సంక్షేమంలో తెలంగాణకు ఏ రాష్ట్రం సాటిరాదు..పోటీ ఇవ్వలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో నడిగడ్డ ప్రజల బాధలను చూసి చలించిపోయానని చెప్పారు. నాడు వేదనతో బాధపడ్డ పాలమూరు జిల్లా..ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ భూత్పూర్ మార్గంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కలెక్టర్ వెంకట్రావ్ను సీట్లో కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
సంస్కరణలు కొనసాగుతాయి..
రాష్ట్రంలో ఏడేళ్ల క్రితం కరెంటు బాధలుండేవని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్గా ఉందని చెప్పారు. రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఏ తెలంగాణ కావాలనుకున్నానో..ఆ దిశగా తెలంగాణ అడుగులు వేస్తోందని చెప్పారు. కంటి వెలుగు అనే కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమమని వెల్లడించారు. ఓట్ల కోసం పెట్టిన కార్యక్రమం కాదని..ఎంతోమందికి ఈ పథకం ద్వారా చూపు లభించిందని తెలిపారు. మరో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టినా సమగ్రమైన అధ్యయనం చేసిన తర్వాతే మొదలుపెడుతున్నామన్నారు. రాష్ట్రంలో సంస్కరణలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.