ముత్తిరెడ్డికి అపాయింట్​మెంట్​ ఇవ్వని సీఎం కేసీఆర్​

  • పక్కా ప్లాన్​ తోనే.. ముత్తిరెడ్డికి చెక్!
  • ప్రగతిభవన్​ డైరెక్షన్​ లోనే జనగామ పై పల్లా ఫోకస్
  • కొద్ది రోజులుగా లోకల్​ లీడర్లతో టచ్​లోకి రాజేశ్వర్​ రెడ్డి
  • రెండు రోజులుగా హైదరాబాద్​ కేంద్రంగా హైడ్రామా
  • ముత్తిరెడ్డికి అపాయింట్​మెంట్​ ఇవ్వని సీఎం కేసీఆర్​
  • గందరగోళంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనుచరులు 
  • మూడు వర్గాలుగా బీఆర్​ఎస్

జనగామ, వెలుగు:  ప్రగతి భవన్​ డైరెక్షన్​లోనే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి జనగామపై ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తున్నది. పక్కా ప్లాన్​ ప్రకారమే  లోకల్​ లీడర్లతో టచ్​లోకి వెళ్లిన పల్లా, ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపినట్లు స్పష్టమవుతున్నది. మూడురోజుల క్రితం పల్లా తన సొంతూరు లో వేసిన స్కెచ్​తో సీన్​ కాస్తా హైదరాబాద్​లోని హరిత ప్లాజా హోటల్​కు మారింది. బుధవారం నాటి హైడ్రామా తర్వాత తీవ్ర ఆందోళనతో ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సీఎం కేసీఆర్​ కనీసం అపాయింట్​మెంట్​ కూడా ఇవ్వకపోవడాన్ని బట్టి  రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముత్తిరెడ్డికి టికెట్​అనుమానంగానే కనిపిస్తున్నది. ఆయనకు బదులు జనగామ నుంచి పల్లాకు టికెట్​ ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.

మూడు రోజుల క్రితం స్కెచ్

గత నెలలో జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్​ రెడ్డి నర్మెట జడ్పీటీసీతో  మాట్లాడిన ఆడియో వైరల్ ​కావడంతో పల్లా రాజేశ్వర్​రెడ్డి పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. కాగా, ఈ ఆడియోను పల్లా స్వయంగా ఖండించారని, జనగామ టికెట్​తనదేనని స్పష్టం చేశారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రెస్​మీట్​ పెట్టి చెప్పారు. కానీ, పల్లా మాత్రం లోలోపలే తన పని తాను చేసుకుపోతున్నారు.  కొద్దిరోజులపాటు సైలెన్స్​గా ఉన్న పల్లా, మూడు రోజుల క్రితం సొంతూరు వేలేరు మండలం షోడషపల్లికి వచ్చిన తర్వాత దూకుడు పెంచారు. జనగామ నియోజకవర్గంలోని పలువురు ముఖ్య లీడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలను వేలేరు పిలుచుకొని మద్దతు కూడగట్టారు. ఆ మరుసటి రోజే హైదరాబాద్​లో ప్రగతిభవన్​ పక్కనే ఉన్న హరిత ప్లాజాకు లోకల్​ లీడర్లను పిలిపించి హైడ్రామాకు తెరతీశారు. ప్రగతి భవన్​ పక్కనే ఉన్న ఆ హోటల్​ను కావాలనే ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. పార్టీ లైన్ లో నడిచే పల్లా ఇంత పకడ్బందీగా పావులు కదపడం వెనక హైకమాండ్​ డైరెక్షన్​ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.  

మూడు ముక్కలైన బీఆర్​ఎస్​

పల్లా ఆరంగేట్రంతో జనగామ బీఆర్​ఎస్​ మూడు ముక్కలైంది. ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాజాగా రేసులో ఉన్న పల్లా రాజేశ్వర్​ రెడ్డి,  గతంలో ఇక్కడి ఎమ్మెల్యే టికెట్​ ఆశించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి వర్గాలుగా పార్టీ క్యాడర్​ విడి పోయింది. ముత్తిరెడ్డి,​ పల్లా మధ్య టికెట్​ రచ్చ పతాక స్థాయికి చేరడంతో పోచంపల్లి ఆశలు ఆవిరైనట్లు తెలుస్తోంది. పరకాలలో అక్కడి పార్టీ అభ్యర్థి గెలుపు టాస్క్​ ను పోచంపల్లికి హైకమాండ్​ అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోచంపల్లి అనుచరులు నారాజ్​ గా ఉన్నారు. వీరిలో కొందరు ముత్తిరెడ్డి వర్గంలో చేరగా మిగిలిన వారు డైలమాలో ఉన్నారు. ఇదిలా ఉండగా బుధవారం హైదరాబాద్​ హరిత ప్లాజాలో జరిగిన హైడ్రామా, అనంతరం తమ నేతకు కేసీఆర్​ అపాయింట్​మెంట్​ఇవ్వకపోవడంపై  ముత్తిరెడ్డి అనుచరులు రగిలిపోతున్నారు. 

గతంలో  పోచంపల్లి ప్రచారంతో ఇబ్బంది పడ్డ టైంలో ముత్తిరెడ్డికి అండగా నిలిచి సీఎంతో మాట్లాడి లైన్​ క్లియర్​ చేసిన పల్లా రాజేశ్వర్​ రెడ్డి ప్రస్తుతం ఇక్కడ టికెట్ రేసులోకి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం పల్లా తీరుపై ఎక్కడికక్కడ నిరసన గళం విప్పారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రెస్​మీట్లు నిర్వహించి హరిత ప్లాజాకు వెళ్లిన లీడర్లపై దుమ్మెత్తి పోశారు. ‘పల్లా వద్దు.. ముత్తిరెడ్డి ముద్దు’ అంటూ నినదించారు.  అనంతరం అన్ని మండలాల నుంచి హైదరాబాద్​లోని మల్లాపూర్​ నోమా గార్డెన్స్​లో ముత్తిరెడ్డి నిర్వహించిన మీటింగ్​కు తరలి వెళ్లారు.

సోషల్​ వార్​

హరిత ప్లాజాకు వెళ్లిన లీడర్ల పై ముత్తిరెడ్డి అనుచరులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం పదవులనుభవిస్తున్న లీడర్లే పల్లా శిబిరంలోకి వెళ్లడంతో ఉద్యమ టైంలో  కష్టపడ్డ లీడర్లంతా భగ్గుమంటున్నారు. తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన లీడర్లను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తే చివరికి ఆయననే మోసం చేశారంటున్నారు. సోషల్​ మీడియా వేదికగా రిజెక్టెట్​ లీడర్స్​ అంటూ వీడియోలు పోస్ట్​ చేస్తున్నారు. పలు బీఆర్​ఎస్​ వాట్సాప్​​ గ్రూపుల నుంచి వాళ్లను రిమూవ్​ చేసేస్తున్నారు. తాజా పరిణామాలతో  పార్టీ శ్రేణులు గందరగోళంలో ఉన్నాయి. ఈనెల 18 న లేదంటే 24న వచ్చే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాతోనే ఈ ఇష్యూకు ముగింపు పడే అవకాశముందనే చర్చ జరుగుతోంది.