తెలంగాణలో వ్యవసాయంలో శాస్త్రీయత పాటించని కేసీఆర్

బీఆర్ఎస్​ సభలు రెండు జరిగాయి. రెండింటిలోనూ కేసీఆర్​ వ్యవసాయం, సాగునీరు గురించే ప్రధాన ఎజెండాగా మాట్లాడారు. కానీ ఆయన మాటలు రాజకీయాలకు పనికి రావొచ్చేమోగానీ, శాస్త్రీయమైనవి కావు. తెలంగాణలోనే ఆయ న వ్యవసాయంలో శాస్త్రీయతను పాటించిన పాపాన పోలేదు. ఇక ఆయన చెప్పేవి రాజకీయ నినాదాలు కాక, వ్యవసాయ విప్లవం తెచ్చేదని ఎవరూ అనుకోరు. తొమ్మిదేండ్లలో  తెలంగాణ వ్యవసాయంలో శాస్త్రీయత దెబ్బతిన్నది. వరికి, పత్తికి ప్రాధాన్యమివ్వడం, తిరిగి రబీలో  వరికే పెద్దపీట వేయడం చూస్తూ వస్తున్నాం. అది ఎలాంటి శాస్త్రీయతో అర్థం కాదు. దాంతో రైతులు నష్టాల్లో  కూరుకుపోవడం కొనసాగుతున్నది. పత్తికి ప్రాధాన్యమివ్వడం వల్ల ముఖ్యంగా కౌలు రైతులు దెబ్బతింటున్నారు. ఆత్మహత్యల్లో పత్తి, మిర్చి పంటల తాలూకు నష్టాల కారణాలే ఎక్కువ ఉంటున్నాయి. 

జన్యుమార్పిడి విత్తనాలే రైతుకు శాపం

జన్యుమార్పిడి విత్తనాల వాడకం, దాంతో కొత్త కొత్త రోగాలు రావడం, నకిలీ విత్తనాలు మార్కెట్లలో నిండిపోవడం, వాటిపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం, దేశవాళి మంచి వంగడాలను మార్కెట్లలోకి రాకుండా చేయడం వగైరాలు. దాంతో లాభపడుతున్నది  బహుళజాతి విత్తన సంస్థలు మాత్రమే. వాటికి ప్రభుత్వాల ప్రోత్సాహం ఉంది. దేశవాళి రకాలకు, జన్యుమార్పిడి రకాలకు దిగుబడులలో తేడా లేకున్నా జన్యుమార్పిడితో  ఖర్చు రోజురోజుకు పెరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరం.1960 తర్వాత మన దేశం స్వయం సమృద్ధి సాధించడమే గాక ఇతర దేశాలకు సహాయం చేసే దశకు చేరుకున్నాం. ఇందులో భాగంగానే విత్తనాలను అభివృద్ధి చేసుకున్నాం.  కొత్త కొత్త  అధిక దిగుబడి విత్తనాలను అభివృద్ధి చేసుకున్నాం. ఏపీ  విత్తనాభివృద్ధి సంస్థ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి, ఇతర రాష్ట్రాలకు విత్తనాలను ఇవ్వడం జరిగింది.  కానీ కొన్ని రాజకీయశక్తులు విత్తనాభివృద్ధి సంస్థను నిర్వీర్యం చేశారు. అలాంటి వారిలో కేసీఆర్​ కూడా ఒకరు. కేసీఆర్​ ప్రభుత్వం ఇప్పటికీ అదే విధానాన్ని పాటిస్తున్నది. 

దేశానికి నమూనా ఏదీ? 

ఇకపోతే, దేశంలో ఒక లక్షా 40వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయంటున్నారు.  వాటిని సంపూర్ణంగా వాడడం లేదంటున్నారు. అవి అర్థంలేని మాటలు, శాస్త్రీయ పరిజ్ఞానంతో మాట్లాడే మాటలు కావు. ఎందుకంటే, సగటు వర్షపాతం, అతితక్కువ వర్షపాతం, అతి ఎక్కువ వర్షపాతం ఉంటాయి. ప్రతి ఏటా కురిసే వర్షపాతం వేరు వేరుగా ఉంటాయి.  కృష్ణా, గోదావరి నుంచి ప్రతి ఏటా 2 నుంచి 4 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి.  వాటిని తెలంగాణలో ఏమేరకు వాడుతున్నారో కేసీఆర్​ చెప్పగలరా? లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన  కాళేశ్వరం నుంచి ఎన్ని నీళ్లు వాడుతున్నారో కేసీఆర్​ చెప్పగలరా?  రాజకీయ భ్రమలు కల్పించే లెక్కలు వేరు. శాస్త్రీయంగా ఏ మేరకు వాడగలమో చెప్పగలిగే లెక్కలు వేరు. ఆ విషయాన్ని దాచి పెట్టి కిసాన్​ రాజకీయం చేయగలమనుకోవడం సాధ్యం కాదు. తెలంగాణ వ్యవసాయంలో నకిలీ విత్తనాల సమస్యను పరిష్కరించారా? వ్యవసాయ సబ్సిడీలను ఇస్తున్నారా? పంటల బీమా ఇస్తున్నారా? మరి దేశానికి తెలంగాణ వ్యవసాయమే నమూనా ఎలా అవుతుందో కేసీఆర్​కే తెలియాలి.

దేశానికి కాళేశ్వరమే నమూనానా?

54 ఏండ్లలో  మన వ్యవసాయ, సాగునీటి రంగాల్లో గణనీయ అభివృద్ధి సాధించినం. ఏమీ సాధించలేదని కేసీఆర్​ చెప్పడం రాజకీయంగా ఆయనకు ఉపయోగపడొచ్చు తప్ప ప్రజలకు కాదు. జింబాబ్వే దేశంలో 6,533 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మించారని కేసీఆర్ అంటున్నారు. అందుకు వర్ష పాతంలో తేడాలు, భౌగోళిక అనుకూలతలు, అననుకూలతలు  వంటి అనేక కారణాలుంటాయి. కంభం చెరువు అతి తక్కువ ఖర్చుతో నిర్మితమైంది. ఆసియాలోనే రెండో అతి పెద్దది. అది కృష్ణదేవరాయల కాలంలో ఏర్పాటైంది.  కానీ కేసీఆర్​ ఉన్న మంచి నీటి సరస్సులను నాశనం చేసి, హైదరాబాద్​ తాగునీటికి నదుల నుంచి నీళ్లు తెస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు  ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ .  ఏటా వేల కోట్ల రూపాయల విద్యుత్​ ఖర్చు. దీని కంటే తక్కువ ఖర్చుతో ప్రాణహిత నీళ్లను తెలంగాణ పొలాలకు మళ్లించే మార్గాలు అనేకం ఉన్నాయి. కానీ కేసీఆర్​కు అవి కనిపించలేదు. చివరకు వరదలకు పంపులు మునిగే పరిస్థితి తెచ్చిన కేసీఆర్​.. జింబాబ్వే రిజర్వాయర్ల గురించి చెబితే ఎలా ఉంటుంది? నష్టజాతక కాళేశ్వరం ప్రాజెక్టే  దేశానికి నమూనా అని కేసీఆర్ ​చెబుతున్నారా? 

- డా. సజ్జల జీవానందరెడ్డి