భువనగిరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక శక్తులను పెంచి పోషించిందని, వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏరిపారేసిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. తెలంగాణ రాకుంటే భువనగిరి జిల్లా అయి ఉండేది కాదని చెప్పారు. ఒకప్పుడు కరవు ప్రాంతమైన భువనగిరిలో ఇప్పుడు పుష్కలంగా పంటలు పండుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తే భువనగిరిలో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై తాను మంత్రి కేటీఆర్ తో కూడా మాట్లాడనన్నారు. బస్వాపూర్ రిజార్వాయర్ ను త్వరలో తానే స్వయంగా ప్రారంభిస్తానని కేసీఆర్ తెలిపారు.
ఈ సభలో కాంగ్రెస్ పై విమర్శలు చేశారు కేసీఆర్. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని కాంగ్రస్ అంటోందని అలాంటి పార్టీని తీసి బంగాళాఖాతంలో పారేయాలన్నారు. ధరణి వల్ల ఎవరి భూములు లాక్కునే పరిస్థితి లేదన్న సీఎం.. రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలని ధరణి పోర్టల్ తెచ్చామని అన్నారు. ధరణి పోతే మళ్లీ వీఆర్వోల రాజ్యం అవుతుందని, పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత రాజ్యమే మళ్లీ వస్తుందని చెప్పారు. పైళ్ల శేఖర్ రెడ్డిని భారీ మోజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు.