ఆపద మొక్కులు మొక్కుతారు... జాగ్రత్తగా ఉండాలె

ఆపద మొక్కులు మొక్కుతారు... జాగ్రత్తగా ఉండాలె

తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో  తెలంగాణ నెంబర్ వన్గా ఉందన్నారు సీఎం కేసీఆర్. అనేక రంగాల్లో నెంబర్గా  తెలంగాణ ఉందని..దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శమని చెప్పారు. తాము ఏదైనా చెప్తే వంద శాతం చేస్తామని..అధికారంలోకి వచ్చాక రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందిస్తామన్నారు. అగ్రవర్ణాల పేదల కోసం గురుకుల పాఠశాలల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

20 ఏండ్ల క్రితం ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలో నవ్వులాటగా చూశారని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు నోరుమూసుకుని చూసిర్రని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటన్నింటిని దిగమింగుకుంటూ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించామన్నారు. అనాడు కరెంట్ లేదు, మంచినీరు లేదు.. జనాలు వలసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. భూదాన్ పోచంపల్లిలో ఒకటే రోజు ఏడుగురు చనిపోతే అనాటి ముఖ్యమంత్రిని జోలపట్టి అడిగినా సాయం చేయలేదన్నారు. కిరణ్ కుమార్ అనే సీఎం తెలంగాణకు ఒక్కరూపాయి ఇవ్వనంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే్ కూడా ఎదురుతిరగలేదన్నారు. 1956లో జరిగిన చిన్న తప్పు వల్ల 50 ఏండ్లు గోసపడ్డామని..అందరి పోరాటం, ఆశీర్వాదం తర్వాత తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.

తెలంగాణలో ప్రజలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు కటిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. అన్ని రంగాల్లో ప్రజలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా ఆలోచించి బీఆర్ఎస్ కు ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఆపద మొక్కులు మొక్కుతారు... జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశామలం అవుతోందని చెప్పారు. ఉప్పల్, కుత్భుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాలు మినీ భారతదేశం అని..ఇక్కడ అన్ని రాష్ట్రాల వారు నివాసం ఉంటారని తెలిపారు.  వారంత తెలంగాణ బిడ్డలే అని అన్నారు. 

రంగారెడ్డి జిల్లాగా ఉన్న ప్రాంతాన్ని మేడ్చల్ జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామని.. తెలంగాణ ఏర్పాటు కాకపోతే మేడ్చల్ జిల్లా కాకపోయేదన్నారు సీఎం కేసీఆర్. మేడ్చల్ నియొజకవర్గ కార్యకర్తలు, ఓటర్లు చైతన్యవంతులు అని చెప్పారు. కులమతాలకు అతీతంగా పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.