కామారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్ నేడు కామారెడ్డి జిల్లాకు రానున్నారు. బాన్స్ వాడ నియోజకవర్గం.. బీర్కుర్ మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 26 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బుధవారం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. అధికారులు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించారు. బాన్స్వాడలో హెలీ ప్యాడ్ రెడీ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు. కలెక్టర్ జితేశ్వి పాటిల్, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.
2016లో మొదటి సారి..
తిమ్మాపూర్‌లోని ఎత్తయిన గుట్టపై చిన్నగా వేంకటేశ్వరుడి ఆలయం ఉండేది. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 2015లో గుట్టపై గుడి కట్టి విగ్రహాల ప్రతిష్ఠాపన చేశారు. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి సీఎం కేసీఆర్ రావడం ఇది రెండో సారి. 2016లో జరిగిన స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అప్పుడు అభివృద్ధి పనుల కోసం రూ. 23 కోట్ల ఫండ్స్ కేటాయించారు. ఈ ఫండ్స్‌తో రాజగోపురం, మాడవీధులు, యాగశాల, కల్యాణ మండపం, భక్తుల కోసం గెస్ట్‌హౌజ్‌లు, కొనేరు , కొండపైకి రోడ్ల నిర్మాణం జరిగింది.
భారీ బందోబస్తు
సీఎం పర్యటన నేపథ్యంలో పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. కామారెడ్డితో పాటు నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్లా జిల్లాల నుంచి పోలీసు బలగాలు రప్పించారు. ఇద్దరు ఎస్పీ స్థాయి ఆఫీసర్లు, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 11 మంది డీఎస్సీలు, 22 మంది సీఐలు, 73 మంది ఎస్సైలు, మొత్తం వెయ్యి మంది సిబ్బంది బందో బస్తులో పాల్గొంటున్నట్లు ఎస్పీ తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ లీడర్ల అరెస్టు
సీఎం పర్యట నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ లీడర్లను పోలీసులు ముందస్తులు అరెస్ట్‌చేశారు. బాన్స్వాడ, బీర్కుర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన లీడర్లను అరెస్ట్‌చేసి పీఎస్‌లకు తరలించారు.
హెలిపాడ్ స్థల పరిశీలన
బీర్కూర్ : సీఎం కేసీఆర్ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలీపాడ్ ను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. సీఎం కేసీఆర్ బుధవారం తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీ వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సతీశ్ లీడర్లు ఉన్నారు.
సీఎం పర్యటన ఇలా...
- ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బాన్స్‌వాడకు బయలు దేరుతారు.
- 10.40 గంటలకు బాన్స్‌వాడకు చేరుకుంటారు.
- 10.55 గంటలకు తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. స్వామి వారి కల్యాణం, స్థానికంగా జరిగే ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు.
- తిరిగి మధ్యాహ్నం 1.15 గంటలకు ఆలయం నుంచి బయలు దేరుతారు.
- 1.30 గంటలకు బాన్స్వాడ నుంచి హైదరాబాద్‌కు హెలికాప్టర్లో వెళ్తారు.