ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ, గిరిజనులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మమతానురాగాలు, కల్మషంలేని మానవీయ సంబంధాలకు ఆదివాసీలు ప్రతీకలన్నారు. ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గిరిజనులకు సబ్ ప్లాన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన గూడాలకు, తాండాల్లో విద్యుత్తు, రోడ్లు వంటి మౌలిక వసతులను మరింతగా మెరుగుపరుస్తున్నామని చెప్పారు.

గురుకులాలు, అంబేడ్కర్ విదేశీ విద్యానిధి ద్వారా అత్యున్నత స్థాయి విద్య..ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడేందుకు ఆదివాసీ, గిరిజన యువతకు ఉచిత శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. కుమ్రంభీమ్ స్మారక మ్యూజియంతో పాటు పలు మ్యూజియాలు ఇప్పటికే ప్రారంభం కాగా, రాంజీ గోండు స్మారక మ్యూజియాన్ని త్వరలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో ఆదివాసీ, గిరిజన ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని, ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. గిరిజన సహకార సంస్థ ద్వారా ఉపాధిని అందిస్తూ..గిరి బ్రాండ్ పేరుతో వారి వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వం దోహదం చేస్తోందన్నారు.