మూడు మున్సిపాలిటీలకు రూ. కోటి

 మూడు మున్సిపాలిటీలకు రూ. కోటి

పెద్దపల్లి/కరీంనగర్​ టౌన్​, వెలుగు:  పెద్దపల్లి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలన్ని ఎట్టకేలకు సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. వాస్తవానికి ఈ కలెక్టరేట్ గతేడాది దసరాకే పూర్తయినప్పటికీ సీఎం టైం ఇవ్వకపోవడంతో సుమారు ఏడాది పాటు వెయిట్​ చేయాల్సి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 2గంటలకు పెద్దపల్లి చేరుకున్న సీఎం కేసీఆర్​ రాఘవాపూర్​ఫ్లై ఓవర్​ వద్ద నిర్మించిన టీఆర్ఎస్​ భవన్​కు ప్రారంభించారు. తర్వాత ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి ఇంట్లో లంచ్​ చేసి తిరిగి మధ్యాహ్నం 3.30కి కలెక్టరేట్​ చేరుకొని ప్రారంభోత్సవం చేశారు.

అక్కడి నుంచి 4.40 గంటలకు పెద్దకల్వలోని బహిరంగ సభకు హాజరై, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాపై సీఎం కేసీఆర్​ వరాలు కురిపించారు. జిల్లాలోని 266 గ్రామ పంచాయితీలకు  రూ. 10 లక్షల చొప్పున,  రామగుండం కార్పొరేషన్​తో పాటు మూడు మున్సిపాలిటీలకు రూ. కోటి చొప్పున కేటాయించారు. ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్​ లేకపోయినా పెద్దపల్లిని జిల్లాగా ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. రామగుండం పట్టణాన్ని కార్పొరేషన్​గా,  మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి పట్టణాలను మున్సిపాలిటీలుగా చేసుకుని అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. కాగా,  బహిరంగ సభ సక్సెస్​ కావడంతో టీఆర్ఎస్​ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. 

భారీగా తరలిన పార్టీ శ్రేణులు..    

పెద్దపల్లిలో జరుగుతున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఆదివారం స్థానిక ఉజ్వల పార్కు సమీపంలోని స్పోర్ట్స్ స్కూల్ వద్ద పెద్దపల్లి వెళ్తున్న టీఆర్​ఎస్​ వాహనాలను మంత్రి గంగుల కమలాకర్ జెండా ఊపి ప్రారంభించారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి బస్సులు, కార్లతో మంత్రి కమలాకర్ బయలుదేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాను ప్రకటించిన తర్వాత మొదటి సారి సీఎం వస్తున్నందున అధినేతను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారన్నారు. లక్షమందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా సభలో పాల్గొంటున్నారని తెలిపారు. బీడుపడిన భూములు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలంగా తయారైనందున రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. రెట్టింపు అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ సునీల్ రావు, చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు బండారి వేణు, బోనాల శ్రీకాంత్, కొండపల్లి సరిత, గంధెమాధవి పాల్గొన్నారు.   

జమ్మికుంట: పెద్దపల్లిలో జరిగే సీఎం కేసీఅర్ బహిరంగ సభకు జమ్మికుంట పట్టణంతోపాటు మండలం నుంచి టీఆర్ఎస్​ శ్రేణులు, ప్రజలు వందకు పైగా బస్సులలో, ఇతర వాహనాలలో భారీగా తరలి వెళ్లారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల అభ్యునతి కోసం తెలంగాణ రాష్ట్ర లో ముఖ్యమంత్రి కేసీఅర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్న , సహకార సంఘం చైర్మెన్ సంపత్, కౌన్సిలర్లు, లీడర్లు పాల్గొన్నారు. 

సీఎం పర్యటనతో ముందస్తు అరెస్టులు  

పెద్దపల్లి, గోదావరిఖని, వెలుగు : సీఎం పర్యటన సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల లీడర్లు, వీఆర్ఏలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల పరిధిలోని మంథని, రామగిరి, కమాన్​పూర్, ముత్తారం, సుల్తానాబాద్, గోదావరిఖనికి చెందిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గోదావరి ఖనిలో తెల్లవారుజామునుంచే పోలీసులు లీడర్ల ఇండ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. రామగుండంలో బీజేపీ స్టేట్‌‌‌‌ లీడర్‌‌‌‌ కౌశిక హరి, రామగుండం కార్పొరేటర్‌‌‌‌ కౌశిక లతను పోలీసులు హౌస్​అరెస్ట్‌‌‌‌ చేశారు. గోదావరిఖనిలో కాంగ్రెస్‌‌‌‌ నేత ఎంఎస్‌‌‌‌ రాజ్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండి ముస్తఫా తదితరులను పోలీస్‌‌‌‌స్టేషన్లకు తరలించి సాయంత్రం వదిలిపెట్టారు.  

పోలీసులకు గాయాలు..

కమాన్‌‌‌‌పూర్‌‌‌‌:  సీఎం పర్యటన నేపథ్యంలో డ్యూటీ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వస్తున్న బాంబ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌ సిబ్బందితో ఉన్న వ్యాన్ కమాన్‌‌పూర్  గ్రామ శివారులో ప్రమాదానికి గురైంది. సోమవారం తెల్లవారుజామున ఎదురుగా వచ్చే బైక్‌‌‌‌ను తప్పించబోయి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకుపోగా అందులో ప్రయాణిస్తున్న హెడ్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ భాస్కర్‌‌‌‌, కానిస్టేబుల్‌‌‌‌ నరేశ్‌‌‌‌కు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని కరీంనగర్‌‌‌‌లోని అపోలో రీచ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. పెద్దపల్లి డీసీపీ రూపేశ్ పోలీసులను పరామర్శించారు.