బ్రాహ్మణులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు.. వేద పండితుల భృతి రూ. 5 వేలకు పెంపు

బ్రాహ్మణులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు..  వేద పండితుల భృతి రూ. 5 వేలకు పెంపు

హైదరాబాద్: బ్రాహ్మణులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. గోపన్ పల్లిలో 6.10 ఎకరాల స్థలంలో నిర్మించిన బ్రాహ్మణ సదన్ ను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. ప్రభుత్వం 75 ఏండ్లు నిండిన బ్రాహ్మణ వేద పండితులకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ. 2,500 భృతిని రూ. 5 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు వయో పరిమితిని కూడా 65 ఏండ్లకు తగ్గిస్తున్నట్టు చెప్పారు. దేశంలో బ్రాహ్మణ సదనం ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కేసీఆర్ అన్నారు. ధూపదీప నైవేద్యం పథకాన్ని మరో 2,796 ఆలయాలకు వర్తింపజేస్తున్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటి వరకు ఈ పథకం కింత ప్రతి నెలా 6 వేల రూపాయలు ఇచ్చేదని, దానిని రూ. 10 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు. 

సంస్కృత పండితుడు, కవి, విమర్శకుడిగా పేరు గాంచిన మల్లినాథ సూరి పేరిట ఆయన జన్మించిన మెదక్ జిల్లాలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎకరం స్థలంలో బ్రాహ్మణ సదనం నిర్మాణం పూర్తయిందని, ఖమ్మం మధిర, బీచుపల్లిల్లోనూ నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని ఏడు వేల పేద బ్రాహ్మణ కుటుంబాలకు వివిధ పథకాల కింద సాయం అందించామన్నారు. కాశీలోనూ తెలంగాణ యాత్రికుల కోసం ప్రత్యేకంగా బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. లోక హితం కోసం బ్రాహ్మణులు పనిచేస్తున్నారని, వారి కోసం స్కాలర్ షిప్ లు, వివేకా నంద విద్యానిధి, బిజినెస్ చేసుకునేందుకు ఆర్థికసాయం చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. 

బ్రాహ్మణ సదనంలో లైబ్రరీని ఏర్పాటు చేయాలని కేవీ రమణాచారిని కోరుతున్నట్టు తెలిపారు. ఐఐటీ, ఐఐఎంలలో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బ్రహ్మణ పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.