కామారెడ్డి నుంచి.. బరిలో సీఎం కేసీఆర్​.. ఎందుకంటే?

  • ఉమ్మడి జిల్లాలో పట్టుకోసం బరిలో బీఆర్ఎస్​ అధినేత 
  • సర్వేలన్నీ ప్రతికూలంగా రావడంతో శ్రేణుల్లో ఊపు తేవాలని నిర్ణయం
  • ఉమ్మడి నిజామాబాద్​లో కామారెడ్డి మినహా సిట్టింగులకే సీట్లు

నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్​తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్​ నిర్ణయించుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాతో పాటు, ఉత్తర తెలంగాణలో ప్రభావం చూపేలా కామారెడ్డిని ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్​ చేయించిన​సర్వేల్లో ఉమ్మడి జిల్లాతో పాటు, సమీప జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​పై ప్రతికూలత ఏర్పడడంతో, ఈ ప్రాంతంలో పోటీ చేసి..

ఊపు తీసుకురావాలని గులాబీ బాస్​ వ్యూహాత్మకంగా కామారెడ్డిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేసీఆర్​ వెన్నంటి నిలిచింది. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెజార్టీ జడ్పీటీసీ స్థానాలు గెలుపొందిన బీఆర్​ఎస్​ నిజామాబాద్​ జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంది. 

కేసీఆర్​ పూర్వీకులది ఇక్కడే..

కేసీఆర్​ పూర్వీకులది కామారెడ్డి ఏరియానే. బీబీపేట మండలం కోనాపూర్​(పొశాన్​పల్లి)​ కేసీఆర్​తల్లి ఊరు. తండ్రి ఇక్కడకి ఇల్లరికం వచ్చారు. కోనాపూర్​కు సమీపంలో మానేరు డ్యామ్​ నిర్మాణంతో  కేసీఆర్​ఫ్యామిలీ భూములు నీటమునిగాయి. దీంతో చింతమడకకు వలస వెళ్లారు. కేసీఆర్ ​ముగ్గురు అక్కలు కామారెడ్డిలోనే నివాసం ఉండేవారు. 

బాన్సువాడలో పోచారం వైపు మొగ్గు..

బాన్సువాడ నుంచి పోటీ చేయాలని స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి కొడుకు భాస్కర్​రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అధిష్టానం మాత్రం శ్రీనివాస్​రెడ్డి వైపే మొగ్గుచూపింది. జిల్లాలో సీనియర్​ఎమ్మెల్యేగా ఉన్న ఈయన గులాబీ పార్టీ తరఫున 3 పర్యాయాలు గెలిచారు. నాలుగోసారి ఈయనకే అవకాశం వచ్చింది. 

జుక్కల్​లో మళ్లీ షిండేనే..

ఎస్సీ రిజర్వ్​డ్ ​స్థానమైన జుక్కల్​ నుంచి బీఆర్ఎస్​తరఫున హన్మంత్​ షిండే బరిలో నిలువనున్నారు.  మొదటిసారి 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన ఆ తర్వాత  బీఆర్ఎస్​లో చేరారు. 2014,2018 లో పోటిచేసి గెలుపొందారు. 

కారు గుర్తుపై మొదటిసారి పోటీ..

గత ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి గెలిచి బీఆర్ఎస్​లో చేరిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్​కు బీఆర్ఎస్ ​నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. దీంతో ఆయన మొదటిసారి కారు గుర్తుపై పోటీ చేయనున్నారు.

బాజిరెడ్డి మరోసారి..

రూరల్​ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ఈ సారి తన కొడుకు జగన్​ను పోటీ చేయించాలని భావించారు. చివరి వరకు తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీ మాత్రం మళ్లీ బాజిరెడ్డినే పోటీ చేయాలని నిర్ధేశించింది. ఈయన ఇప్పటిదాకా ఆరు అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ, నాలిగింట గెలించారు.  1994 జనరల్ ​ఎలక్షన్​లో ఆర్మూర్ స్థానానికి కాంగ్రెస్​ రిబెల్​గా పోటీ చేసి ఓడిన ఆయన, 1999లో కాంగ్రెస్​ పక్షానే పోటీ చేసి ఆర్మూర్​ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2004లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్​ టికెట్​పై గెలుపొందారు. 2009లో పోచారం శ్రీనివాస్​రెడ్డి చేతిలో బాన్సువాడలో ఓడిపోయారు. అనంతరం 2014, 2018లో బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

లోక్​సభ కోసం వచ్చి.. ఎమ్మెల్యేగా గణేశ్​గుప్తా 

సెంట్రల్​ పాలిటిక్స్​పై ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చిన గణేశ్​గుప్తా, 2009లో నిజామాబాద్ ​ఎంపీ స్థానానికి బీఆర్ఎస్​ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కల్వకుంట్ల కవిత ఎంపీకి పోటీ చేయడంతో ఆయన అర్బన్​ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. వరుసగా రెండుసార్లు గెలిచి, ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తున్నారు.

బోధన్​లో షకీల్..

ఎమ్మెల్యే షకీల్​మరోసారి బోధన్​నుంచి బరిలో నిలువనున్నారు. 2009లో బోధన్ ​నుంచి మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసిన షకీల్ ​ఓటమి చెందారు. తర్వాత 2014, 2018లో  రెండుసార్లు వరుస విజయాలు సాధించి, హ్యాట్రిక్​ కోసం ఎదురుచూస్తున్నారు. అంతకు ముందు 2007 ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ ​స్థానిక సంస్థల అభ్యర్థిగా ఇండిపెండెంట్​గా పోటీ చేసి ఓడిపోయారు.

ఆర్మూర్​లో జీవన్​రెడ్డి.. 

కేసీఆర్​దత్తపుత్రుడిగా పేరున్న ఆర్మూర్​ఎమ్మెల్యే జీవన్​రెడ్డి 2014, 2018 ఎలక్షన్స్​లో వరుసగా విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికలప్పుడు తెలంగాణ స్టేట్​లో జీవన్​రెడ్డి పేరును కేసీఆర్ ​ఫస్ట్​అనౌన్స్​ చేశారు. తాజాగా ఆయన మూడో సారి ఆర్మూర్​ నుంచి బరిలో నిలువనున్నారు.

గంప దారేటు?

కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్​ పోటీ చేయనుండడంతో ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రాజకీయ భవిష్యతు ఎలా ఉండబోతుందోనని స్థానికంగా చర్చ జరుగుతోంది. కామారెడ్డిని మరింత అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే  కేసీఆర్​ను ఇక్కడి నుంచి పోటీచేయలని తానే కోరినట్లు గంప ఇటీవల ప్రకటించారు. గోవర్ధన్​కు కేసీఆర్ మంచి అవకాశాలు ఇస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి పదవినే ఆయనకు కట్టబెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

వ్యూహాత్మకంగా...

కామారెడ్డిలో పోటీ చేయడం ద్వారా ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాతో పాటు, కామారెడ్డికి సమీపంలో ఉన్న మెదక్, దుబ్బాక నియోజకవర్గాలు, నిజామాబాద్​జిల్లాకు ఆనుకొని ఉన్న నిర్మల్, ఆదిలాబాద్​ జిల్లాల్లో  ఊపు తీసుకురావొచ్చని గులాబీ బాస్​ భావిస్తున్నారు. జాతీయ రాజకీయాలపై ఫోకస్​ చేసిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లాకు మహారాష్ట్ర పక్కనే ఉండడంతో వ్యూహాత్మకంగా కలిసొస్తోందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సీఎం స్థాయి వ్యక్తి కామారెడ్డి నుంచి ఫస్ట్​టైమ్ ​పోటీ  చేయనున్నారు. 

మంత్రి ప్రశాంత్​ మూడోసారి..

తండ్రి వేముల సురేందర్​రెడ్డి రాజకీయ వారసుడిగా బీఆర్ఎస్​ ద్వారా పొలిటికల్​ఎంట్రీ ఇచ్చిన వేముల ప్రశాంత్​రెడ్డి బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎలక్షన్స్​లో గెలిచారు. రెండోసారి గెలిచాక సీఎం ఆయన్ను క్యాబినెట్​లోకి తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో పార్టీకి పెద్దగా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్​కు నమ్మకస్తుడిగా ముద్ర ఉండడంతో ముచ్చటగా మూడోసారి పోటీ చేసే ఛాన్స్​ లభించింది.