రాష్ట్రంలోనే ఫెయిలయిన కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలా?

కేసీఆర్​ తప్పుడు నిర్ణయాలతో జనం బతుకులు ఆగం

అర్థం పర్థం లేని నిర్ణయాలు, తప్పుడు వాగ్దానాలు,  నియంతృత్వ పోకడలతో సీఎం కేసీఆర్ తుగ్లక్​ను తలపించేలా పాలన చేస్తున్నారు. సెంటిమెంట్‌‌తో ప్రజలను ఆకర్షించి ఓట్లు రాబట్టుకోవాలన్న ధోరణిలో ఆయన ఉన్నారు. గడచిన ఆరున్నరేండ్లలో ఏనాడూ ప్రజల అవసరాలను తెలుసుకొని.. వారి సమస్యలను తీర్చడంపై దృష్టి పెట్టలేదు. 2018 ఎన్నికల ముందు అనాలోచితంగా ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి నేటికీ వాటిలో చాలా వరకు అమలు చేయలేదు. దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు గందరగోళపరిచే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎల్ఆర్ఎస్, ధరణి, నియంత్రిత సాగు లాంటివి తెరపైకి తెచ్చి కొత్త సమస్యలను సృష్టిస్తున్నారు. ఎన్నో ఆశలతో వరుసగా రెండోసారి అధికారం కట్టబెడితే, కేసీఆర్ మాత్రం తన కుటుంబ స్వార్థం తప్ప ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఎదురు తిరిగారు. ఆయన పాలన తీరులో మార్పు రాకుంటే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ బై ఎలక్షన్స్ లో టీఆర్​ఎస్​కు పరాభవం తప్పదు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌‌ తెలంగాణలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలి. రాష్ట్ర నలుమూలలా వెనుకబడి ఉన్న ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలి. కానీ కేసీఆర్ దృష్టిలో అభివృద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మాత్రమే అన్నట్టుగా ఉంది. ఈ తీరు వల్లే దుబ్బాకలో అధికార పార్టీకి దెబ్బపడింది. పక్కన ఉండే సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలతో పోల్చుకుని చూసిన  ప్రజలు దుబ్బాక వెనుకబడి ఉండడానికి కారణం కేసీఆర్ కుటుంబమేనని భావించారు. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ ఎండగడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండడంతో ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. ఆ దెబ్బతో బీజేపీకి పెద్దగా టైమ్ ఇవ్వకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలను పెట్టిన కేసీఆర్.. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ కే ఓటువేయాలని ప్రజలను భయపెట్టారు. కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేసినా.. కులసంఘాల మెప్పుకోసం సమ్మేళనాలు పెట్టినా లాభం లేకపోయింది. గ్రేటర్ లో టీఆర్ఎస్ కు సీట్లు భారీగా తగ్గిపోయాయి.  అయితే కరోనా సమయంలో ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై ఎల్ఆర్ఎస్ పేరుతో భారం మోపి నానా ఇబ్బందులకు గురిచేయడం వల్ల వచ్చిన వ్యతిరేకత గురించి మాత్రం కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ధరణి వెబ్ సైట్ తో అవినీతి లేకుండా భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంటూ ఊదరగొట్టుకుని.. చివరికి దాని నిర్వహణపై ప్రభుత్వానికే క్లారిటీ లేక పూర్తిగా భూ రిజిస్ట్రేషన్లను నిలిపేసి.. ప్రజలను గందరగోళంలోకి నెట్టేసింది.

స్టూడెంట్స్, నిరుద్యోగుల సమస్యలు పట్టలే..

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చేస్తాం, ఇంటికో ఉద్యోగమిస్తామని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఆరున్నరేండ్లలో నిరుద్యోగ యువతకు చేసింది శూన్యం. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లోనూ వేలాది పోస్టులు ఖాళీ ఉన్నా పట్టించుకోకుండా సైలెంట్ గా ఉన్న సీఎం వరుసగా ఎలక్షన్లలో దెబ్బపడడంతో ఇప్పుడు గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎలక్షన్ల దృష్ట్యా యువతను మాయ చేసే పనిలో పడ్డారు. 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అంటూ భ్రమల్లో పెట్టి నిరుద్యోగులు, విద్యావంతుల ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా మర్చిపోయారు. మరోవైపు 2019లో బంధుప్రీతి, ధనార్జనే లక్ష్యంగా ఇంటర్ ఫలితాల బాధ్యత గ్లోబరీనా సంస్థకు అప్పగించారు. కానీ ఆ సంస్థ చేసిన తప్పిదాల కారణంగా బాగా చదివే విద్యార్థులను కూడా ఫెయిల్ అని రిజల్ట్స్ ఇవ్వడంతో రాష్ట్రంలో దాదాపు 50 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

రాష్ట్రంలోనే ఫెయిల్.. జాతీయ రాజకీయాలా?

రాష్ట్ర ప్రజలకు సక్రమంగా సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించేలా పాలన చేయడంలో ఫెయిల్ అయిన కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకుని తెలంగాణలో దొరల పాలన కొనసాగిస్తున్నారు. కనీసం ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారు. ధర్నా చౌక్ ఎత్తేశారు. ఎవరైనా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తే అరెస్టులు చేస్తూ నియంతృత్వ ధోరణిలో పాలన చేస్తున్నారు. సెక్రటేరియట్ కు ఏ రోజూ రాని కేసీఆర్.. తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న కలలుకంటూ దానిని కూల్చేసి రూ.700 కోట్ల ప్రజాధనంతో కొత్త బిల్డింగ్ కడుతున్నారు. ఎలక్షన్లలో ఇచ్చి హామీల అమలుకు నిధులు లేవంటూనే ఇలాంటి వృథా ఖర్చులు చేస్తూ తుగ్లక్ పాలనను తలపిస్తున్నారు. రాష్ట్రాన్ని సక్రమంగా పాలించడంలోనే ఫెయిల్ అయిన కేసీఆర్ తాను జాతీయ స్థాయి రాజకీయాలను మారుస్తానంటూ బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి పెడతానని బయలుదేరడం వింతగా ఉంది. అయితే ఆయనపై వివిధ రాష్ట్రాల, జాతీయ నాయకులెవరికీ నమ్మకం లేదని తెలుసుకుని మళ్లీ సైలెంట్ అయినట్టు కనిపిస్తోంది. కేసీఆర్ సంగతి ఇతర పార్టీల నాయకులకే కాదు, తెలంగాణ ప్రజలకూ అర్థమైపోయింది. పూటకో మాట చెప్పి, మోసపు హామీలతో కాలం వెళ్లదీసే కేసీఆర్ పాలన ఇక చాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. బలమైన నాయకత్వాన్ని అందించే ప్రయత్నం చేస్తున్న బీజేపీతోనే మార్పు సాధ్యమని ఆ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

కృష్ణా నీటి తరలింపుపై మౌనం

రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా అన్ని ప్రాంతాలనూ సమ దృష్టితో చూడాల్సిన కేసీఆర్ దక్షిణ తెలంగాణపై మాత్రం సవతి తల్లి ప్రేమను చూపుతున్నారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఈ ప్రాంత రైతాంగానికి కృష్ణా జలాల లభ్యతను పెంచి మేలు చేయాల్సిన సర్కారు.. ఆ పని చేయలేదు. కాలువల సామర్థ్యం పెంచడం లాంటి విషయాలను పూర్తిగా పట్టించుకోవడం లేదు. పైగా ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను ఇష్టానికి తరలించుకుని పోతుంటే సీఎం కేసీఆర్ మాట్లాడకుండా చోద్యం చూస్తున్నారు. సంగమేశ్వరం ఎత్తిపోతల పేరుతో రాయలసీమకు నీరు తరలించుకుని పోయేందుకు ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేస్తున్నా కేసీఆర్ మన హక్కుల కోసం పోరాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని తెలిసీ ఈ తీరుగా వ్యవహరించడం కేసీఆర్ మంచి చేస్తాడని నమ్మిన ప్రజలకు వెన్నుపోటు పొడవడంతో సమానం.

అప్పుడు రైతులు యాదికి రాలేదా?

సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నది రైతన్నలే. మన అవసరాలేంటన్నది పట్టించుకోకుండా నియంత్రిత సాగు అంటూ అనాలోచిత ప్రకటన చేశారు. ప్రభుత్వం చెప్పిన పంట వేయకపోతే రైతు భరోసా కూడా ఇవ్వబోమని రైతులను బెదిరించి మరీ సన్న వడ్డు వేయించారు. సీఎం లాభసాటిగా ఉంటుందని చెప్పారు కదా అని రైతులు సన్న వడ్లు పండిస్తే.. తీరా పంట చేతికొచ్చాక వాటికి మద్దతు ధర కూడా ఇవ్వకుండా మోసం చేశారు. పైగా పంట కోతల సమయంలో అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దానికి నష్ట పరిహారం ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వం భరోసా ఇవ్వలేదు. ఎప్పుడూ పండించే దొడ్డు రకం వడ్ల కన్నా సన్నొడ్ల పంటకు ఖర్చు కూడా ఎక్కువ కావడంతో రైతులు అప్పులపాలయ్యారు. గతంలోనూ ఖమ్మం జిల్లాకు చెందిన మిర్చి రైతులు మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తే ఖమ్మం మార్కెట్ యార్డు నుంచి వారికి సంకెళ్లు వేయించి జైలులో పెట్టిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుంది. ఆ సమయంలో రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కాలన్న ఆలోచన ఏమైంది? ఎప్పుడూ వారి ప్రయోజనాలను పట్టించుకోని టీఆర్ఎస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్రి చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలంటూ నిరసనలు చేపట్టడం విడ్డూరంగా ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన పార్టీ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోంది.

–  డాక్టర్ కర్ణాక కిరణ్ కుమార్, పొలిటికల్​ అనలిస్ట్​

For More News..

లోపాలు సరిచేయకపోతే ధరణి పోర్టల్‌తో​ లీగల్ సమస్యలు

ఫస్ట్​ పనులు.. ఆ తర్వాతే ఎన్నికలు.. టీఆర్ఎస్ కొత్త వ్యూహం

రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం