ఎల్ఐసీని అమ్మినా వాపస్ తీసుకుంటం : సీఎం కేసీఆర్

బీజేపీ పెట్టుబడిదారులు, దోపిడీదారుల ప్రభుత్వమని  సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆ పార్టీ పాలసీ ప్రైవేటైజేషన్ అయితే తమ పాలసీ నేషనలైజేషన్ అని అన్నారు. మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్మే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎల్ఐసీతో దేశ ప్రజలకు పేగు బంధం ఉందని, అలాంటి సంస్థను సైతం కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు ఎల్ఐసీ ఏజెంట్లు, కార్మికులు సింహాల్లా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఒకవేళ కేంద్రం  ఎల్ఐసీ, విశాఖ ఉక్కును అమ్మినా తాము అధికారంలోకి రాగానే వాపస్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరెంటు రంగాన్ని పబ్లిక్ సెక్టార్ లోనే ఉంచుతామని ఇదే బీఆర్ఎస్ విధానమని తేల్చిచెప్పారు. ఎన్పీఎల్ పేరుతో మోడీ సర్కారు రూ.14లక్షల కోట్లను కార్పొరేట్లకు దోచిపెట్టిందని కేసీఆర్ మండిపడ్డారు.