినోడు వచ్చి తడిబట్టలతోని ప్రమాణం చేస్తవా? పొడి బట్టలతోని ప్రమాణం చేస్తవా? అంటడు. దొరికిన దొంగలు జైల్లో ఉన్నరు. దీనిపై నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధమైన ముఖ్యమైన పదవిలో ఉన్న. కేసు న్యాయస్థానాల్లో ఉంది. రేపోమాపో తేలుతది. నేను మాట్లాడితే దాన్ని ప్రభావితం చేసిన అంటరు. అందుకే ఆ విషయం నేను ఎక్కువ చెప్తలేను. కానీ ఒక్కమాట చెప్తున్నా సూచనప్రాయంగా. నిన్నమొన్న మీరు టీవీల్లో చూసింది గింతే. కానీ ఢిల్లీ పీఠమే దుమ్ము దుమ్ము రేగిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో అవన్నీ బయటపడుతయ్’’ అని అన్నారు. వడ్లు కొనండని ఢిల్లీ దాక పోయి మొత్తుకుంటే.. కొనరు కానీ వందల కోట్లు సంచులల్లో పట్టుకుని ఎమ్మెల్యేలను కొంటామని వస్తారని విమర్శించారు.
బీఆర్ఎస్కు మునుగోడు పునాది రాయి కావాలె
తెలంగాణలాగేనే భారతదేశాన్ని తయారు చేయా లని పుట్టుకొస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ చెప్పారు. ‘‘మునుగోడు ప్రజలకు చాలా గొప్ప అవ కాశం వచ్చింది. ఈ ఉప ఎన్నిక ద్వారా చరిత్రలో సువర్ణావకాశం మునుగోడుకే దక్కింది. భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పడానికి బీఆర్ఎస్ పార్టీకి పునాదిరాయి వేసే అవకాశం మీకే దొరికింది. ప్రభాకర్ రెడ్డిని గెలిపించే రూపంలో కేసీఆర్ కు మీరెంత పెద్ద సద్దికడతారో కేసీఆర్‌కు అంతపెద్ద విజయం భారతదేశంలో వస్తది. ఈ దేశం బాగుపడతది. కేసీఆర్ ఎంత ఎదిగినా మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటా. మీకు అన్ని రకాలుగా అండదండగా ఉంటా’’ అని ఆయన హామీ ఇచ్చారు.
జగదీశ్‌రెడ్డి చేసిన నేరమేంది..?
మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారంపై ఈసీ నిషేధించడం పట్ల సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘నేను ఇక్కడికి బాధతో వచ్చిన. జగదీశ్ రెడ్డి లేకుండా ఈ 20 ఏండ్లలో ఏ సభలోనూ మాట్లాడలేదు. ఏం తప్పు చేసిండని జగదీశ్‌రెడ్డిని ఇక్కడి నుంచి పంపించిన్రు. ఎందుకు ఆయనను నిషేధించిన్రు” అని ఆయన ప్రశ్నించారు.
ప్రజలు సహకరించకపోతే మేం ఏం చేయగలం
చేనేత కార్మికులను 5 శాతం జీఎస్టీ వేసి దేశ ప్రధాని శిక్షిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకే మీటర్లు కాదు ఇండ్లల్లో మీటర్లను కూడా రూ.30 వేలు కట్టి మార్చుకోవాలని కేంద్రం చెప్తుందని ఆరోపించారు. ‘‘దేశం పరిస్థితి పైనపటారం.. లోన లొటారం. మాట్లాడితే విశ్వగురువు అంటడు. విశ్వ గురువా ? విషగురువా ?’’ అని ఆయన దుయ్యబట్టారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచారని అన్నారు. ‘‘58 ఏండ్లు కొట్లాడినం.. ఎంతో మంది మన బిడ్డలు చచ్చిపోయిన్రు. ఎంతో మంది జైళ్ల పాలైన్రు.. చివరికి నేను కూడా చావునోట్ల తలకాయపెట్టి కొట్లాడితే తప్ప తెలంగాణ రాలే’’ అని కేసీఆర్ అన్నారు. తన బలగం, తన బలం ప్రజలేనని, ప్రజల బలం చూసే తాము కొట్లాడేదని, వారే సహకరించకపోతే తాము ఏం చేయగలుగుతామని ప్రశ్నించారు. ‘‘మీటర్లు పెట్టేవారికి ఏం అవకాశం ఇచ్చినా నన్ను పక్కన జరిపేస్తరు. కేసీఆర్‌ను పడగొట్టి, తెలంగాణను కబ్జా చేద్దామనుకుంటున్నరు” అని ఆరోపించారు.
‘సూడు సూడు నల్లగొండ’ పాట నేనే రాసిన
ఫ్లోరైడ్ సమస్య మీద సీఎం మాట్లాడుతూ.. ‘‘గత పాలకుల హయాంలో నీటి గోస తీరిందా? ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించలేదు. మునుగోడు ప్రజలను కాపాడండి అంటే నాటి బీజేపీ ప్రభుత్వం స్పందించలేదు. అప్పటి ప్రధాని టేబుల్ మీద అంశ స్వామి అనే ఫ్లోరోసిస్ బాధితుడ్ని పడుకోబెట్టి వెతను చెప్పినా సమస్యను పరిష్కరించలే. నేను కూడా ఇక్కడకు వచ్చి ఏడ్చిన. సూడు సూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడ్ బండ.. అనే పాట నేనే రాసిన’’ అని అన్నారు.