- 2004లో పొత్తు పేరుతో ఆ పార్టీ దోకా చేసింది
- మా ఎమ్మెల్యేలను కొనాలని కాంగ్రెస్ ప్రయత్నించింది
- నా ఆమరణ దీక్షతోనే కాంగ్రెస్దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది
- ఉమ్మడి పాలమూరు సభల్లో సీఎం కామెంట్స్
పాలమూరు జిల్లా ఒకప్పుడు పాలుగారే జిల్లాగా అద్భుతంగా ఉండేదని, సమైక్య పాలకులు ఈ జిల్లాను ఆగం పట్టించారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘నాటి సీఎంలు పాలమూరు జిల్లాను దత్తత పేరుతో మోసం చేసిండ్రు. ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేసి పోయిండ్రు. చుక్క నీళ్లు రాలే. పంటలు ఎండిపోయి రైతులు వలవల ఏడ్చిండ్రు. వలస పోయి బాధలు అనుభవించారు’’ అని అన్నారు. అప్పుడు ఏ పార్టీ పట్టించుకోలేదని, పాలమూరు గోస చూడలేదన్నారు. ఇక్కడి ప్రజలు 40, 50 ఏండ్లు చాలా బాధలు పడ్డారని, పాలమూరు కరువుకు కాంగ్రెస్సే కారణమని సీఎం కేసీఆర్ఆరోపించారు. ‘‘తెలంగాణ ప్రజలు గొడగొడ ఏడుస్తూ వలసలు పోయినప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరన్నా జై తెలంగాణ అన్నారా? తెలంగాణ పచ్చబడటంతో పెత్తనం కోసం ఆరాటపడుతున్నారు” అని కేసీఆర్నాయకులపై మండిపడ్డారు.
నీళ్లు అడిగే నాయకుడే లేకుండే..
‘‘ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపారు. సమైక్య పాలనలో మన ప్రాజెక్టులను రద్దు చేశారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కావాలని కూడా అడగలేదు. బచావత్ ట్రిబ్యునల్ 1974 లో నది నీళ్ల పంపకం చేస్తే, ఇక్కడి లీడర్లు ఎవరూ తెలంగాణకు ఎన్ని నీళ్లు ఇస్తున్నారనే విషయాన్ని కూడా అడగలేదు. ట్రిబ్యునల్ సభ్యులే తెలంగాణలో ఏపీ కలవకపోతే బాగుపడేదని, కలవడం వల్ల నాశనమైందని, నీళ్లు అడిగే వాళ్లు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు’’ అని కేసీఆర్అన్నారు. తెలంగాణ బిడ్డ అంజయ్య సీఎం అయ్యాక శంకస్థాపన చేయడంతో ప్రాజెక్టు ముందుకుపడిందన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ2004లో మాతో పొత్తు పెట్టుకుంది. అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక 2005, 06లో తెలంగాణ ఇవ్వలేదు. రాష్ర్టంలో, ఢిల్లీలో అధికారం చేపట్టి తెలంగాణపై నాన్చివేత ధోరణి మొదలు పెట్టింది. వైఎస్ ఎట్లా చెబితే అట్ల చేశారు. మా పార్టీని ముంచే ప్రయత్నం చేసి, తెలంగాణ ఉద్యమాన్ని పెడదారి పట్టించాలనుకున్నారు. మా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు. కానీ నేను పట్టుదలతో కేసీఆర్ సచ్చుడో.. తెలగాణ వచ్చుడో అని14 ఏండ్లు పోరాటం చేసిన. ప్రజల పోరాటంతో పాటు నేను ఆమరణ దీక్ష పడితే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది’ అని సీఎం చెప్పారు.
ప్రాజెక్టులను రన్నింగ్‌లో పెట్టాం..
తాము అధికారంలోకి వచ్చిన పదేండ్లలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్‌లో పెట్టామని సీఎం కేసీఆర్ చెప్పారు. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. కోయల్‌సాగర్ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉంటే దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పట్టుబట్టి పనులు చేయించారన్నారు. పాలమూరు స్కీంకు అడ్డంకులు తొలగాయని, ఈ స్కీం కింద కర్వెన రిజర్వాయర్ తానే స్థల పరిశీలన చేశానన్నారు. గద్వాల, మక్తల్ ప్రాంతాల్లో వాల్మీకి బోయలు పెద్ద సంఖ్యలో ఉంటారని.. ఆంధ్రాలో వీరు ఎస్టీలుగా, తెలంగాణలో బీసీలుగా ఉన్నారన్నారు. ఎనిమిదేండ్లుగా వీరిని ఎస్టీ జాబితాలో చేర్చాలని మోదీ ప్రభుత్వా నికి అసెంబ్లీ ద్వారా తీర్మానాలు రాస్తున్నా, చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. బోయలను చెటగొట్టింది నీలం సంజీవరెడ్డే అన్నారు.అనంతరం ఆయన పాలమూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, సుంకిని రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ హెలీకాప్టర్‌లో సాంకేతిక లోపం
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ ప్రయాణించే హెలీకాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ నుంచి హెలీకాప్టర్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎన్నికల ప్రచార సభకు బయల్దేరారు. కాసేపటికే సాంకేతిక సమస్య గుర్తించిన పైలెట్ వెంటనే వెనక్కి తీసుకొచ్చి ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. మరో హెలీకాప్టర్ ఏర్పాటు చేయాలని ఏవియేషన్ సంస్థను కేసీఆర్ కోరారు. గంటన్నర తర్వాత ఏవియేషన్ సంస్థ మరో హెలీకాప్టర్‌ను పంపడంతో ప్రచార సభలకు కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. దేవరకద్ర, గద్వాల్, మక్తల్, నారాయణపేట బహిరంగ సభల్లో పాల్గొన్న కేసీఆర్.. నారాయణపేట సభ ముగిసే సరికే రాత్రి కావడంతో రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు.