పంటల మార్పిడి దిశగా  రైతులను చైతన్య పరచండి

పంటల మార్పిడి దిశగా  రైతులను చైతన్య పరచండి

హైదరాబాద్‌‌, వెలుగు: వరి విపరీతంగా సాగు చేస్తే భూసారం తగ్గిపోయే ప్రమాదం ఉందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయని, రైతులను లాభదాయక పంటల మార్పిడి దిశగా చైతన్య పరచాలని ఆఫీసర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా తర్వాత ప్రపంచ మార్కెట్‌‌లోకి చైనా తదితర దేశాల నుంచి పత్తి దిగుమతులు తగ్గిపోతున్నాయని, ఈ నేపథ్యంలో మన పత్తికి మస్తు డిమాండ్‌‌ ఏర్పడిందన్నారు. క్వింటాల్‌‌ పత్తి రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు ధర పలుకుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో గిరాకీ ఇంకా పెరుగుతుందని, పత్తి సాగును మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. ఊహించని రీతిలో మిర్చి క్వింటాల్‌‌కు రూ.42 వేలకు పైగా ధర పలుకుతోందని, కంది కూడా మార్కెట్‌‌లో మంచి డిమాండ్‌‌ ఉన్న పంటేనని చెప్పారు. వానాకాలం సీజన్‌‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం, యాసంగి ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం ప్రగతి భవన్‌‌లో మంత్రి నిరంజన్‌‌ రెడ్డితో కలిసి సీఎం రివ్యూ చేశారు. వ్యవసాయాన్ని కుదేలు చేసేలా కేంద్రం తిరోగమన విధానాలు అవలంబిస్తోందని కేసీఆర్ విమర్శించారు. రైతులను ప్రోత్సహించకుండా, పంటల దిగుబడిని పెంచకుండా అపసవ్య విధానాలు అమలు చేయడం బాధకరమన్నారు. వరిసాగు ఖర్చు తగ్గించే దిశగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎరువుల వాడకం, వెదజల్లే పద్ధతిపై డాక్యుమెంటరీలు రూపొందించి బాగా ప్రచారం చేయాలన్నారు. 

జీఎస్డీపీలో 21 శాతం వాటా వ్యవసాయానిదే

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం నుంచి 21శాతం ఆదాయం సమకూరుతుందని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి పాలనలో నామమాత్రంగా ఉన్న వ్యవసాయం.. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కీలక రంగంగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మరింత విస్తరిస్తున్నామని, నిర్మాణంలో ఉన్న మిగతా ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తవుతాయని తెలిపారు. భవిష్యత్‌‌లో కరువు అనే సమస్యే రాష్ట్రంలో ఉత్పన్నం కాదని సీఎం అన్నారు. వ్యవసాయంలో వేగం పెంచే దిశగా అధికారులు ముందుకు సాగాలన్నారు. 

అన్నమంతా ఒక్కసారే తింటమా?

ఎరువులు ఎక్కువగా వాడటాన్ని తగ్గించాలని కేసీఆర్ సూచించారు. కొంత మంది ఎక్కువ ఎరువులు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని అనుకుంటున్నారని, మనం అన్నమంతా ఒక్కసారే తినం కదా, అట్లనే ఎరువులు కూడా అవసరమైనంత మేరకే వాడుకోవాలన్నారు. వానాకాలం సీజన్‌‌కు సరిపడా యూరియా, డీఏపీ తదితర ఎరువులు నిల్వ ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో 6,983 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 536 కేంద్రాలు ప్రారంభించామని అధికారులు ముఖ్యమంత్రికి  వివరించారు. 32 కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభించామని, ఇప్పటి వరకు 1,200 టన్నుల ధాన్యం సేకరించామన్నారు.

దళితబంధు అమల్లో వేగం పెంచాలె

దళితబంధు పథకం అమలులో వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. రోజుకు 400 మంది చొప్పున 25 వేల మందికి యూనిట్లు అందించామని కేసీఆర్‌‌‌‌కు సీఎంవో సెక్రటరీ రాహుల్‌‌ బొజ్జా తెలిపారు. ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేసిందని, అర్హుల గుర్తింపులో జాప్యం జరగొద్దని ముఖ్యమంత్రి సూచించారు. ఈ పథకానికి దేశంలోని నలుమూలల నుంచి ప్రశంసలు అందుతున్నాయన్నారు. దీనిలో భాగంగా పెట్టే ప్రతి రూపాయి లాభాలు ఆర్జించి పెడుతుందన్నారు. ఏడాదికి రెండు లక్షల కుటుంబాలకు ఈ పథకం అందించాలన్నారు. హాస్పిటళ్లు, ఫర్టిలైజర్‌‌ షాపులు సహా అనేక రంగాల్లో ఇచ్చే లైసెన్సుల్లో దళితులకు రిజర్వేషన్లు ఇచ్చి వారికి అవకాశాలు కల్పించాలన్నారు.