ఈసారి అధికారంలోకొస్తే ఉద్యోగాలు, ఇండ్లు ఇస్తం: కేసీఆర్

అధికారంలోకి వస్తే వచ్చే ఐదేండ్లలో ఉద్యోగాలు, ఇండ్ల నిర్మాణం ప్రయారిటీగా తీసుకుంటామని సీఎం కేసీఆర్​అన్నారు. ‘నెక్స్ట్ ఉద్యోగాల వైపు పోతం. తెలంగాణలో కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది కాబట్టి ఎక్కడికక్క డ ఫుడ్​ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతం. అక్కడనే స్థానికంగా ఉండే పిల్లలకు ఉద్యోగాలొస్తయి. చదువుకున్న వాళ్లకు పనులు దొరుకుతాయి. ఈ తాపకు యుద్ధ ప్రాతి పదికన ఇండ్లు కడదాం. తెలంగాణలో వడ్లు ఎట్ల పండు తున్నయో.. వచ్చే ఐదేండ్లలో ఇండ్ల నిర్మాణాలు అట్లే జరుగుతయి. జాగలేనోళ్లకు జాగ లిప్పిద్దాం. జాగలున్నోళ్లకు గృహలక్ష్మి కింద డబ్బులిద్దాం. ఇల్లులేని మనిషి లేకుండా చేసుకుందాం’ అని కేసీఆర్ ​హామీ ఇచ్చారు. సోమవారం ఆయన మానకొండూరు, స్టేషన్​ఘన్​పూర్, నల్గొండ, నకిరేకల్​లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని మాట్లాడారు.  ‘‘వ్యవసాయానికి 24 గంటల కరెంట్​వద్దని, 3 గంటలు చాలని కాంగ్రెస్​ నేతలు చెప్తున్నరు. రైతులు10 హెచ్​పీ పంపుసెట్లు పెట్టుకుంటే 3 గంటల కరెంట్ ​సరిపోతదని అంటున్నరు.

 రాష్ట్రంలో 30 లక్షల పంపు సెట్లు కొనాలంటే రూ.30 వేల కోట్లు కావాలి. ఈ సొమ్ముంతా ఎవరియ్యాలె? వాళ్ల అయ్యకొనిస్తరా?’’ అని కేసీఆర్​ కాంగ్రెస్​ నాయకులను నిలదీశారు. ‘‘కాంగ్రెస్ నాయకులు చెప్తున్న ఇందిరమ్మ రాజ్యంలో తిన్నోడు తిన్నడు. తిననోడు తినలే. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది. ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యం పెట్టినంకనే కదా పేదోళ్ల కడుపు నిండింది. ఇందిరమ్మ సక్కదనంగా ఉంటే మనోళ్లంతా ముంబైకి, హైదరాబాద్ ఎందుకు వలస పోయిండ్లు. ఇందిరమ్మ పాలనలో జరిగింది ఎమర్జెన్సీ పేరిట జైళ్లలో వేసుడు, ప్రభుత్వాలను కూలగొట్టుడే’’ అని విమర్శించారు. కాంగ్రెస్​ పాలనలో భూదాన్​పోచంపల్లి చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకున్నారని, నల్గొండ జిల్లా బిడ్డలు హైదరాబాద్​కు పోయి ఆటోలు నడుపుకుని, కూలీ చేసుకొని బతికారని గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి నదులు మధ్య ఉన్నా కనీసం నల్గొండకు మంచినీళ్లు కూడా ఇయ్యలేదని కేసీఆర్ ​మండిపడ్డారు. ‘‘ఆర్టీసీ బిడ్డలు ఉన్నరు. వాళ్లది ఎప్పుడు ఉద్యోగం పోత‌దో తెల్వదు. ఒక అభ‌ద్రతా భావం. ఆర్టీసీ బిల్లు పాస్ చేసినం. గ‌వ‌ర్నర్ ఆల‌స్యం చేయ‌డం వ‌ల్ల ఆగపోయింది. ఎల‌క్షన్ తెల్లారే ఆర్టీసీ బిడ్డల‌ను రెగ్యుల‌రైజ్ చేసి గ‌వ‌ర్నమెంట్ ఉద్యోగ‌స్తులుగా చేస్తం’’ అని కేసీఆర్ ప్రకటించారు.

 ధరణి తీసేస్తే పాత కష్టాలు 

​కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు తీస్తేస్తామని, ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని ఆ పార్టీ నేతలు భాజాప్తా చెప్తున్నారని కేసీఆర్ ​అన్నారు. రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క ధరణిని రద్దు చేసి భూమాత అమలు చేస్తామంటున్నారని, 22 కాలమ్స్​తో మళ్లీ పట్టాదారు పాసుపుస్తకాలు తెస్తామంటున్నారని, దాంతో రైతులకు మళ్లీ పాత కష్టాలు తప్పవని హెచ్చరించారు. అది భూమాత కాదు.. భూమేత అని విమర్శించారు. కర్నాటకలో 20 గంటల కరెంట్​ ఇస్తామని చెప్పి ఇప్పుడు 5 గంటలు ఇస్తున్నారని, ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తే కరెంట్​కాటకలుస్తదన్నారు. బోర్లకు మీటర్లు పెట్టనందుకు ఐదేండ్లలో తెలంగాణను మోదీ రూ.25 వేల కోట్లు ముంచిండని, ఓట్లు అడిగేందుకు బీజేపీ నాయకులకు సిగ్గుండాలె అని సీఎం మండిపడ్డారు. ప్రధాని మోదీ అడ్డగోలుగా డీజిల్ ధరలు పెంచారని, దాంతో ఆటో నడుపుకునే పిల్లలు కష్టపడుతున్నారని కేసీఆర్ అన్నారు. ఆటో రిక్షా వాళ్లకు ఏడాదికి ఒకసారి ఉండే ఫిట్ నెస్ చార్జీలు రూ.700, సర్టిఫికెట్ కు రూ.500 ఫీజును మళ్లీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మానకొండూరు ఎమ్మెల్యేగా రసమయిని గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రతి దళితుడికి దళితబంధు వర్తింపజేస్తానని కేసీఆర్​హామీ ఇచ్చారు.  

కోమటిరెడ్డి డబ్బు మదంతో మాట్లాడుతున్నడు

‘ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబ్బు మదంతో మాట్లాడుతున్నడు. వాళ్లు డబ్బు అహంకా రంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు’ అని సీఎం ఫైర్​ అయ్యారు. నకిరేకల్​లో కాంగ్రెస్​ గెలిచాక రామన్నపేట నుంచి నకిరేకల్​ దాకా అందరినీ పండబెట్టి తొక్కుతం అని చెప్తున్న రు. ఈ పండబెట్టి తొక్కే ఎమ్మెల్యేలా మనకు కావాల్సింది? అని ప్రశ్నించారు. హైదరాబాద్​లో పండేటోళ్లు ఎమ్మెల్యేలుగా కావాల్నా? ప్రజల మధ్యనే ఉండే ఎమ్మెల్యేలు కావాల్నా? ప్రజలే తేల్చుకోవాలని కేసీఆర్​సూచించారు.