హైదరాబాద్ : నీటి పారుదల రంగానికి సంబంధించిన బడ్జెట్ ని ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. ఈ ఏడాదికిగాను తాత్కాలికంగా సాగునీటి రంగానికి రూ.22,500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు కేసీఆర్. రానున్న ఐదేళ్లలో కృష్ణా, గోదావరిలలో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకొని, కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తొలి నాలుగేళ్లలోనే ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని, 90 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేసీఆర్ తెలిపారు.
అన్ని ప్రాజెక్టులకు అనుమతులను కూడా సంపాదించగలిగామని చెప్పారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని ఈ వర్షాకాలంలోనే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రానున్న ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని.. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 20 వేలకుపైగా చెరువుల పునరుద్ధరణ జరిగినట్లు చెప్పారు సీఎం కేసీఆర్.