ఖమ్మం, వెలుగు: గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన వారిలో ఇద్దరికి సీఎం కేసీఆర్ హ్యాండిచ్చారు. మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరారు. వీరిలో 12 మంది కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు ఉండగా, ఇద్దరు తెలుగుదేశం తరపున విజయం సాధించారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లుగా గెలిచారు. వారిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. ఆ స్థానం నుంచి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్తరపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జిల్లా పరిషత్‌చైర్ పర్సన్ కోవా లక్ష్మికి మళ్లీ కేసీఆర్ఛాన్స్ ఇచ్చారు.
కొద్దిరోజుల ముందుగానే ప్రగతి భవన్ కు ఆత్రం సక్కును పిలిపించుకున్న కేసీఆర్, ఈసారి పార్టీ టికెట్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. అవకాశం ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో చూద్దాం అంటూ సర్దిచెప్పారు. అన్నట్టుగానే లిస్టులో సక్కు పేరు కనిపించలేదు. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అభివృద్ధి కార్యక్రమాల్లో యాక్టివ్‌గా లేకపోవడం, సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు రావడంతోనే ఆయన్ను పక్కనపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి వచ్చిన మరో 11 మందికి మాత్రం కేసీఆర్ మళ్లీ ఛాన్స్ఇచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లావారే ఎక్కువ
గత ఎన్నికల తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు, టీడీపీ తరపున గెలిచిన ఇద్దరితో పాటు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కలిపి ఏడుగురున్నారు. వీరిలో ఆరుగురికి మళ్లీ అవకాశం దక్కింది. వైరాలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కు ఒక్కడికే ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు. ఆయన 2018 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్తరపున పోటీచేసి ఓడిపోయిన బానోత్ మదన్‌లాల్ కు టికెట్ దక్కింది. అవినీతి ఆరోపణలు, దళితబంధులో అర్రాస్ పెట్టి మరీ పైసల వసూళ్లకు పాల్పడ్డారనే ఫిర్యాదులు, సర్వేల్లో వ్యతిరేకత రావడంతోనే రాములు నాయక్ పై వేటు పడినట్టు తెలుస్తోంది. ఇక ఇల్లందులో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ, లిస్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు కొత్తగూడెం, పాలేరు సీట్ల విషయంలో రకరకాల టాక్ లు వినిపించినా, ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా సిట్టింగుల వైపే మొగ్గుచూపారు.
వలస వచ్చి అవకాశం దక్కించుకున్న వారు
మిగిలిన వారిలో కాంగ్రెస్ నుంచి గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలు నకిరేకల్ లో చిరుమర్తి లింగయ్య, పినపాకలో రేగా కాంతారావు, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డి, ఎల్బీనగర్ నుంచి సుధీర్‌రెడ్డి, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావు, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ నుంచి వచ్చిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావుకు, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచి వచ్చిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు మళ్లీ కేసీఆర్ఛాన్స్ ఇచ్చారు.