కామారెడ్డి, వెలుగు: కామారెడ్డిలోని భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. అధికార పార్టీ లీడర్ల ఆగడాలకు అడ్డులేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన జిల్లా పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలోని 20 వేల ఎకరాల అసైన్డ్ భూములపై కేసీఆర్కన్ను పడిందని ఆరోపించారు. గజ్వేల్‌లో 15 మంది బీఆర్ఎస్లీడర్లతో సీఎం టీమ్ఏర్పాటు చేశారని, భూకబ్జాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, కొనుగోళ్లు, అమాయకులపై కేసులు పెట్టించడమే వాళ్ల పని అన్నారు.
మల్లన్న సాగర్‌కు భూములిచ్చినవారిని పోలీసులు చిత్రహింసలు పెట్టారని, ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా తీవ్రంగా వేధిస్తోందని మండిపడ్డారు. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కొందరు కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారని తెలియగానే యాక్టివ్ అయ్యారన్నారు. కేసీఆర్ ఇప్పటికే సిద్దిపేటలోని ఎంతో మంది వ్యాపారులను ఆర్థికంగా దెబ్బదీశారని, స్థానిక వ్యాపారులు, ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో గెలిపిస్తే ఆయన్ను కలిసే పరిస్థితి ఉంటుందా.. అని ప్రశ్నించారు.
కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ( కుడా) పేరుతో బస్వాపూర్ నుంచి సదాశివనగర్ వరకు భూములు లాక్కుంటారన్నారు. కేసీఆర్, షబ్బీర్‌అలీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఆయనతో లీడర్లు తేలు శ్రీనివాస్, విపుల్, లక్ష్మారెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్, గంగారెడ్డి, సురేశ్తదితరులు పాల్గొన్నారు.