కరీంనగర్, వెలుగు : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ముదిరాజ్ లీడర్లలో ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకుండా ముదిరాజ్ లను అవమానించారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుర్రాల మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా 115 ఎమ్మెల్యే సీట్లపై పునరాలోచన చేసి అవకాశం ఉన్న చోట ముదిరాజ్ లకు టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ టికెట్లు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో కరీంనగర్ సిటీలో తెలంగాణ చౌక్ నుంచి కోర్టు చౌరస్తా వరకు ముదిరాజ్ కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ రాష్ట్రంలో 56 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ లు రాజకీయ అణచివేతకు గురవుతున్నారని అన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ముదిరాజ్ లు ప్రధాన భూమిక పోషించారని, తొలి అమరుడు పోలీసు కిష్టన్న తమ జాతి బిడ్డేనని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన తమను బీఆర్ఎస్ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తో పాటు మిగతా పార్టీలు కూడా ముదిరాజ్ లకు జనాభాకు అనుగుణంగా టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి, చిగురుమామిడి జెడ్పీటీసీ రవీందర్ పాల్గొన్నారు.