- విజేయుడుకు అలంపూర్ టికెట్
- బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చిన కేసీఆర్
- సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు దక్కని బీఫాం
- గోషామహల్ అభ్యర్థిగా నంద కిశోర్ వ్యాస్
- ఓల్డ్ సిటీలోని ఏడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీఫాంలు
హైదరాబాద్, వెలుగు : అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ మార్చారు. ఆగస్టు 21న ఆయన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంకే టికెట్ ఇస్తున్నట్లు చెప్పారు. ఆయన అభ్యర్థిత్వంపై ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డితో పాటు నియోజకవర్గంలోని పలువురు లీడర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బేగంపేట క్యాంప్ ఆఫీస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి అభ్యర్థిని మార్చాల్సిందేనని కోరారు. తర్వాత, సీఎం కేసీఆర్‌ను కలిసి అబ్రహం స్థానంలో మరొకరికి చాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ చల్లా ఒత్తిడితో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు బీఫాం ఇవ్వలేదు. ఆయనకు తప్ప ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 13 మంది అభ్యర్థులకు అక్టోబర్ 15వ తేదీన్నే బీఫాంలు ఇచ్చారు.
అబ్రహం పలుమార్లు పార్టీ చీఫ్కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసినా టికెట్‌పై స్పష్టత ఇవ్వలేదు. మంగళవారం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరుడు విజేయుడును కేటీఆర్హైదరాబాద్కు పిలిపించారు. పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాల మేరకు విజేయుడును అలంపూర్అభ్యర్థిగా ప్రకటించి బీఫాం అందజేశారు. అదేవిధంగా, గోషామహల్ సెగ్మెంట్ కు నంద కిశోర్ వ్యాస్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేశారు. గోషామహల్ టికెట్ ఆశించిన ఆశీశ్ కుమార్ యాదవ్‌ను కేటీఆర్ పిలిపించి బుజ్జగించారు. ఆయన చేతుల మీదుగానే.. నంద కిశోర్‌కు బీఫాం అందజేశారు. ఆశీశ్ను కలుపుకొని ఎన్నికల్లో పని చేయాలని నందకిశోర్‌కు సూచించారు.
టికెట్ రాలేదని నిరాశ పడొద్దని, భవిష్యత్ లో ఇతర అవకాశాలు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. వీరితో పాటు ఓల్డ్‌సిటీలోని ఏడు సీట్లలో పోటీ చేసే అభ్యర్థులకు కూడా బీఫాంలు అందజేశారు. ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణ గుట్ట), సామా సుందర్ రెడ్డి (యాకత్ పురా), ఇనాయత్ అలీ బాక్రీ (బహదూర్‌పురా), తీగల అజిత్ రెడ్డి (మలక్ పేట్), అయిందాల కృష్ణ (కార్వాన్), సలావుద్దీన్ లోడి (చార్మినార్), సీహెచ్ ఆనంద్‌కుమార్ గౌడ్ (నాంపల్లి) బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్నారు. వీలైనంత త్వరగా నామినేషన్లు దాఖలు చేయాలని అభ్యర్థులకు కేటీఆర్ సూచించారు. దీంతో మొత్తం 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాంల పంపిణీ పూర్తయింది.
సాగర్ అభ్యర్థిని మార్చండి
నాగార్జునసాగర్ అభ్యర్థి నోముల భగత్‌ను మార్చాలని స్థానిక నేతలు మంగళవారం కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో సాగర్‌కు చెందిన పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర నాయకులు బేగంపేట క్యాంప్ ఆఫీస్‌లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును కలిశారు. నోముల భగత్ కారణంగా పార్టీ ఓడిపోయే అవకాశం ఉందన్నారు. వేరే అతనికి సీటు కేటాయించాలని కోరారు. అప్పుడే భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే చాన్స్ ఉందని వివరించారు. తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని పార్టీకి మేలు చేయాలని కోరారు. తాము చెప్పిన అంశాలను అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోవాలని కూడా సూచించారు. సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామని వారికి మంత్రులు హామీ ఇచ్చారు. అయినా, కేసీఆర్‌ను నేరుగా కలిసి అభ్యర్థిని మార్చాలని విజ్ఞప్తి చేసేందుకు సాగర్ లీడర్లు ప్రయత్నిస్తున్నారు.