తీరు మార్చుకోకపోతే టికెట్ ఇవ్వం.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్

  • ప్రజల్లో మనకే బలం ఉంది.. అయినా మీ తీరుతోనే నష్టం
  • మూడు నెలల్లో తీరు మార్చుకోకుంటే టికెట్​ కట్​ చేస్తం
  • బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు కేసీఆర్​ హెచ్చరిక
  • సిట్టింగ్స్​కే టికెట్లు.. కానీ, కండిషన్స్​ అప్లయ్​
  • ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నరో ఎప్పటికప్పుడు చూస్తున్నం
  • ఏ దిక్కులేకనే కర్నాటక ప్రజలు కాంగ్రెస్​ను ఎంచుకున్నరు
  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్​ఎస్​కు  95 నుంచి 105 సీట్లొస్తయ్
  • మహారాష్ట్రలో బ్రహ్మాండంగా ఆదరణ వస్తున్నది.. అక్కడా సత్తా చాటుతం
  • చెరువు కట్టలపై తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మూడు నెలల్లోగా పనితీరు మార్చుకోవాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్​కట్​చేస్తానని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు పార్టీ చీఫ్​, సీఎం కేసీఆర్​ హెచ్చరించారు. పైపైన ప్రచారం చేయడం కాదని, ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. ‘‘మీరు నిర్లక్ష్యంగా, ఏమరుపాటుతో ఉంటే మీరు మునగడంతో పాటు పార్టీ మునగడం ఖాయం. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత ఉన్నా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుతో నష్టం తప్పదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్​ కు 95 నుంచి 105 స్థానాలు గ్యారంటీ అని సర్వేలు చెప్తున్నయ్​. కానీ ఎమ్మెల్యేల తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది” అని వార్నింగ్​ ఇచ్చారు. అందరినీ కలుపుకుపోవాలని తాను ఎన్నిసార్లు చెప్తున్నా ఎమ్మెల్యేలు మారడం లేదని ఆయనమండిపడ్డారు. శతాబ్దంలో జరగని అభివృద్ధిని కేవలం దశాబ్ద కాలంలోనే చేసి చూపించామని, అయినా ప్రజల్లోకి వెళ్లడానికి బద్ధకం ఎందుకని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్​లో  బీఆర్ఎస్​ సంయుక్త సమావేశం నిర్వహించారు. మొదట ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోనే సమావేశం అని ప్రకటించినా.. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్​ చైర్​పర్సన్లు, జిల్లా పరిషత్​ చైర్​పర్సన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో కేసీఆర్​ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి ప్రజలకు ఎవరూ చెప్పడం లేదన్న రిజల్ట్స్​ వస్తున్నదని అన్నారు. చేసిన పనులు చెప్పకపోతే మునిగిపోతామని పేర్కొన్నారు. సిట్టింగ్​ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తానని చెప్తూనే.. కండీషన్స్​అప్లయ్ ​అంటూ పలు అంశాలను ఆయన లేవనెత్తారు.

కొందరు ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలు కూడా సరిగ్గా నిర్వహించలేదని కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో పార్టీ హైకమాండ్​ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటుందని అన్నారు. ‘‘కొందరు ఎమ్మెల్యేలు తమ వారిని మాత్రమే ఎంకరేజ్​ చేస్తున్నారు. ఇట్లయితే  పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలంతా ఏమైపోవాలి? ప్రతి కార్యకర్త చెప్పే మాటను ఎమ్మెల్యేలు వినాలి. కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తే దాని ఫలితం కూడా అనుభవించాల్సి ఉంటుంది” అని వార్నింగ్​ ఇచ్చారు.

చెరువు కట్టలపై అవతరణ వేడుకలు

జూన్​రెండో తేదీ నుంచి నిర్వహించే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను గ్రాండ్​సక్సెస్​ చేయాలని ఎమ్మెల్యేలకు  కేసీఆర్​ సూచించారు. ‘‘తెలంగాణ దక్కన్​ పీఠభూమి.. ఇక్కడ వర్షం కురిస్తే పల్లెంలా ఉన్న భూమిపై చుక్కా నీళ్లు నిలువవని గుర్తించే కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం చేసిన ఈ చెరువులను మిషన్​ కాకతీయలో భాగంగా పునరుద్ధరించాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను చెరువు కట్టలపై నిర్వహించాలి” అని చెప్పారు.  రైతులు, మత్య్సకారులు, రజకులు సహా చెరువుపై ఆధారపడి బతికే వాళ్లందరినీ చెరువుల వద్దకు తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని చెప్పి అందరితో చెరువు కట్టలపైనే సహపంక్తి భోజనాలు చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో దశాబ్ది ఉత్సవాలను మంత్రులే పర్యవేక్షించాలన్నారు. కొందరు మంత్రులు నియోజకవర్గాలు దాటి వెళ్లడం లేదని, జిల్లా స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా లీడర్లందరినీ పిలిచి వారితో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.  జూన్​ రెండో తేదీ నుంచి 21 రోజుల పాటు ఇతర పనులు పెట్టుకోకుండా ప్రతి రోజు ప్రజల్లోనే ఉండాలని ఆయన అన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా సహా అన్ని సంక్షేమ పథకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, బ్రోచర్లు ప్రింట్​చేసి ఇంటింటికీ పంచిపెట్టాలని లీడర్లను ఆదేశించారు. ఇందుకు సోషల్​మీడియాను కూడా ఉపయోగించుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో సోషల్​ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. తాను చెప్పిన వాటిని అందరూ ఫాలో కావాలని, ఎవరు నిర్లక్ష్యం చేసినా ఉపేక్షించేది లేదని కేసీఆర్​ హెచ్చరించారు. తాను చెప్పినట్టు చేస్తే ఒక్కో ఎమ్మెల్యే 50 వేల మెజారిటీకి తగ్గకుండా గెలుస్తారని అన్నారు.

మహారాష్ట్రలో సత్తా చాటుతం

మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్​కు బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతున్నదని, తెలంగాణ తర్వాత అక్కడ కూడా  సత్తా చాటుతామని  కేసీఆర్​ అన్నారు. ‘‘గుజరాత్​ మోడల్​ బోగస్​.. దేశం మొత్తానికి తెలంగాణ మోడలే శరణ్యమని ఔరంగాబాద్​ లో ఒక ఐఏఎస్​ ఆఫీసర్​ చెప్పిండు” అని ఆయన తెలిపారు. కులం, మతంతోనే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదని, అన్ని వర్గాల ప్రజలను మంచిగ చూసుకుంటేనే  గెలుస్తామని చెప్పారు. కల్తీ విత్తనాల పీడ రైతులను పీడిస్తున్నదని, పీడీ యాక్టులు పెట్టి దీన్ని కొంత నియంత్రించగలిగామని, ఇంకా కఠిన చర్యలు చేపట్టాలని కేసీఆర్​ అన్నారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరూ ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నదని అది కూడా మనమే తీసుకుంటామంటే మోడీ ఒప్పుకోవట్లేదని దుయ్యబట్టారు. కాగా.. ఎమ్మెల్సీ కవిత, అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ మినహా మిగతా నేతలందరూ సమావేశానికి హాజరయ్యారు.

కర్నాటక  రిజల్ట్స్​ ప్రభావం ఇక్కడ ఉండదు

కర్నాటకలో ఏ దిక్కులేకనే అక్కడి ప్రజలు కాంగ్రెస్​ను ఎన్నుకున్నారని, ఆ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండబోదని కేసీఆర్​ అన్నారు. కర్నాటకల్నే కాంగ్రెస్, బీజేపీ ఏమి చేయలేదని, వాళ్లు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారని ఆయన దుయ్యబట్టారు. ‘‘70 ఏండ్లలో దేశానికి కాంగ్రెస్​చేసింది ఏమీ లేదు. దేశానికి ద్రోహం చేసిందే ఆ పార్టీ. దేశమంతా చతికిలపడిపోయిన ఆ పార్టీని తెలంగాణలో ప్రజలు నమ్మబోరు” అని అన్నారు. ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్​కు 95 నుంచి 105 సీట్లు వస్తాయని అన్ని సర్వే సంస్థలు రిపోర్టులు ఇచ్చాయని కేసీఆర్​ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో మంత్రులు క్రియాశీలంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా నేతలందరినీ సమన్వయం చేసుకోవాలన్నారు. ‘‘ఒక్కో మంత్రి తనతో పాటు అదనంగా కనీసం ఒక్క ఎమ్మెల్యేనైనా గెలిపించేందుకు పనిచేయాలి. బీఆర్ఎస్​ వీక్​గా ఉన్న నియోజకవర్గాలపై ప్రతిపక్షాలు కన్నేశాయి. వాటికి ఏ అవకాశం దక్కకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి” అని చెప్పారు. ‘‘ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో చేసింది. తొమ్మిదేండ్ల కింద తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లా మారిందనే వ్యత్యాసాన్ని కూడా ప్రజలకు  చెప్పకపోవడం మన వైఫల్యమే. ఉమ్మడి రాష్ట్రంలో తామే తెలంగాణను ఉద్దరిస్తున్నట్టుగా ఏపీ నేతలు చెప్పుకునే వాళ్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్​ కన్నా తెలంగాణ ఎన్నో రెట్లు ముందు ఉంది” అని కేసీఆర్​ అన్నారు.

చిన్న కార్యకర్తను కూడా నిర్లక్ష్యం చేయొద్దని నేను ఎన్నిసార్లు చెప్పినా  ఎమ్మెల్యేల తీరు మాత్రం మార్తలేదు. పరిస్థితి ఇట్లనే ఉంటే నష్టం తప్పదు. ఇకనైనా తీరు మార్చుకోవాలి. ఆగస్టు వరకు గడువిస్తున్న. తర్వాత మరోసారి పార్టీ సంయుక్త సమావేశం ఉంటది. అప్పటికీ తీరు మార్చుకోని వాళ్లను మార్చేయక తప్పదు. కొత్తవాళ్లకు చాన్స్​ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు.
- సీఎం కేసీఆర్​