న్యూఢిల్లీ: హస్తినలో మూడో రోజు సీఎం కేసీఆర్ టూర్ కొనసాగుతోంది. వడ్ల కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తామన్న కేసీఆర్.. హస్తిన పర్యటనలో సోమవారం క్యాంప్ ఆఫీసుకే పరిమితమయ్యారు. ఆదివారం సాయంత్రం హస్తిన చేరుకున్న ఆయన.. తుగ్లక్ రోడ్ 23లోని సీఎం అధికారిక నివాసంలో సోమవారం రెస్ట్ తీసుకున్నారు. కేసీఆర్ వెంట వచ్చిన మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వారికంటే ముందు రోజే ఢిల్లీ చేరుకున్న మంత్రి కేటీఆర్, ఇతర నేతలు సీఎంతోనే ఉన్నారు. ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారని మధ్యాహ్నం వరకు ప్రచారం జరిగింది. ఆ తర్వాత సాయంత్రానికి.. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పీయూష్ గోయల్ తో భేటీ అవుతారని చెప్పారు. కానీ చివరికి ఎలాంటి మీటింగ్ జరగలేదు.
అపాయింట్ మెంట్ కష్టాలు
ప్రధాని, కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోరింది CMO. ప్రధాని మోడీ, కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రి పీయూష్ గోయల్, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ల అపాయింట్మెంట్ ను సీఎంవో కోరినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రధాని, కేంద్ర మంత్రులు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని.. ఇవ్వాళో, రేపో అపాయింట్ మెంట్ వస్తుందిని గులాబీ నేతలు అంటున్నారు. కాగా, ఢిల్లీలో ఉన్న రాష్ట్ర మంత్రులు, సీఎస్, ఆయా శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ వివిధ అంశాలపై సమీక్ష చేసినట్టు సమాచారం. ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీతో సీఎస్ భేటీ అయ్యారు. కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సుధాన్ష్ పాండేతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని కృషి భవన్ లో జరిగిన సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్, సివిల్ సప్లైయర్స్ కమిషనర్ అనిల్ కుమార్, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. వడ్ల కొనుగోలు కోటా పెంచాలని కోరినట్లు సమాచారం. 40 లక్షల టన్నుల రైస్ కు బదులుగా.. 90 లక్షల టన్నుల రైస్ కొనాలని కోరారు. ఈ భేటీ తర్వాత CS, ఉన్నతాధికారులు CM కు బ్రీఫ్ చేసినట్లు తెలిసింది. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత క్లారిటీ వచ్చినట్లు సమాచారం.