- లోకల్ ఎమ్మెల్యేను కాదని నేరుగా సీఎంవో నుంచి మానిటరింగ్
- వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం
- దక్షిణ తెలంగాణలో పార్టీ ఊపుతెచ్చేందుకేననే చర్చ
నల్గొండ, వెలుగు : గత ఎన్నికల ముందు నల్గొండ పట్టణాన్ని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ రెండేండ్లుగా ఇక్కడి అభివృద్ధి పనులపై స్పెషల్‌ఫోకస్ పెట్టారు. ఎక్కడా లేనివిధంగా సుమారు రూ.1,300 కోట్ల విలువైన పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, ఇప్పటికే సుమారు రూ.300 కోట్ల పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ పనులన్నింటినీ లోకల్ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా సీఎంవో నుంచి నేరుగా మానిటరింగ్ చేస్తుండడం ఆసక్తిరేపుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో పార్టీ పరిస్థితి బాగాలేకపోవడంతో పాటు కాంగ్రెస్ కంచుకోటలుగా భావిస్తున్న నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో బీఆర్ఎస్కు ఊపుతేవడమే లక్ష్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
డెవలప్మెంట్వర్క్స్పై సీఎంవో మానిటరింగ్..
2018 ఎన్నికల టైంలో నల్గొండ పట్టణాన్ని సీఎం కేసీఆర్దత్తత తీసుకున్నప్పటికీ రెండేళ్ల నుంచే ఇక్కడ అభివృద్ధి పనుల పై స్పెషల్‌ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తర్వాత ఆ స్థాయిలో నల్గొండలో సుమారు రూ.1,300 కోట్ల విలువైన పనులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంట్లో ఇప్పటికే సుమారు రూ.300 కోట్ల పనులు తుదిదశకు చేరాయి. లోకల్ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ఈ పనులను నేరుగా సీఎంవో నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. నల్గొండలో ఐటీ పార్కు, మార్కెట్లు, రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ కూడా పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒకటి, రెండు నెలల్లో పనులు పూర్తయితే ఓపెనింగ్‌కు సీఎం కేసీఆర్ వచ్చే చాన్స్ ఉందని లోకల్ లీడర్లు చెప్తున్నారు. అంతకు ముందు ఈ నెలాఖరులో మంత్రి కేటీఆర్ పర్యటన కూడా ఉంటుందని, ఈ సందర్భంగా మిగిలిన వెయ్యి కోట్ల పనులకు కే టీఆర్శంకుస్థాపన చేస్తారని భావిస్తున్నారు.
దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనం..
నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ బలహీన పడినట్లు అధికార పార్టీ సర్వేలు చెప్తున్నాయి. ఈ మూడు జిల్లాల్లో ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా బీఆర్ఎస్ దే పైచేయి కనిపిస్తున్నప్పటికీ ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇటీవల జరిగిన పరిణామాలు రూలింగ్పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. సీనియర్లు పొంగులేటి, జూపల్లి, వాళ్ల అనుచరులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాలో ఉప్పు, నిప్పులా ఉండే సీనియర్లంతా ఏకతాటి పైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కలిసి అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పలువురి పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణపై ఫోకస్ పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాను నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే మూడు ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్పార్టీకి ఊపుతేవడంతో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని కేసీఆర్ఆలోచిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.