రాష్ర్టం వచ్చిన 9 ఏళ్లలోనే అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. మంగళవారం ఆయన నాగర్ కర్నూల్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, పోలీస్ భవనాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో సృష్టించే ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే ఉంటోందని వెల్లడించారు. ఒకప్పుడు కరవుతో అల్లాడిన పాలమూరు జిల్లా నేడు జలసిరితో కళకళలాడుతోందని పేర్కొన్నారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం త్వరలో పూర్తి కాబోతున్నట్లు చెప్పారు. అన్ని శాఖల ప్రభుత్వోద్యోగుల సమష్టి కృషితోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యపడిందని అన్నారు. గద్వాల, మంచిర్యాల కలెక్టరేట్లను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. హోం మంత్రి మహమ్మూద్ అలీ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ ఉదయ్ కుమార్, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.