- పాత ప్లేస్‌కు వెళ్లిపోయిన కూరగాయల వ్యాపారులు
- డిజైన్ లోపమే కారణమని విమర్శలు
- మరోవైపు ఆందోళనలో టెండర్ దారులు
సూర్యాపేట, వెలుగు: కూరగాయలు, మాంసం, పూలు, పండ్లు ఒకేచోట లభించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించిన గత ప్రభుత్వం పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్‌తో పాటు పక్కనే ఉన్న రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులను ఇందులోకి తీసుకొచ్చింది. కానీ, డిజైనింగ్ లోపంతో అనుకుస్థాయిలో వ్యాపారాలు సాగకపోవడంతో వాళ్లు వారం రోజులకే పాత ప్లేస్‌కు వెళ్లిపోయారు. దీంతో అధికారులు మార్కెట్‌కు తాళం వేశారు. మరోవైపు చిరువ్యాపారులు, వినియోగదారులను నమ్ముకొని టెండర్ పద్ధతిలో మార్కెట్‌లోని దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
రూ.30 కోట్లతో 6 ఎకరాల్లో నిర్మాణం
గత బీఆర్‌ఎస్ సర్కారు ఆరేళ్ల కింద పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఆవరణలో ఇటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దేశంలో మొట్టమొదటి గ్రీన్ మార్కెట్‌యార్డు పేరిట జర్మన్ టెక్నాలజీతో జీ ప్లస్ వన్ పద్ధతిలో రూ.30 కోట్లతో 6 ఎకరాల విస్తీర్ణంలో 5 బ్లాకుల్లో దీన్ని నిర్మించారు. కూరగాయలు, చేపలు, చికెన్, మటన్, పూలు, పండ్లు విక్రయ స్టాళ్లు, షాపింగ్ మాల్స్‌కలిపి 300 దుకాణాలు ఏర్పాటుకు చేశారు.
ఇందులో షాపింగ్ మాల్‌లో165 కమర్షియల్ షాపులు ఉన్నాయి. దుకాణాలతో పాటు ఒక బ్యాంకు, బాంక్వెట్ హాల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఏటీఎం సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని ఈ ఏడాది ఆగష్టు 20 మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించగా.. సెప్టెంబర్‌లో కూరగాయల వ్యాపారులను మార్కెట్‌లోనికి తరలించారు.
డిజైన్ లోపమే కారణం?
ఇంటిగ్రేటేడ్ మార్కెట్‌ను జర్మన్ టెక్నాలజీతో నిర్మించామని అధికారులు చెబుతున్నా.. కూరగాయలు, చేపలు, మాంసం దుకాణాల నిర్వహణకు అనుగుణంగా లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందరం ఒకే చోటుకు రావడంతో గిరాకీ అనుకున్నస్థాయిలో రావడం లేదని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. ఇంత ఖర్చు పెట్టే బదులు ఓపెన్ ప్లేస్‌లో తక్కువ ఖర్చుతో వేర్వేరుగా షెడ్‌లు నిర్మించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు మార్కెట్ ప్రారంభించిన తర్వాత ఎన్నికలు రావడం, ఆ తర్వాత అధికారులు మార్కెట్ నిర్వహణ పట్టించుకోకపోవడం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఆందోళనలో టెండర్ దారులు
మార్కెట్‌లో ఏర్పాటు చేసిన దాదాపు 300 దుకాణాలకు సెప్టెంబర్‌లో టెండర్ పిలిచారు. అప్పటికే కూరగాయల వ్యాపారులు మార్కెట్‌కి వెళ్లడంతో వ్యాపారులు రూ.10 వేలు చెల్లించి టెండర్‌లో పాల్గొని దుకాణాలను దక్కించుకున్నారు. అనంతరం రెండు నెలల్లో రూ. 20 వేలు అడ్వాన్స్ చెల్లించి మార్కెట్‌లోకి వెళ్లాలని మున్సిపల్‌శాఖ అధికారులు వీరికి నోటీసులు ఇచ్చారు. అయితే వారానికే కాగా కూరగాయల వ్యాపారులు బయటకు రావడంతో మార్కెట్‌కు తాళం పడ్డది. దీంతో ఆడ్వాన్స్ చెల్లించాలో..? టెండర్ రద్దు చేసుకోవాలో..? తెలియని టెండర్‌దారులు అయోమయంలో ఉన్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు
కొద్ది రోజుల కింద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభించాం. షాపులకు టెండర్ పిలువగా కొందరు వ్యాపారులు దక్కించుకున్నారు. అంతలోనే ఎన్నికలు రావడంతో దుకాణాల్లోకి వచ్చేందుకు వాళ్లు ఆసక్తి చూపకపోవడంతో తాళం వేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మార్కెట్‌ను తిరిగి ప్రారంభిస్తాం.
రామంజుల రెడ్డి, మున్సిపల్ కమిషనర్