ఒళ్లు మరిచి ఓటేస్తే ఇల్లు కాలిపోతది : కేసీఆర్

చండూరు బంగారిగడ్డలో టీఆర్ఎస్ బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. న్యాయం, ధర్మం ఏంటో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తే చాలు.. ప్రతిపక్ష నాయకులు ఓట్ల కోసం ప్రజల వద్దకు వాలిపోతున్నారని విమర్శించారు. ఇది అవసరం లేని ఉపఎన్నిక అని ఆయన కొట్టిపారేశారు. ఎన్నికలు రాగానే ప్రజలు గాయిగాయి  కావదన్నారు.  నిజనిజాలు ప్రజలే తేల్చాలని ఆయన చెప్పారు. ఓటు అనేది తలరాత రాసుకునే ఆయుధం అని.. ఒళ్లు మరిచి ఓటు వేస్తే ఇల్లు కాలిపోతదని చెప్పారు.  ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలని అన్నారు. 

మాయమాటలు చెప్పే నాయకులు అధికారంలోకి వస్తే ప్రజల బతుకులు మారవు అని సీఎం కేసీఆర్ అన్నారు. రాజకీయం అంటే అమ్ముడు పోవడం కాదని చెప్పండి అన్నారు. 100 కోట్లు పెట్టి నాయకుల్ని కొనడానికి ఢిల్లీ నుంచి బ్రోకర్లు వచ్చారని మండిపడ్డారు. వందకోట్లు ఇస్తామన్నా.. మా నాయకులు అమ్ముడుపోలేదని అన్నారు. ప్రభుత్వాలను కూలగొట్టాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆరోపించారు. 100 కోట్ల ధనం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న వారిని వదిలిపెట్టేది లేదన్నారు.  100 కోట్ల వ్యవహారం పై విచారణ జరగాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.