- బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి
- నల్లబ్యాడ్జీలతో పలుచోట్ల నిరసన
కరీంనగర్ సిటీ, వెలుగు: రజాకార్లు, నిజాం అడుగుజాడల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ కోర్టు చౌరస్తాలో లో ఆదివారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ స్వాతంత్ర్య ఉత్సవాలు అధికారికంగా జరుపుకోడానికి ఎనిమిదేళ్లు పట్టిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మీడియా కన్వీనర్ లోకేశ్, జిల్లా అధికార ప్రతినిధులు కళ్యాణ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్: నిజాం పరిపాలనలో రజాకార్లు సృష్టించిన ఆకృత్యాలను, అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం పేర్కొన్నారు. ఆదివారం తిమ్మాపూర్‌లో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నల్లరిబ్బన్ లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్, కొమరం భీం, అనభేరి ప్రభాకర్ రావ్ లాంటి వీరులు నిజాం ఆకృత్యాలను అడ్డుకొని పోరాడిన చరిత్రను తెలపకుండా జాతీయ సమైక్యత కార్యక్రమాలను నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు జగదీశ్వరాచారి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
మెట్ పల్లి: తెలంగాణ సాయుధ పోరాట యోధులను సర్కారు విస్మరించిందని మెట్ పల్లి బీజేపీ లీడర్లు ఆదివారం పాత బస్టాండ్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. పట్టణాధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించకుండా సమైక్య దినోత్సవం జరపడం సరికాదన్నారు. ఎంఐఎం కు టీఆర్ఎస్భయపడుతోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, లీడర్లు అరుణ, సునీత, నియోజకవర్గ ఇన్చార్జి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల కలెక్టరేట్: విమోచన దినోత్సవం పేరు మార్పును నిరసిస్తూ ఆదివారం సిరిసిల్లలో బీజేపీ లీడర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.గోపి మాట్లాడుతూ కొన్నివర్గాల ఓట్లను కొల్లగొట్టేందుకు కేసీఆర్ రాజకీయం చేస్తున్నారన్నారు. సాయుధ పోరాటంలో అమరుల త్యాగాలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో గూడూరి భాస్కర్, శీలం రాజు, పార్లమెంట్ కో కన్వీనర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జాతీయ సమైక్యత దినోత్సవంగా సీఎం కేసీఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారని వేములవాడ అంబేద్కర్ విగ్రహం వద్ద అదివారం బీజేపీ లీడర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు సంతోష్ బాబు మాట్లాడుతూ విమోచన ఉద్యమంలో దాదాపు 4,500 పైగా ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు విలువ లేకుండా అవమాన పరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు హరిశ్, జి.శ్రీనివాస్, ఎ. శ్రీనివాస్, సుమంత్‌రెడ్డి పాల్గొన్నారు.
కళాకారులకు పుట్టినిల్లు కరీంనగర్
- వారి సేవలు మరువలేనివి
- సమైక్యత వజ్రోత్సవ ముగింపు వేడుకలో మంత్రి కమలాకర్
కరీంనగర్ టౌన్, వెలుగు: కవులు, -కళాకారులకు కరీంనగర్ జిల్లా పుట్టినల్లని, వారి సేవలు మరవలేనివని మినిస్టర్గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం స్థానిక జ్యోతిబా పూలే మైదానంలో నిర్వహించిన సమైక్యత వజ్రోత్సవంలో భాగంగా కవులు, కళాకారులను మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతకుముందు నృత్య కళాకారుడు రతన్ కుమార్ శిష్య బృందంతో చేసిన స్వాగత నృత్యం అలరించింది. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్,శ్యాం ప్రసాద్ లాల్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‍రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, రమణారావు, మాధవి, నర్మద, లీడర్లు పాల్గొన్నారు.
సిరిసిల్ల టౌన్: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఆదివారం సిరిసిల్లలోని సి.నారాయణరెడ్డి కళామందిర్లో ఘనంగా జరిగాయి. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ అనురాగ్ జయంతి, జడ్పీ చైర్పర్సన్ ఎన్.అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ విశ్వప్రసాద్, కవులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలీలు అన్నిరంగాల్లో రాణించాలి
కోరుట్ల,వెలుగు: పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించి ఐక్యతగా ఉండాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. ఆదివారం కోరుట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన రమణను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో పద్మశాలీ సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు మధు, మధు, కౌన్సిలర్లు నాగభూషణం, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
యోగా పోటీలు ప్రారంభం
సిరిసిల్ల టౌన్, వెలుగు: స్థానిక రాష్ట్ర స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా పోటీలను ఆదివారం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో యోగాపై ప్రజలకు అవగాహన కలిగించేలా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంకోసం ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని, యోగాసనాలతో మానసిక, శారీరక రుగ్మతలు దూరం అవుతాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ రామానుజం, నాయకులు గౌతమ్, యోగా గురువు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘ఖని’లో అకాడ శిక్షణ ప్రారంభం
గోదావరిఖని, వెలుగు: స్థానిక విద్యానగర్-2 కాలనీలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భారత్ హనుమాన్ అకాడ శిక్షణను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయుధ పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ గోదావరిఖని ప్రాంతం అంటేనే ప్రాచీన విద్యా అయిన అకాడకు పెట్టింది పేరని, నాడు అకాడతోనే దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యేవన్నారు. ప్రాచీన విద్యకు పూర్వ వైభవం కల్పించడానికి అకాడ మాస్టర్లు కృషి చేయాలని కోరారు. అనంతరం స్టూడెంట్‌తో కాసేపు కత్తిసాము చేశారు. కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, లీడర్లు పాల్గొన్నారు.
పథకాల అమలులో అగ్రగామి తెలంగాణ
కొడిమ్యాల,వెలుగు: దేశంలో అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తురుక కాశీనగర్ లో రూ.5 లక్షల సీడీపీ నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణం కోసం శిలాఫలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారావు, హైదర్, మల్యాల సుజాత, బండ రవీదర్ రెడ్డి, పులి వెంకటేశ్, పీఆర్ఏఈ చంద్ర శేఖర్ పాల్గొన్నారు.
గ్రంథాలయాల సంక్షేమానికి పెద్ద పీట
చొప్పదండి: తెలంగాణ సర్కారు గ్రంథాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. చొప్పదండి మున్సిపల్ పరిధిలో రూ.26 లక్షలతో ఆధునీకరణ చేసిన గ్రంథాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా సేవలందించిన ఏనుగు రవీందర్ రెడ్డిని సత్కరించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్, గిరిజన బంధు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఫొటోకు ఎమ్మెల్యే, ఎస్టీ యువకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మల్లారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మహేశ్
వెల్గటూర్,వెలుగు : ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా వాసి మెరుగు మహేశ్ విజయం సాధించారు. తెలంగాణ అసోసియేషన్ అధ్వర్యంలో శనివారం ఇజ్రాయిల్ దేశంలో ఎన్నికలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మానాల గ్రామానికి చెందిన మహేశ్250 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. మొత్తం 379 ఓట్లు పోలవగా అధ్యక్ష పదవికి మహేశ్, దొడ్డే స్వామి, రాజు, అబ్రహం పోటీ చేశారు. వీరిలో మహేశ్ విజయం సాధించారు.
టీచర్లకు పూర్వ విద్యార్థుల సన్మానం
కరీంనగర్ టౌన్, వెలుగు: పట్టణంలోని వాణినికేతన్ స్కూల్ లో చదివిన 1982–83 పదో తరగతి స్టూడెంట్స్ ఆదివారం నగరంలోని శ్వేత హోటల్ లో తమకు చదువు చెప్పిన 23 మంది గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ తాము చదువు చెప్పిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండటంతో పాటు, విదేశాల్లో వివిధ రంగాల్లో రాణించడం సంతోషకరమన్నారు. 40 ఏళ్ల తర్వాత తమను గుర్తుంచుకుని సత్కరించడం వారి గురు భక్తికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్, శాతవాహన యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై.కిషోర్, డి.మురళీకృష్ణ, ఎం.జగన్ మోహన్ రెడ్డి, వాగేశ్వరి, నిగమ విద్యా సంస్థల అధినేత వీవీఆర్ గోపాల్ రెడ్డి, ఏసీపీ ఏ.మధుసుధన్, వాణినికేతన్ డైరెక్టర్ సీహెచ్.రాధిక తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ
గోదావరిఖని, వెలుగు : స్థానిక లయన్స్క్లబ్ఆఫీస్ ఆవరణలో 21 మంది దివ్యాంగులకు ఆదివాంర కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. రామగుండం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కె.రాజేందర్, సెక్రెటరీ పి.మల్లికార్జున్, ట్రెజరర్ ఎల్లప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి క్లబ్ గవర్నర్ నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దాదాపు రూ.20 లక్షల వ్యయంతో 11 ఏళ్లుగా 1200 మందికి కృత్రిమ అవయవాలను అందజేశామన్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి చొరవతో వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందిస్తున్నామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు. ఇందుకు సహకరించిన వివేక్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు జయపాల్ రెడ్డి, తిలక్ చక్రవర్తి, మనోజ్ కుమార్, రవీంద్ర చారి, గంగాధర్, రామస్వామి, భిక్షపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.