ప్రపంచం దృష్టిని ఆకర్షించే అద్భుత క్షేత్రంగా కొండగట్టు : సీఎం కేసీఆర్

ప్రపంచం దృష్టిని ఆకర్షించే అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా, దేశంలోనే అతిపెద్ద హనుమాన్ ఆలయంగా కొండగట్టును తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ అన్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో ఆయన 3 గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు.  హనుమాన్ జయంతి వేడుకలు దేశంలోనే అత్యంత వైభవంగా కొండగట్టులో జరుపుతామని సీఎం చెప్పారు. వేల మంది ఒకేసారి దీక్ష ధారణ, విమరణ చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు.  ఆలయ అభివృద్ధి ఓ బృహత్తర ప్రాజెక్ట్ అన్న కేసీఆర్.. అన్ని హంగులతో తీర్చిదిద్దడంతో పాటు, భక్తులకు సకల వసతులు కల్పించేలా కొండగట్టు క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 

దాదాపు 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టనున్నట్లు కేసీఆర్ చెప్పారు. పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ కట్ట, కోనేరులను అభివృద్ధి చేయడంతో పాటు 86 ఎకరాల్లో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.  వసతులు బాగుంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారన్న సీఎం కేసీఆర్.. కొండగట్టుకు మళ్లీ వస్తానని, ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు.