కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయ్ అయిన మల్లన్న సాగర్ లోకి నీటిని విడుదల చేశారు సీఎం కేసీఆర్. ప్రత్యేక పూజల అనంతరం స్విచ్ఛాన్ చేసి నీటిని రిలీజ్ చేశారు. రిజర్వాయర్ ను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు.
రాష్ట్రంలోని ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్. సిద్దిపేట జిల్లా తొగుట,కొండపాక మండలం సరిహద్దులో దీనిని నిర్మించారు. 8 గ్రామాలతో పాటు మొత్తం 14 శివారు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. దీని సామర్థ్యం 50 టీఎంసీలు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్ పంప్ హౌస్ కు చేరిన గోదావరి జలాలను మల్లన్న సాగర్ లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్ తో మొత్తంగా ఉమ్మడి మెదక్ తో పాటు ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోని దాదాపు 11.29 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఈ రిజర్వాయర్ కు 5 తూములు(స్లూయిజ్ లు) ఉన్నాయి. వీటి ద్వారా కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్ కు, సింగూర్ ప్రాజెక్టుకు, తపాస్ పల్లి రిజర్వాయర్ కు,మిషన్ భగీరథకు నీటిని తరలిస్తారు. అంతేగాకుండా హైదరాబాద్ తాగునీటి కోసం 20 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం16 టీఎంసీలు వాడుతారు