- ఎమ్మెల్యే భాస్కర్‌రావు నాకు కుడి భుజం లాంటోడు
- డిండి లిఫ్ట్ పూర్తిచేసి దేవరకొండ దరిద్రాన్ని వదిలిస్తా
- హుజూర్‌నగర్‌లో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తా
- మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్నగర్ సభల్లో సీఎం కేసీఆర్
మిర్యాలగూడ/దేవరకొండ/హుజూర్నగర్, వెలుగు: మిర్యాలగూడలో ఐటీహబ్, హుజూర్నగర్, దేవరకొండలో ఇండ్రస్ట్రియల్ పార్కులు ఏర్పాటు కావాలంటే ముగ్గురు ఎమ్మెల్యేలను బంపర్ మెజార్టీ తో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. మంగళవారం దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌లో జరిగిన ప్రజాశ్వీరాద సభలో ఆయన ప్రసగించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తనకు కుడిభుజం లాంటోడని, అతి ముఖ్యమైన స్ట్రాటజీ సమావేశాల్లో ఆయన పాత్ర కీలకమని చెప్పారు.
నిత్యం చెక్‌డ్యాంలు, లిఫ్ట్‌ల పనుల కోసం వచ్చే భాస్కర్‌రావును చూసి నాదగ్గర ఉండే సెక్రటరీలు ‘తుంగపాడు బంధం’ అని జోక్ చేస్తుంటారని అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి భాస్కర్‌రావు ఎనలేని కృషి చేశాడని సీఎం పొగడ్తలతో ముంచెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను లక్ష ఓట్ల మె జార్టీతో గెలిస్తే మిర్యాలగూడలో ఐటీహబ్, నందిపాడు వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి, ప్రభుత్వ డిగ్రీ , జూనియర్ కాలేజీ, ఐటీఐ, థర్మల్ పవర్ ప్లాంట్‌లో స్థానికంగా ఉండే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఉప ఎన్నిక ఫలితం రిపీట్ కావాలె
హుజూర్నగర్ఉప ఎన్నిక ఫలితాలే మళ్లీ రిపీట్ కావాలని సీఎం పిలుపునిచ్చారు. బైపోల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, లి ఫ్ట్ ఇరిగేషన్లు, సీసీ రోడ్లు, ఆర్డీవో ఆఫీసు, గిరిజన భవన్, ఈఎస్ఐ డిస్పె న్సరీ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సీఎం వివరించారు. సైదిరెడ్డి కోరినట్టుగా ఆయన్ని గెలిపిస్తే హుజూర్‌నగర్‌కు తప్పనిసరిగా ఇండ్రస్ట్రియల్ పార్క్, యువతకు స్కిల్‌సెంటర్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
దేవరకొండకు మళ్లీ వస్తా
ఎన్నికలు కాగానే మళ్లీ దేవరకొండకు వచ్చి ఒక రోజంతా ఉంటానని సీఎం చెప్పారు. దేవరకొండ సభ ఏడు నిమిషాల్లో ముగియడంతో... ఎన్నికల తర్వాత వచ్చి ఇక్కడి ప్రజల కోరికలు నెరువేరుస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కోరిక మేరకు ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోపే అగ్రికల్చర్ పాలిటిక్నిక్ కాలేజీకి జీవో ఇస్తానని ప్రకటించారు. దేవరకొండలో ఇంత గొప్ప సభ మునుపెన్నుడూ జరగలేదని, ఇంత పెద్ద ఎత్తున జనం రావడం ఇదే మొదటిసారి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేను 70,80 వేల మెజార్టీతో గెలిపిస్తే దేవరకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే డిండి ఎత్తిపోతల పథకం పనులు వేగంగా కంప్లీట్ చేసి దేవరకొండకు పట్టిన దరిద్రాన్ని వదిలిస్తానని హామీ ఇచ్చారు.
సాగర్ డ్యాం పై ఎంపీ ఉత్తమ్‌కు కౌంటర్
సాగర్ డ్యాం ఇప్పుడున్న స్థలంలో కట్టాల్సింది కాదని తాను కోదాడ సభలో చెబితే ఉత్తమ్ ఆగమైపోయాడని సీఎం విమర్శించారు. సాగర్ చరిత్రను వక్రీకరిస్తున్నారని గగ్గోలు పెట్టాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న సాగర్ డ్యాం ఏలేశ్వరం దగ్గర కట్టి ఉంటే అప్పుడే ఎడమ కాల్వ ద్వారా చివరి భూములకు నీళ్లు వచ్చేవని అన్నారు. నాడు ఈ కాంగ్రెస్ నాయకులే దద్దమ్మల్లా నోరు మూసుకొని కూర్చున్నారని మండిపడ్డారు.
ఈ సభల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనా చారి, ఏంసీ కోటి రెడ్డి, ఎమ్మెల్యేలు నలమోతు భాస్కర్‌రావు, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్రకుమార్ మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్, గుత్తా అమిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.