కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్..

కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్..

భారత దేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు సీఎం కేసీఆర్. భారతదేశం మొత్తంలో రైతాంగానికి 24 గంటల పాటు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రాం రాం..దళితబంధుకు జై భీమ్ అని ఎద్దేవా చేశారు. అన్ని పథకాలను కాటగలిపేస్తరని చురకలంటించారు. రైతు బంధు పథకంపై వాడోడు..వీడొకడు మాట్లాడతాడని..వారి మాటలు వింటే ఇబ్బంది పడతామన్నారు. జడ్చర్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 

మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించినమని కేసీఆర్ గుర్తు చేశారు. మహబూబ్ నగర్ లో గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు పెడుతుంటే బాధపడ్డానని...మహబూబ్ నగర్ జిల్లాలో  ఏ మూలకు పోయినా కన్నీరు వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనాడు మహబూబ్ నగర్ ఎంపీగా తాను పోటీ చేస్తే లక్ష్మారెడ్డి  గెలిపించారని గుర్తు చేశారు. మహబూబ్ నగర్ తన గుండెల్లో ఉంటుందని చెప్పారు.  

Also Read : ఫేక్ బర్త్ సర్టిఫికెట్ కేసు.. ఆజం ఖాన్‌తో పాటు భార్య, కొడుకుకు 7ఏళ్ల జైలు శిక్ష

1956లో జరిగిన చిన్న పొరపాటు వల్ల 60 ఏండ్లు గోసపడ్డామని...తాలుకాలు తాలుకాలే ఖాళీ అయ్యాయని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పల్లె పల్లెల్లోన పల్లేర్లు మొలిచే అంటూ గొరటి వెంకన్న పాటలు రాశారని తెలిపారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి..మనం వలసపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కేసులు వేశారని మండిపడ్డారు. మొన్ననే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించుకున్నామని..దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మరో 10 శాతం పనులు అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. 
పాలమూరు కరువు పోతుందని..పాలమూరు పాలుకారే జిల్లాగా మారుతుందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేసుకుంటున్నామని..అన్ని వర్గాల ప్రజలు బాగుపడుతున్నారని చెప్పారు. 

కరివేన, ఉద్దండపూర్ ప్రాజెక్టుల వల్ల జడ్చర్ల నియోజకవర్గానికి లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు సీఎం కేసీఆర్. పరిశ్రమల కేంద్రంగా, ఐటీ హబ్ గా జడ్చర్లను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతున్నాయని...మహబూబ్ నగర్ లో ఎక్కడ చూసినా పంట పొలాలతో కళకళలాడుతోందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో దుమ్ముతో  కొట్టుకుపోయిన దుందుబి నది..ఇవాళ జీవనదిలా మారిందన్నారు. ఉద్దండపూర్ లో భూములు ఇచ్చిన ప్రజలకు నష్టపరిహారం ఇస్తామని..వారిని ఆదుకుంటామన్నారు.