కేసీఆర్​ భ్రమలు..అసలు నిజాలు

If everything is alright in the news, something must be wrong with journalism. వరల్డ్​ ప్రెస్​ ఫ్రీడమ్​డే సందర్భంగా మే 3న జర్నలిజంపై యునెస్కో వెలిబుచ్చిన అభిప్రాయమిది. ‘అంతా బాగుంది’ అని రాయడం, చూపడం అసలు జర్నలిజమే కాదన్నది దీని సారాంశం. నిజానికి ‘అంతా బాగుంది’ అనేది ఒక భ్రమ. అధికారమత్తులో కండ్లు మూసుకుపోయిన పాలకులు, వాళ్ల భజనపరులు అలాంటి భ్రమల్లో బతకడం సహజమే. కానీ అలాంటి భ్రమలు మీడియాకు కూడా ఉండాలనుకోవడం పూర్తిగా అసహజం.  మీడియా వాస్తవాల మీద బతకాలి తప్ప భ్రమల్లో కాదు. భ్రమల్లో బతికే మీడియాకు సమాజంలో చోటుండదు. అవి పాలకుల కరపత్రాలుగా ఉంటాయే తప్ప ప్రజలపత్రికలుగా మనలేవు. రాష్ట్రంలో పబ్లిక్ మీడియాగా ఉన్న వీ6 – వెలుగుపై కేసీఆర్​సర్కారు తీవ్ర అణచివేతకు పాల్పడుతున్న తరుణంలో మరోసారి పత్రికా స్వేచ్ఛపై, జర్నలిస్టుల విధులపై సీరియస్​గా చర్చ జరుగుతున్నది. ‘Magic is harmless fun, but the government is not. It squanders vast amounts of money while simultaneously whittling away at people’s freedom. Instead of solving problems, it makes them worse, often creating brand new problems. (లేనిది ఉన్నట్టు కనికట్టు చేసే మ్యాజిక్​తో వినోదమే తప్ప ఎలాంటి నష్టం లేదు. కానీ ప్రజల్ని భ్రమల్లో ముంచే ప్రభుత్వాల వల్ల పాత సమస్యలు పరిష్కారం కాకపోగా, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. దుబారాపెరగడంతో పాటు  ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోతారు.) అమెరికాకు చెందిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త జేమ్స్​పేన్​ అన్న మాటలు తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కారు తీరుకు అతికినట్టు సరిపోతాయి. 

ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతూ..

రాష్ట్రంలో సీఎం కేసీఆర్, ఆయన భజనపరులకు కాళేశ్వరం, ధరణి అద్భుతమైన ప్రాజెక్టులు కావచ్చు! కానీ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ఒక్క ఎకరాకు నీళ్లియ్యకముందే మునిగిపోయింది వాస్తవం కాదా! పంప్​హౌస్​ మునగడం వల్ల ప్రభుత్వానికి వెయ్యి కోట్లకు పైగా నష్టం వచ్చింది ఎంత వాస్తవమో, ప్లానింగ్​లోపమే దీనికి కారణమన్నది కూడా అంతే వాస్తవం. ఈ వాస్తవాలనే కదా వీ6 – వెలుగు చూపింది. ఇప్పుడు ఎవరు భ్రమల్లో ఉన్నట్టు? పైగా కాల్వలే లేని కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పడం జనాల్ని మభ్యపెట్టడమే! బీఆర్ఎస్​సర్కారు గొప్పగా చెప్పుకునే ధరణి పోర్టల్​లో మాడ్యూళ్లకు లొంగని లోపాలు ఉన్నది నూటికి నూరుపాళ్లు నిజం. ఆన్​లైన్​లో వేలాది సర్వే నంబర్లు మిస్ కావడం, ఒకరి భూములు మరొకరి పేర్లపై రావడం, పాతపట్టాదార్ల పేరుతో కొత్త పాస్​బుక్​లు ఇష్యూకావడం అన్నీ నిజమే! వీ6 – వెలుగు చూపింది, రాసింది ఇదే. ఒకవేళ ఇది తప్పయితే  ధరణి పోర్టల్​లోని మాడ్యూల్స్ ద్వారా ఈ రెండున్నరేళ్లలో వివిధ సమస్యలపై12 లక్షలకుపైగా అర్జీలు ఎందుకు వచ్చినట్టు? ఇన్ని లక్షల పెండింగ్​ అప్లికేషన్లను పెట్టుకొని ధరణి అద్భుతం అని చెప్పుకోవడం ముమ్మాటికీ గోబెల్స్ ప్రచారమే! రూ.40 వేల కోట్లతో చేపట్టిన మిషన్​భగీరథ స్కీం దేశానికే ఆదర్శం అంటూ సర్కారు పెద్దలు జబ్బలు చరుచుకుంటున్నారు సరే, కానీ పబ్లిక్​ ఆ నీళ్లను తాగడం లేదన్నది పచ్చి నిజం కాదా! తరచూ పైపులు పగలడం, నీళ్లు ట్యాంకులకు ఎక్కకపోవడం.. ఇవన్నీ కండ్ల ముందు జరుగుతున్నవే! మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నెత్తిన రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిన కేసీఆర్ అండ్​కో రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’ చేశామని చెప్పుకోవడం, ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడం కాక మరేమిటి? 

హిట్లర్​ పాలన తరహా?

ఒక ఉద్యమకారుడి నుంచి ఫక్తు రాజకీయ నాయకుడిగా ఎదిగిన కేసీఆర్​ను ఇవాళ మనం చూస్తున్నాం. సబ్బండ వర్ణాలు కొట్లాడితే వచ్చిన తెలంగాణ, కేవలం తన వల్లే వచ్చిందని ఇటీవలి దశాబ్ది ఉత్సవాల్లో ఆయన చెప్పుకున్నారు. ‘మనం’, ‘మన వల్ల’ అనే పదాలు కేసీఆర్​ మరిచిపోయి చాలా కాలమైంది. అన్నింటికీ ‘నేను’, ‘నా వల్లే’ అనే మాటలే ఆయన నోట వినిపిస్తున్నాయి. ‘అపర భగీరథుడు, తెలంగాణ గాంధీ, తెలంగాణ జాతిపిత, రైతుబాంధవుడు, బంగారు తెలంగాణ ప్రదాత’.. అంటూ రకరకాల పేర్లతో కేసీఆర్​ను కీర్తించేందుకు ఆయన అనుచరగణం ఇటీవలి కాలంలో పోటీపడ్తున్నది. ఇలాంటి కీర్తి కండువాలను భుజాన కప్పుకుంటున్న కేసీఆర్ తన వందిమాగధులతో కాళ్లను కూడా పట్టించుకోవడం చూస్తున్నాం. ఇటీవలి దశాబ్ది ఉత్సవాలను చూడండి. ఆ వేడుకల్లో కేసీఆర్​, ఆయన స్కీముల భజన తప్ప ఉద్యమకారుల ఊసేలేదు. అమరవీరుల యాది లేదు. తెలంగాణ తల్లి తలంపు లేదు. యాస, భాష పట్టిలేదు. కళాకారుల పాటలేదు. బతుకమ్మ లేదు. బోనం లేదు. ఇది నియంతృత్వంగాక మరేమిటి? రాష్ట్రంలో కేసీఆరే పెద్దాఫీసరు. ఆయనే ఇంజినీరు. ఆయనే జర్నలిస్టు. ఆయనే కవి, రచయిత కూడా. సర్వేలు, రిపోర్టులు పేరుకే. ప్రాజెక్టు ఎక్కడ, ఎలా కట్టాలో ఇంజినీర్లకు, కవిత్వం, కథలు ఎలా రాయాలో కవులు, రచయితలకు చెప్పే ఆయన ఇటీవల వార్తలు ఎలా రాయాలో జర్నలిస్టులకు కూడా చెప్తున్నారు. ఇలాంటి తెలంగాణలో  పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే ముందు1940వ దశకంలో జర్మనీలోని నియంత హిట్లర్​పాలన గురించి మాట్లాడుకోవాలి.1933లో జర్మనీలో అధికారంలోకి వచ్చిన నాజీలు తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రజలను భ్రమల్లో ముంచడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. ఇందుకోసం జోసెఫ్ గోబెల్స్ నేతృత్వంలో Reich Ministry of Enlightenment and Propaganda పేరుతో ఏకంగా ఒక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేశారు. చేయనిది చేసినట్టు, జరగనిది జరిగినట్టు ప్రచారం చేసేవాళ్లు.  తాము చెప్పింది రాసేలా, తాము ఇచ్చిందే చదివేలా పేపర్లు, మ్యాగజైన్లు, పుస్తకాలు, రేడియోపై సెన్సార్​షిప్​విధించి నియంత్రించేవాళ్లు. 1934 నుంచి నాజీ ప్రభుత్వాన్ని విమర్శించడం చట్టవిరుద్ధంచేశారు. ఎవరు ఏ చిన్న విమర్శ చేసినా కేసులు పెట్టి జైళ్లపాలు చేసేవాళ్లు. ఆ రోజుల్లో హిట్లర్ గురించి జోక్ చెప్పినా రాజద్రోహంగా పరిగణించి శిక్ష విధించేవాళ్లంటే అక్కడ ఫ్రీడమ్​ ఆఫ్​ ప్రెస్​ పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తాము అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే నాజీ వ్యతిరేక వార్తలు రాసే పలు పత్రికలను మూసేసిన హిట్లర్​ సర్కారు, మరికొన్నింటిని స్వాధీనం చేసుకున్నది. ఇంకా  హిట్లర్​ తెలివి తక్కువ నిర్ణయాలు, ఆయన భజనపరుల అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ‘జర్మనీ ఫస్ట్. జర్మన్లు ఫస్ట్​’ అనే నినాదాలను తెరపైకి తెచ్చేవాళ్లు(అచ్చం మన బంగారు తెలంగాణ లాగ!) హిట్లర్​.. జర్మన్లను రక్షించేందుకు దివి నుంచి దిగివచ్చిన దేవుడు అంటూ కీర్తించేవాళ్లు.  ‘హిట్లర్​ఈజ్​ఆల్వేస్​ రైట్’​ అనే స్థాయిలో ఈ ప్రచారం ఉండేది. గత పాలన అంతా దుర్మార్గమని, అది జర్మన్లను అణగదొక్కిందని, నాజీలు అధికారంలోకి వచ్చాకే జర్మన్లు తలెత్తుకు తిరుగుతున్నారని, యూరప్​ దేశాలను వెనక్కి నెట్టి అభివృద్ధిలో జర్మనీ దూసుకుపోతోందని ప్రచారం చేసేవాళ్లు. ఇది చదువుతున్నంత సేపు హిట్లర్​ కాలంనాటి పరిస్థితులకు, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులకు అనేక సారూప్యతలు కనిపించాయి కదా!

పథకాల మాటున దందాలు

‘అబ్​కీ బార్​ కిసాన్​ సర్కార్’​ అంటూ కేసీఆర్​ దేశాటనకు బయలుదేరవచ్చు కానీ కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వనప్పుడు, క్రాప్​లోన్లు మాఫీ చేయకుండా 36 లక్షల మంది రైతులను డిఫాల్టర్లు చేసినప్పుడు ఇది రైతు సర్కారు ఎట్లా అవుతుంది? రెండేళ్లలో 30 వేల దళితబంధు యూనిట్లను గ్రౌండింగ్​ చేయలేని ప్రభుత్వం.. రాష్ట్రంలోని18 లక్షల దళిత కుటుంబాలను లక్షాధికారులను చేసేందుకు ఎన్నేండ్లు పడ్తుంది? వాళ్లను ఇంకెంత కాలం భ్రమల్లో ముంచుతుంది? కనీ వినీ ఎరగని పరిహారం, పునరావాసం అంటూ మభ్యపెట్టి పరిహారం కోసం రోడ్డెక్కిన నిర్వాసితులకు బేడీలు వేయడం, గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన వేల ఎకరాల భూములను అభివృద్ధి పేరుతో లాక్కోవడం, కొలువులు అడిగిన నిరుద్యోగులను తొమ్మిదేండ్లు మభ్యపెట్టి, తీరా ఎన్నికల ఏడాది పేపర్​ లీకేజీలతో వాళ్ల మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడం.. ఇవన్నీ మీ మేడిపండు సర్కారులోని డొల్లతనాన్ని బయటపెట్టిన ఘటనలే కదా! ప్రజల మొహాన నాలుగు సంక్షేమ పథకాలు పడేసి, వాటి మాటున కేసీఆర్​ అండ్​ కో చేస్తున్న ల్యాండ్​, సాండ్​, గ్రానైట్ దందాలు తెలియనిదెవరికి? 

నిజాలు చెప్తున్న ‘వీ6 - వెలుగు’ పై ఆంక్షలా?

తెలంగాణ ఉద్యమ సమయంలో నడపలేక వదిలేసిన ఓ పేపర్​ను తెలంగాణ రాగానే సొంతం చేసుకున్న సంగతిని తెలంగాణ సమాజం ఇంకా మరిచిపోలేదు. ఇంకా కొన్ని పేపర్లను, టీవీ చానళ్లను నయానో, భయానో లొంగదీసుకోవడం, యాడ్స్​తో మలుపుకోవడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో జనం పక్షాన నిలబడిన వీ6 - వెలుగును లొంగదీసుకునేందుకు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం​ చేయని ప్రయత్నాలంటూ లేవు. బెదిరింపులకు లొంగకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్​ యాడ్స్​ రాకుండా ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్ర చేశారు. అయినా వాళ్ల ఆశయం నెరవేరలేదు. దీంతో ఇటీవల పార్టీ మీటింగులకు పిలవద్దని మంత్రి కేటీఆర్​బీఆర్ఎస్​ క్యాడర్​ను ఆదేశిస్తే , ఆయన చెల్లెలు ఎమ్మెల్సీ కవిత ఏకంగా ‘వీ6 చూడొద్దు.. వెలుగు చదవద్దు’ అంటూ ఉపదేశం చేశారు. ఇక సీఎం కేసీఆర్ ఏకంగా​ వీ6 - వెలుగును అధికారిక కార్యక్రమాలకూ పిలవద్దని తాజాగా అధికారులకు ఇంటర్నల్​ ఆదేశాలు ఇచ్చారు. నిజానికి అబద్ధాలు రాసే పత్రికలు, చానళ్లపై లీగల్​ యాక్షన్​ తీసుకునే అవకాశం పార్టీలకు, ప్రభుత్వాలకు ఎలాగూ ఉంటుంది. కానీ ఓ గుడి, ఓ ప్రాజెక్టు, ఓ సెక్రటేరియెట్ కట్టి, ఓ స్టాచ్యూ పెట్టి బంగారు తెలంగాణ అయిపోయిందని ప్రజలను భ్రమల్లో ముంచి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీఆర్ఎస్​ పెద్దలకు.. తన మేడిపండు పాలనలోని లోగుట్టును ప్రజలకు విప్పి చెప్పే ‘వీ6 - వెలుగు’ సహజంగానే కంటగింపుగా మారింది. అందుకే ఇలాంటి వెలి, వెకిలి నిర్ణయాలు వస్తున్నాయి. కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడి ‘వెలుగు’ను ఆపగలరా?
- చిల్ల మల్లేశం,సీనియర్​ జర్నలిస్టు