కేసీఆర్​ రైతులను మోసం చేసిన్రు.. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

నార్కట్​పల్లి, వెలుగు : రైతులకు ఉచితంగా ఎరువులను పంపిణీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, యండల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో  మీడియాతో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రధాని ఫొటో రేషన్ కార్డులో పెట్టాల్సి వస్తోందని తొమ్మిదేండ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. 

కాళేశ్వరంతోపాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలలో అవినీతి జరిగిందన్నారు. పాలమూరులో ఉన్న తొమ్మిది ప్రాజెక్టులకు 10 శాతం డబ్బులు ఖర్చు పెడితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఎందుకు పూర్తి చేయడం లేదో చెప్పాలన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. బీజేపీ చేసిన అభివృద్ధి,  కేసీఆర్ చేసిన ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కడతారన్నారు.