- ఆ పార్టీ గెలిచేది లేదు.. వాళ్లు సీఎం అయ్యేది లేదు
- మాయగాళ్లు వస్తుంటరు.. ఒక్క చాన్స్ అని మోసం చేస్తరు
- సాగు నీటి బాధలు వచ్చే రెండు మూడేండ్లలో తీరుస్తం
- మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్‌నగర్ సభల్లో సీఎం వ్యాఖ్యలు
నల్గొండ/సూర్యాపేట, వెలుగు: కాంగ్రెస్‌లో సీఎం పదవి కోసం డజను మంది లీడర్లు తన్నుకుంటున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘నన్ను గెలిపిస్తే సీఎం అవుతా’నని వాళ్లలో ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో వాళ్లు గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదని విమర్శించారు. మంగళవారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు. కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని క్రమశిక్షణతో ఓ కొత్త కుటుంబాన్ని దిద్దినట్టుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని కేసీఆర్ అన్నారు. దేశ తలసరి ఆదాయంలో తెలంగాణను నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టామని చెప్పారు.
ఒక రాష్ట్రం, దేశం బాగుపడిందనేందుకు అనేక గీటు రాళ్లు ఉంటయి. రాష్ట్రాల తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటరు. తెలంగాణ ఏర్పడ్డనాడు మన తలసరి ఆదాయం లక్ష లోపు ఉండె. దేశంలో 16, 17, 18 స్థానంలో ఉండేటోళ్లం. కానీ నేనిప్పుడు గర్వంగా చెప్తున్న.. పెద్ద నగరాలైన ముంబై, చెన్నై, బెంగళూరులను తలదన్ని కేవలం పదేండ్ల చిన్న వయసులోనే తలసరి ఆదాయంలో దేశంలో నం. 1 స్థానంలో నిలిచినం. తలసరి విద్యుత్ వినియోగంలోనూ నం. 1 స్థానంలో ఉన్నం. మంచినీటి కష్టాలు తీర్చినం. సాగునీటి బాధలు కూడా వచ్చే రెండు, మూడేండ్లలో తీరుస్తం’’ అని చెప్పారు.
ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడితే.. ‘గడ్డం గీసుకోను’ అనే పంచాయితీ తప్ప.. ఆయనకు ఇంకో పనేం లేదు. ఆయన గడ్డం గీసుకుంటే ఏంది? గీసుకోకపోతే ఏంది? ప్రజలకు కావాల్సింది గడ్డాలు గీసుకోబోమనే శపథాలు కాదు. కరెంట్, నీళ్లు కావాలి” అని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు సెక్యులరిజాన్ని కాపాడుకుంటామన్నారు. ముస్లిం, మైనార్టీలు ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలను ఒకేవిధంగా చూస్తున్నామని, మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్రంలో 200కు పైగా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించామని చెప్పారు.
ఏ వర్గాన్నీ చిన్న చూపు చూసే ప్రసక్తే లేదని, అన్ని వర్గాల బాగుకోసం ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ‘‘పదేండ్ల నుంచి హైదరాబాద్‌లో మతకల్లోలాల ముచ్చటే లేదు. ఎలాంటి కల్లోలాలు, కర్ఫ్యూల జాడ లేకుండా చేశాం. శాంతియుతంగా పాలన సాగిస్తున్న రాష్ట్రంలో నిన్న కాంగ్రెస్ దుర్మార్గులు కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తులతో దాడి చేశారు. మేము ఎన్నడూ అరాచకాలకు, దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు పాల్పడలేదు. ఎలాంటి కుట్రపూరిత వ్యవహారాలు చేయలేదు” అని కేసీఆర్ అన్నారు.
మోసపోతే గోసపడుతం
కృష్ణా జలాల మీద ఆధారపడ్డ నల్గొండ జిల్లాలను.. గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. గోదావరి జలాలను ఉదయ సముద్రం ద్వారా నల్గొండ జిల్లాకు అందించి.. సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్లాన్లు సిద్ధం చేశామన్నారు. డిండి రిజర్వాయర్ పనులు వేగవంతం చేస్తామని, కోర్టు క్లియరెన్స్‌లు కూడా వచ్చాయని, కేంద్ర ప్రభుత్వం సైతం కృష్ణా ట్రిబ్యునన్‌కు ఆమోదం తెలిపిందని తెలిపారు.
ఎన్నికలు వచ్చినప్పుడు మాయగాళ్లు వస్తుంటారని, ఒక్క చాన్స్ అని మభ్యపెట్టి గెలిచాక మోసం చేస్తారని, వారితో అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు. ‘‘50 ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ల ధోరణి, వైఖరి, ఆలోచన ప్రజలకు తెలుసు. ప్రజల సొమ్ముతో రైతుబంధు ఇస్తున్నారని, ప్రజల ధనాన్ని దుబారా చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ వేస్ట్ అని, 3 గంటలు చాలని ఆపార్టీ అధ్యక్షుడు చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తే రైతుల పట్ల వాళ్లకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమైతది. కర్నాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి అక్కడ రైతులకు 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని, కావాలంటే వచ్చి చూసుకోవాలని చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది. అలాంటి వాళ్ల మాటలు నమ్మితే గోసపడుతాం’’ అని కేసీఆర్ హెచ్చరించారు.
నేటి నుంచి కేసీఆర్ రాజశ్యామల యాగం
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్రాజశ్యామల యాగం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, 2018 ఎన్నికల్లో గెలిచాక కూడా ఆయన ఈ యాగం చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బుధవారం తెల్లవారుజాము నుంచి మూడ్రోజుల పాటు యాగం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో వేద పండితుల నిర్వహణలో ఈ యాగం చేస్తున్నారు.
తమిళనాడు, కర్నాటక, ఏపీ, తెలంగాణ నుంచి 251 మంది రుత్వికులు ఇందులో పాలు పంచుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం దేవరకొండ ఎన్నికల ప్రచార సభ అనంతరం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లారు. కేసీఆర్ దంపతులు బుధవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు యాగంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. గురు, శుక్రవారాల్లో కూడా యాగం కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం పూర్ణాహుతితో యాగం పూర్తి కానుంది.